AP EAP CET Issue: ఈఏపీ సెట్‌ పరీక్షా కేంద్రాల కేటాయింపుతో విద్యార్ధులకు చిక్కులు-difficulties for students in allotment of ap eap cet examination centers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Eap Cet Issue: ఈఏపీ సెట్‌ పరీక్షా కేంద్రాల కేటాయింపుతో విద్యార్ధులకు చిక్కులు

AP EAP CET Issue: ఈఏపీ సెట్‌ పరీక్షా కేంద్రాల కేటాయింపుతో విద్యార్ధులకు చిక్కులు

HT Telugu Desk HT Telugu
May 11, 2023 06:34 AM IST

AP EAP CET Issue: ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్ ప్రవేశపరీక్షా కేంద్రాలను ఇతర రాష్ట్రాల్లో కేటాయించడంతో విద్యార్ధులు అవస్థలకు గురవుతున్నారు.

ఈఏపీసెట్ పరీక్షా కేంద్రాలతో విద్యార్ధులకు చిక్కులు
ఈఏపీసెట్ పరీక్షా కేంద్రాలతో విద్యార్ధులకు చిక్కులు

AP EAP CET Issue: ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీ సెట్‌కు హాజరవుతున్న విద్యార్ధులకు ఇతర రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించడంతో విద్యార్ధులకు ఇబ్బందులు తప్పడం లేదు. విద్యార్ధులు దరఖాస్తులు నింపే సమయంలో సాంకేతికంగా చేసిన పొరపాట్లే దీనికి కారణమని నిర్వాహకులు చెబుతుంటే, అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం వల్లే ఇలా జరిగిందని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌లో ఆంధ్రా విద్యార్థుల్లో కొందరికి హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. పరీక్షా కేంద్రాల కేటాయింపును మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదట ప్రాతిపదికన కేటాయించారు.

ఈఏపీ సెట్‌కు చివరిలో దరఖాస్తులు చేసుకున్న వారికి తమకు అందుబాటులో ఉన్న కేంద్రాల్లో ఖాళీలు లేకపోవడంతో ఖాళీలు చూపిన కేంద్రాలను ఎంచుకున్నారు. ఇలా ప్రవేశ పరీక్ష రాసేందుకు విద్యార్థులు హైదరాబాద్‌ వెళ్లాల్సి రావడంతో ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణ ఎంసెట్‌కు కూడా ఏపీ నుంచి పలువురు విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్పెనారు. తెలంగాణ ఎంసెట్ నిర్వాహకులు వారికి ఆంధ్రప్రదేశ్‌లోనే పరీక్షా కేంద్రాలు కేటాయించింది. ఏపీ ఈఏపీసెట్‌కు మాత్రం పరీక్ష కేంద్రాల కొరతతో హైదరాబాద్‌లో ఇచ్చారు.

ఆంధ్రాలో నిర్వహిస్తున్న ఈఏపీసెట్‌కు గతేడాది కంటే దరఖాస్తులు ఎక్కువ రావడంతో మొదట్లోనే రాష్ట్రంలోని చాలా పరీక్ష కేంద్రాల్లో సీట్లు నిండిపోయాయి.విద్యార్ధులు దరఖాస్తు చేస్తున్న సమయంలో చిత్తూరు, హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌, సికింద్రాబాద్‌లోని పరీక్ష కేంద్రాలే ఆన్‌లైన్‌లో కనిపించాయి.

ఇంటర్మీడియట్ కాలేజీలు ఎక్కువగా ఉన్న గుంటూరు, విజయవాడ, ఏలూరుకు చెందిన విద్యార్థులు హైదరాబాద్‌లోని కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. పరీక్షా కేంద్రాల సమస్యపై దరఖాస్తు సమయంలోనే సహాయ కేంద్రాలకు అభ్యర్థులు ఫోన్‌ చేసినా స్పందన లేదని ఆరోపిస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో కేంద్రాలు ఎంచుకున్న వారికి మార్పు చేస్తున్నామని ఉన్నత విద్యామండలి ప్రకటించినా కొందరికి పరీక్షా కేంద్రాలు మారలేదని చెబుతున్నారు.

తెలంగాణ ఎంసెట్‌కు ఏపీలో ఇంటర్మీడియట్‌ చదివిన వారు 68,378 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి తెలంగాణ ప్రభుత్వం ఏపీలోనే అదనంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈఏపీ సెట్‌కు దరఖాస్తులు పెరుగుతున్న విషయం ముందే లో తెలిసినా చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి.

ఆప్షన్లు మార్చడం కుదరదు….

ఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసే సమయంలో పరీక్ష కేంద్రాల్లోని ఖాళీలతో సంబంధం లేకుండా తమకు దగ్గరలోని 3 కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత నాలుగైదు ఐచ్ఛికాలుగా ఖాళీగా కనిపించే కేంద్రాలను ఎంచుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇలా చేసిన వారికి ఇతర ప్రాంతాల్లో కేంద్రాలు కేటాయించినా మొదటి, రెండు ఐచ్ఛికాల్లోనే ఎగ్జామ్ సెంటర్స్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు. పరీక్ష కేంద్రాల్లో ఖాళీలు కనిపించలేదంటూ మొదటి మూడు ఆప్షన్లలో ఖాళీగా ఉన్న కేంద్రాలను ఎంపిక చేసుకున్న వారికి పరీక్షా కేంద్రాలను మార్చలేమని తేల్చేశారు.