TTD RathaSaptami: సూర్య వాహనంపై మలయప్ప స్వామి.. తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. పోటెత్తిన భక్తులు-devotees flocking to tirumala on the occasion of ratha saptami malayappa on surya vahanam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Rathasaptami: సూర్య వాహనంపై మలయప్ప స్వామి.. తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

TTD RathaSaptami: సూర్య వాహనంపై మలయప్ప స్వామి.. తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

Sarath chandra.B HT Telugu
Feb 16, 2024 09:07 AM IST

TTD RathaSaptami: తేజో నిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యుని వాహనంగా అధిరోహించి తిరుమలలో శ్రీ మలయప్ప స్వామి భక్తులను కటాక్షించారు. రథసప్తమి సందర్భంగా తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు.

సూర్యప్రభ వాహనంపై కొలువైన శ్రీ మలయప్ప దర్శనం
సూర్యప్రభ వాహనంపై కొలువైన శ్రీ మలయప్ప దర్శనం (TTD)

TTD RathaSaptami: సూర్య జయంతిని Surya Jayanti పురస్కరించుకొని తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు తిరుమాడ వీధులు చేరుకుని గోవిందుడికి మంగళ హారతులు పలికారు.

yearly horoscope entry point

రథసప్తమిRathaSaptami వేడుకల్లో ప్రధమ వాహనంగా సూర్య నారాయణుడు Suryanarayana సూర్య ప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు.

సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు.

ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే కావడంతో సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలూ పేర్కొంటున్నాయి.

వేకువజామునే దర్శనాలు…

ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ మొదలైంది. అక్కడి నుండి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకున్నారు శ్రీవారు. సూర్యోదయాన భానుడి తొలికిరణాలు శ్రీ మలయప్ప స్వామి వారి పాదాలను స్పృశించాయి. ఈ ఘట్టంను కనులారా తికలించిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు.

ఆలయ మాడవీధులంతా గోవిందా అనామ స్మరణతో మారుమ్రోగింది. అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. అదే సమయంలో గ్యాలరీల్లో వేచివున్న భక్తులు గోవిందనామ స్మరణలతో స్వామి వారిని దర్శించి అపూర్వంగా భావిస్తారు. ఇక 108 సార్లు ఆదిత్య హృదయం పిల్లల చే పఠించడం అనవాయితీగా వస్తుంది

తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 16న శుక్ర‌వారం రథసప్తమి పర్వదినం నిర్వ‌హ‌ణ‌ కొసం శ్రీ‌వారి ఆల‌యంతోపాటు అన్న‌ప్ర‌సాదం, నిఘా మ‌రియు భ‌ద్ర‌త‌, ఇంజినీరింగ్, ఉద్యాన‌వ‌న త‌దిత‌ర విభాగాలు ఏర్పాట్లు చేశాయి. స‌ప్త వాహనాలపై స్వామివారి వైభ‌వాన్ని తిల‌కించేందుకు పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేయ‌నుండ‌డంతో అందుకు త‌గ్గ‌ట్టు టీటీడీ ఏర్పాట్లు చేశారు

శ్రీ‌వారి ఆల‌యంలో తెల్ల‌వారుజామున కైంక‌ర్యాలు పూర్త‌యిన త‌రువాత ఉద‌యం 4.30 గంట‌ల‌కు శ్రీమలయప్ప స్వామివారు ఆలయం నుండి వాహనమండపానికి వేంచేశారు. అక్క‌డ విశేష స‌మ‌ర్ప‌ణ చేప‌ట్టారు.

సూర్య‌ప్ర‌భ‌ వాహనం(ఉదయం 5.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు)

ఉద‌యం 5.30 గంట‌ల‌కు సూర్యప్రభ వాహన‌సేవ మొద‌ల‌వుతుంది. అక్కడినుండి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోద‌యాన భానుడి తొలికిర‌ణాలు శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి పాదాల‌ను స్ప‌ర్శిస్తాయి. ఈ ఘ‌ట్టం భ‌క్తుల‌కు క‌నువిందు చేస్తుంది. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు భక్తకోటికి సిద్ధిస్తాయి.

చిన్నశేషవాహనం(ఉదయం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు)

పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

గ‌రుడ వాహనం(ఉదయం 11 నుండి 12 గంట‌ల వ‌ర‌కు)

శ్రీ‌వారికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన‌ది గ‌రుడ వాహ‌నం. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్పుతున్నాడు.

హనుమంత వాహనం(మ‌ధ్యాహ్నం 1 నుండి 2 గంట‌ల వ‌ర‌కు)

శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

చక్రస్నానం (మ‌ధ్యాహ్నం 2 నుండి 3 గంట‌ల వ‌ర‌కు)

శ్రీ‌వ‌రాహ‌స్వామివారి ఆలయం వ‌ద్ద గ‌ల స్వామిపుష్క‌రిణిలో చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్‌ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు.

కల్పవృక్ష వాహనం(సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు)

శ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.

సర్వభూపాల వాహనం(సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు)

సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని స్వామివారు అందిస్తున్నారు.

చంద్రప్రభ వాహనం(రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు)

చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

Whats_app_banner