AP Dana Effect: ఏపీలో దానా తుఫాన్ ఎఫెక్ట్ రైళ్లపైనే అధికం.. ప్రధాన స్టేషన్లలో కంట్రోల్‌రూమ్‌ల ఏర్పాటు
AP Dana Effect: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపటికి దానా తుఫానుగా మారనుంది. ఉత్తరాంధ్ర నుంచి పశ్చిమ బెంగాల్ వరకు తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలతో పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
AP Dana Effect: బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను ప్రభావంతో పెద్ద ఎత్తున రైళ్ల రాకపోకల్ని రద్దు చేశారు. ప్రధానంగా విజయవాడ రైల్వే డివిజన్ మీదుగా విశాఖవైపు ప్రయాణించే రైళ్లను రద్దు చేశారు. బుధవారం నుంచి శుక్రవారం ఉదయం వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఈ నేపథ్యంలో విజయవాడ డివిజన్ పరిధిలో ముఖ్యమైన స్టేషన్లలో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశారు. రైళ్ల రాకపోకల సమాచారాన్ని ఈ నంబర్లలో తెలుసుకోవచ్చు. సామర్లకోటలో 088423 27010, నెల్లూరులో 08612345863, విజయవాడలో 0866 2576924, రాజమండ్రిలో 08832420541, అనకాపల్లిలో 75693 05669, ఏలూరులో 075693 05268, గుడూరులో 08624250795, నిడదవోలులో 08813223325, ఒంగోలులో 85922 80306, తాడేపల్లిగూడెంలో 88182 26162, తునిలో 08854252172, తెనాలిలో 08644227600, గుడివాడలో 78159 09462, భీమవరం టౌన్‌లో 078159 09402 నంబర్లలో సంప్రదించవచ్చు.
తుఫానుగా బలపడిన వాయుగుండం..
తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా బలపడినట్టు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. గురువారానికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు. గడిచిన 6 గంటల్లో గంటకు 18కిమీ వేగంతో తుపాన్ ముందుకు కదులుతోంది.
గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. పూరీ-సాగర్ ద్వీపం మధ్య తీరం దాటుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతానికి పారాదీప్ (ఒడిశా)కి 560 కిమీ., సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 630 కిమీ మరియు ఖేపుపరా (బంగ్లాదేశ్)కి 630 కిమీ. దూరంలో దానా తుపాన్ కేంద్రీకృతమై ఉంది. తుఫాను ప్రభావంతో పశ్చిమమధ్య బంగాళాఖాతం తీరాల వెంబడి గంటకు 80-90 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావంతో బుధవారం నుంచి సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు..
తుఫాను ప్రభావంతో అక్టోబరు 24 & 25న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్రలో ఈ నెల 24 నుంచి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసినట్లు హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. అత్యవసర సహాయ చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్ ఆరు బెటాలియన్లలోని 600 మంది సభ్యులతో కూడిన 12 బృందాలు సంసిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లకుండా వర్ష ప్రభావమున్న ప్రాంతాలను ఎప్పటికప్పుడు విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా అప్రమత్తం చేస్తున్నట్టు వివరించారు.
ఏపీలో నేడు రేపు రద్దైన రైళ్ల సమాచారం ఇదే…