Chandrababu Bail : చంద్రబాబు రాజకీయ కార్యక్రమాలకు అనుమతి- బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంలో విచారణ వాయిదా-delhi news in telugu skill development case chandrababu bail cancel petition hearing in supreme court ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Bail : చంద్రబాబు రాజకీయ కార్యక్రమాలకు అనుమతి- బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంలో విచారణ వాయిదా

Chandrababu Bail : చంద్రబాబు రాజకీయ కార్యక్రమాలకు అనుమతి- బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంలో విచారణ వాయిదా

Bandaru Satyaprasad HT Telugu
Nov 28, 2023 05:43 PM IST

Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది.

చంద్రబాబు
చంద్రబాబు

Chandrababu Bail : స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇటీవల సాధారణ బెయిల్ మంజూరు చేసింది. అయితే చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. డిసెంబర్‌ 8లోపు కౌంటర్‌ పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్ పై వెంటనే విచారణ చేయాలన్న సీఐడీ తరఫు న్యాయవాది వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. స్కిల్ కేసు క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు అనంతరమే విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అయితే తదుపరి విచారణ వరకు ఈ కేసు వివరాలను ఎక్కడా మాట్లాడవద్దని చంద్రబాబును ఆదేశించింది. రాజకీయ ర్యాలీలు, ఇతర కార్యకలాపాల్లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్‌ 8కి వాయిదా వేసింది.

ర్యాలీలు, రాజకీయ కార్యక్రమాలకు అనుమతి

సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరులో హైకోర్టులో తమ వాదనలు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో సీఐడీ పేర్కొంది. తాము చెప్పిన ఏ విషయాన్ని హైకోర్టు పట్టించుకోలేదని తెలిపింది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకుండా చంద్రబాబును నిలువరించాలని సీఐడీ సుప్రీంకోర్టును కోరగా, ధర్మాసనం అందుకు తిరస్కరించింది. స్కిల్ కేసు గురించి చంద్రబాబు, సీఐడీ బహిరంగంగా వ్యాఖ్యలు చేయరాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి ధర్మాసనం చంద్రబాబుకు అనుమతినిచ్చింది. మధ్యంతర బెయిల్ సమయంలో హైకోర్టు విధించిన షరతులను కొనసాగించాలని సీఐడీ సుప్రీంకోర్టును అభ్యర్థించగా, అందుకు న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది.

హైకోర్టు పూర్తిస్థాయి బెయిల్

టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. అనారోగ్య కారణాలతో హైకోర్టు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం సీఐడీ సరైన ఆధారాలు చూపలేకపోయిందని సాధారణ బెయిల్ మంజూరు చేసింది. ఏపీ హైకోర్టు ఈ నెల 20న చంద్రబాబు సాధారణ బెయిల్‌ను మంజూరు చేయగా, ఆ బెయిల్ ను రద్దు చేయాలని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. స్కిల్‌ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడి, నిధులను టీడీపీ ఖాతాలకు మళ్లించారనే సీఐడీ అభియోగించింది. కానీ ఇందుకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని హైకోర్టు చంద్రబాబుకు పూర్తిస్థాయి బెయిల్‌ ఇచ్చింది.

Whats_app_banner