Union Budget 2024 : రేపే కేంద్ర బడ్జెట్-ఏపీ వైపు చూసేనా? ఆంధ్రా ప్రజల ఆశలు నెరవేరేనా?
Union Budget 2024 : రేపు(మంగళవారం) ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈసారి కేంద్రంలో కీలకంగా మారిన ఏపీకి నిధులు ఏమాత్రం కేటాయిస్తారో అని చర్చ జరుగుతోంది.
Union Budget 2024 : రేపు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్‌పై లోక్‌సభలో 20 గంటల పాటు చర్చించేందుకు బిజినెస్ అడ్వజరీ కమిటీ (బీఏసీ) నిర్ణయం తీసుకుంది. ఈ చర్చల్లో అన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఈ బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈసారైనా తమ వైపు చూస్తోందని ఏపీ ప్రజలు గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. రాష్ట్రంలోని జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీడీపీ కూటమి గెలుపొందింది. అంతేకాకుండా బీజేపీకి జాతీయ స్థాయిలో సీట్లు తగ్గడంతో పూర్తిస్థాయి మెజార్టీ రాలేదు. అందువల్ల బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీపై ఆధారపడింది.
దీంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది. ఎందుకుంటే బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో ఏపీలోని టీడీపీ, బీహార్‌లోని జేడీయూ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు కీలక భూమిక పోషిస్తోన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ మద్దతుతోనే కేంద్రంలోని ప్రభుత్వం ఏర్పడింది. ఒకవేళ టీడీపీ మద్దతు ఇవ్వకపోతే, కేంద్రంలోని ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ ప్రభుత్వంలో టీడీపీ అంత కీలకం అయింది.
2014-19 వరకు కూడా చంద్రబాబు బీజేపీతోనే ఉన్నారు. కానీ అప్పుడు బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ ఉండేది. అందువల్ల ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలన్నా, లేకపోతే ప్రతిపక్షాలన్నా బీజేపీ పట్టించుకునేది కాదు. అలాగే 2019-24 మధ్య కూడా బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రావటంతో ఇతర రాజకీయ పక్షాలను పట్టించుకునేది కాదు. కానీ 2024 ఎన్నికల్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. అందుకే టీడీపీ, జనసేన మద్దతు బీజేపీకి కీలకంగా మారింది. కేంద్రంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి చంద్రబాబు సహకరించారు. మరి రాష్ట్రానికి నిధులు ఇచ్చి చంద్రబాబుకు బీజేపీ, ప్రధాని మోడీ సహకరిస్తారా? లేదా? అనే చర్చలు రాష్ట్రంలో జరుగుతున్నాయి.
ఇప్పటికే రెండు సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సహా అరడజనకు పైగా కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. కేంద్ర హోంమంత్రితో అయితే ఏకంగా రెండు సార్లు సమావేశం అయ్యారు. బడ్జెట్‌లో తమ రాష్ట్రానికి ప్రాధన్యత ఇవ్వాలని, అలాగే విభజన అంశాల అమలుకు ఆర్థిక మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌పైనే టీడీపీ ఆశలు పెట్టుకుంది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఆశించిన స్థాయిలో మద్దతు వస్తే పర్వాలేదు. రాకపోతే చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు, అలాగే బీజేపీకి టీడీపీ మద్దతు ఇవ్వడం వంటివి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వ్యర్థం అవుతాయి.
గత బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు ఎలా ఉన్నాయి?
గత బడ్జెట్‌లో ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు కేటాయింపులు తగ్గించారు. గతంలో కేటాయించిన అరకొర నిధుల్లోనే, ఈసారి కోత విధించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు 2023-24 బడ్జెట్‌లో రూ.683 కోట్లు కేటాయిస్తే, 2024-25 బడ్జెట్‌లో రూ.620 కోట్లు కేటాయించారు. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు రూ.63 కోట్లు కోత విధించారు. అలాగే విశాఖ పోర్టు ట్రస్ట్‌కు 2023-24 బడ్జెట్‌లో రూ.276 కోట్లు కేటాయిస్తే, 2024-25 బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయించారు. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు రూ.126 కోట్లు కోత విధించారు. వైజాగ్ పెట్రోలియం యూనివర్శిటీకి రూ.168 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో కూడా రూ.168 కోట్లు కేటాయించి, సవరించిన అంచనాల్లో దాన్ని కాస్తా రూ. 90 కోట్లకు కుదించారు.
సెంట్రల్ యూనివర్శిటీ, గిరిజన యూనివర్శిటీకి కేటాయింపులు ఏమీలేవు. సెంట్రల్ యూనివర్శిటీకి గత బడ్జెట్ (2023-24)లో రూ.112.08 కోట్లు కేటాయించగా, ఈసారి కేటాయింపులేమీలేవు. అలాగే గిరిజన యూనివర్శిటీకి కూడా గత బడ్జెట్‌లో రూ.40.67 కోట్లు కేటాయించగా, ఈసారి ఏమీ కేటాయించలేదు. కేంద్ర విద్యా సంస్థలు ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీ, ఎయిమ్స్ వంటి వాటికి కేటాయింపులు చేయలేదు. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు పరిశ్రమ, దుగ్గిరాజపట్నం పోర్టు, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం వంటి వాటికి మొండి చెయ్యే మిగిలింది. వైజాగ్, విజయవాడ మెట్రోలకు సంబంధించి బడ్జెట్‌లో ఊసేలేదు. వెనుకబడిన జిల్లాల నిధుల గురించి కనీసం ప్రస్తావనే లేదు. మరి ఈసారి కూడా ఇలానే ఉంటే కష్టమే అవుతుంది.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం