AP EAPcet Results: తెలంగాణ పేచీ.. విడుదల కాని ఏపీ ఈఏపీ సెట్‌ ఫలితాలు-details of telangana students marks not received delay in release of ap eap set results ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Eapcet Results: తెలంగాణ పేచీ.. విడుదల కాని ఏపీ ఈఏపీ సెట్‌ ఫలితాలు

AP EAPcet Results: తెలంగాణ పేచీ.. విడుదల కాని ఏపీ ఈఏపీ సెట్‌ ఫలితాలు

HT Telugu Desk HT Telugu
Jun 07, 2023 09:33 AM IST

AP EAPcet Results: ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షకు హాజరైన తెలంగాణ విద్యార్ధుల ఇంటర్‌ మార్కుల వివరాలు అందకపోవడంతో మొత్తం ఫలితాల విడుదలకు ఆటంకంగా మారింది.

ఏపీ ఎంసెట్ ఫలితాలు
ఏపీ ఎంసెట్ ఫలితాలు

AP EAPcet Results: ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీ సెట్‌–2023 ఫలితాల విడుదలకు తెలంగాణ విద్యార్ధుల రూపంలో ఆటంకం ఎదురైంది. తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు ఏ కారణంతో జాప్యం చేస్తున్నారో నిర్దిష్టంగా తెలియకపోయినా వారి నిర్లక్ష్యం కారణంగా ఏపీలో ఈఏపీ సెట్‌ ఫలితాల విడుదలకు జాప్యం జరుగుతోంది.

తెలంగాణలో ఎంసెట్‌ ఫలితాలు విడుదలై పది రోజులు దాటిపోయింది. ఏపీలో ఈఏపీ సెట్‌ విద్యార్థుల ఫలితాలు సిద్ధంచేసిన ఉన్నత విద్యామండలి తెలంగాణ ఇంటర్‌ మార్కుల వివరాల కోసం ఎదురుచూస్తోంది. ఏపీలో గత రెండేళ్లుగా రాష్ట్రంలో ఈఏపీసెట్‌ ఫలితాలకు ఇంటర్‌ మార్కుల వెయిటేజీ ఇవ్వలేదు.

కొవిడ్‌ వల్ల పరీక్షలు నిర్వహించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మాత్రం పరీక్షలు నిర్వహిస్తున్నందున పాత విధానాన్ని పునరుద్ధరించి, ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. ఈఏపీసెట్‌లో వచ్చే మార్కులు, ఇంటర్‌లో వచ్చిన మార్కులను నార్మలైజేషన్‌ చేసి తుది మార్కులు, ర్యాంకులు ప్రకటిస్తారు.

ఏపీ ఇంటర్‌ బోర్డు నుంచి ఇంటర్‌ మార్కులు తీసుకుని, ఏపీ విద్యార్థుల వరకు ఫలితాల నార్మలైజేషన్‌ ప్రక్రియను దాదాపుగా పూర్తిచేశారు.మరోవైపు ఏపీ ఈఏపీ సెట్ పరీక్షకు ఈ ఏడాది 18 వేల మంది తెలంగాణ విద్యార్థులు హాజరయ్యారు. దీంతో వారి ఇంటర్‌ మార్కుల వివరాలు కూడా వస్తే తప్ప నార్మలైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది.

గత వారం రోజులుగా ఏపీ ఉన్నత విద్యామండలి తెలంగాణ విద్యార్థుల మార్కుల వివరాలు ఇవ్వాలని తెలంగాణ ఇంటర్‌ అధికారులను కోరుతున్నా ఇదిగో అదిగో అంటూ జాప్యం చేస్తున్నారు. దీంతో ఆ 18వేల మంది విద్యార్థుల కోసం మొత్తం ఏపీ ఈఏపీ సెట్‌ ఫలితాలు విడుదలలో జాప్యం జరుగుతోంది.

తెలంగాణలో ఇంటర్ వెయిటేజీ రద్దు….

తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ పరీక్షకు ఇంటర్‌ మార్కుల వెయిటేజీ రద్దు చేసింది. విద్యార్దులపై ఒత్తిడి లేకుండా చేయడంతో పాటు, కార్పొరేట్, ప్రభుత్వ కాలేజీల మధ్య హేతుబద్దమైన పోటీ కోసం వెయిటేజీ రద్దు చేస్తూ కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంసెట్ ర్యాంకుల్లో కార్పొరేట్ కాలేజీల్లో చదివిన విద్యార్దులకే ర్యాంకులు వస్తుండటంతో ఈ ఏఢాది నుంచి ఇంటర్ వెయిటేజీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మే 25నే తెలంగాణ ఈఏపీసెట్‌ ఫలితాలు కూడా విడుదల చేసింది.

తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో ఏపీ విద్యార్ధులే మెజార్టీ ర్యాంకులు సాధించుకున్నారు. తెలంగాణలో ఇంటర్ వెయిటేజీ రద్దు చేసినపుడు ఏపీ వారికి ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ అధికారులు తాత్సారం చేస్తున్నారని ఏపీ ఉన్నత విద్యా మండలి అనుమానిస్తోంది.

మరోవైపు ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ లేకపోతే ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల చాలా సులభం అవుతుంది. అన్నీ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలే కావడంతో మూల్యాంకనం చాలా వేగంగా పూర్తయింది. మరోవైపు ఇంటర్‌ మార్కులకు కూడా వెయిటేజీ ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం పట్టుబట్టింది.

ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలయ్యాక ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు షెడ్యూలు విడుదల చేస్తారు. ఇప్పటికే తెలంగాణలో ఫలితాలు వెలువడటంతో మంచి ర్యాంకింగ్‌ ఉన్న కాలేజీల్లో అడ్మిషన్లకు విద్యార్ధులు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ ఎంసెట్‌తో పాటు వీఐటీ, ఎస్‌ఆర్‌ఎం, కెెఎల్‌యు లాంటి డీమ్డ్‌ వర్శిటీల్లో ప్రవేశ పరీక్షలూ విద్యార్ధులు రాశారు.

ప్రైవేట్ డీమ్డ్‌ యూనివర్సిటీల్లో ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మరోవైపు ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల్లో జరుగుతున్న జాప్యం వల్ల ఇంజినీరింగ్‌ కాలేజీల్లో అడ్మిషన్లపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. మంచి ర్యాంకులు సాధించిన విద్యార్దులు తెలంగాణతో పాటు ప్రైవేట్ యూనివర్శిటీలకు విద్యార్ధులు చేరిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు తెలంగాణ విద్యార్దులు సైతం ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు రాకపోవడంతో స్థానికంగానే కాలేజీలను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.