Amit Shah warns Tamilisai: వేదికపైనే తమిళిసై పై అమిత్ షా ఆగ్రహం; చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో ఆసక్తికర ఘట్టం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. కాగా, ప్రమాణ స్వీకార వేదికపై తమిళనాడు బీజేపీ నేత తమిళి సై సౌందరరాజన్ పై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Amit Shah warns Tamilisai: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్డీయే భాగస్వామి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో వేదికపై ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తమిళనాడు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను హెచ్చరిస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది.
తమిళిసై పై అమిత్ షా తీవ్ర ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా లతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పలువురు బీజేపీ సీఎంలు, నాయకులు కూడా వచ్చారు. వారిలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఉన్నారు. వేదికపై ఉన్న అమిత్ షా, వెంకయ్య నాయుడులకు తమిళిసై సౌందరరాజన్ నమస్కరించి వెళ్తుండగా, ఆమెను అమిత్ షా వెనక్కు పిలిచి, ఆమెతో ఆగ్రహంగా మాట్లాడారు. కోపంగా తలను ఊపుతూ, చూపుడు వేలు చూపుతూ ఆమెను హెచ్చరించారు. ఈ 20 సెకన్ల నిడివి గల వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
తమిళి సై వర్సెస్ అన్నామలై
తమిళనాడు బీజేపీలో ఇప్పుడు రెండు వర్గాలు ఉన్నాయి. అవి తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ తమిళిసై సౌందరరాజన్ వర్గం, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వర్గం. ఈ ఇద్దరు కూడా ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. కోయంబత్తూరు స్థానం నుంచి అన్నామలై, చెన్నై సౌత్ స్థానం నుంచి తమిళిసై డీఎంకే అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు.
తమిళనాడులో బీజేపీ జీరో
ఈ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఒక్క సీటులో కూడా గెలవలేకపోయింది. సౌందరరాజన్ స్థానిక మీడియాకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పరోక్షంగా అన్నామలైపై విరుచుకుపడటంతో విభేదాలు మరింత పెరిగాయి. అన్నామలై రాష్ట్ర బీజేపీలో సంఘ వ్యతిరేక శక్తులకు మద్ధతు ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. తమిళి సైని అమిత్ షా హెచ్చరించడంపై బీజేపీ తమిళనాడు సోషల్ మీడియా సెల్ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ గోపీనాథ్ ఎక్స్‌లో ఇలా పోస్ట్ చేశారు, “అది అమిత్ షా జీ నుండి తమిళిసై అక్కకు బలమైన హెచ్చరికలా కనిపిస్తోంది. అయితే ఈ "పబ్లిక్" హెచ్చరికకు కారణం ఏమిటి’’ అని ఆయన పోస్ట్ చేశారు.
అన్నాడీఎంకే తో పొత్తుపై విబేధాలు
లోక్ సభ ఎన్నికలకు ముందు అన్నాడీఎంకే తో పొత్తు పెట్టుకోవాలనే విషయానికి సంబంధించి కూడా అన్నామలై, తమిళి సై మధ్య విబేధాలు తలెత్తాయి. అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తే 30 సీట్లు గెల్చుకునేవారమని అన్నాడిఎంకె మాజీ మంత్రి ఎస్ పి వేలుమణి ఇటీవల వ్యాఖ్యానించారు. అన్నామలై కారణంగానే రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదని ఆయన విమర్శించారు. తమిళి సై బీజేపీ రాష్ట్ర చీఫ్ గా ఉన్న సమయంలో రెండు పార్టీల మధ్య సామరస్యపూర్వక సంబంధాలు ఉండేవన్నారు. వేలుమణి వాదనను అన్నామలై కొట్టివేయగా, తమిళి సై సమర్ధించారు.