Consumer Forum : రైతులకు బీమా చెల్లించాల్సిందే…ఎస్‌బిఐకు ఫోరం ఆదేశం…-consumer forum directions to sbi general insurance to pay compensation to farmers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Consumer Forum : రైతులకు బీమా చెల్లించాల్సిందే…ఎస్‌బిఐకు ఫోరం ఆదేశం…

Consumer Forum : రైతులకు బీమా చెల్లించాల్సిందే…ఎస్‌బిఐకు ఫోరం ఆదేశం…

HT Telugu Desk HT Telugu
Feb 02, 2023 09:17 AM IST

Consumer Forum రైతులకు పంట నష్టం చెల్లించడానికి నిరాకరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వడ్డీతో సహా పరిహారం చెల్లించాల్సిందేనని వినియోగదారుల ఫోరం ఆదేశించింది. పెటా తుఫాను కారణంగా 2020లో పంటల్ని కోల్పోయిన రైతులకు బీమా మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది.

ఎస్‌బిఐ ఇన్స్యూరెన్స్‌కు ఝలక్, పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశం
ఎస్‌బిఐ ఇన్స్యూరెన్స్‌కు ఝలక్, పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశం (HT_PRINT)

Consumer Forum రైతులకు పంట బీమా పరిహారం చెల్లించడానికి నిరాకరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వినియోగదారుల ఫోరంలో చుక్కెదురైంది. పెటా తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశించింది. 2020లో వచ్చిన పెటా తుఫాను కారణంగా కాకినాడ జిల్లాలో 14,153మంది రైతులు పంటల్ని కోల్పోయారు. వారికి రావాల్సిన పంటల భీమా మొత్తం రూ.15.72కోట్ల రుపాయల్ని వెంటనే చెల్లించాలని కాకినాడ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో భాగంగా రైతుల నుంచి రూ.1బీమా ప్రీమియంగా చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. 2020లో పెటా తుఫాను కారణంగా రైతులకు పంట నష్టం వాటిల్లింది. రైతులకు జరిగిన నష్టంపై కాకినాడ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అధికారులు రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని ఎస్‌బిఐ జనరల్ ఇన్స్యూరెన్స్ లిమిటెడ్ కంపెనీకి దరఖాస్తు చేశారు.

డీసీసీబీ అధికారుల దరఖాస్తులకు పరిహారం చెల్లించడానికి ఇన్స్యూరెన్స్ కంపెనీ నిరాకరించింది. దీంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారులు గత ఏడాది మే 17న కమిషన్‌ను ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత రైతులకు పంట నష్టం కింద రూ.15,72,59,998 పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. దీంతో పాటు ఖర్చుల నిమిత్తం రూ.50వేలు చెల్లించాలని సూచించింది.

తీర్పు వెలువరించి 45రోజుల్లోగా బీమా కంపెనీ రైతులకు పంటల పరిహారం చెల్లించాలని కమిషన్ అధ్యక్షుడు చెరుకూరి రఘుపతి ఆదేశించారు. వినియోగదారుల కమిషన్ ఆదేశాలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటల్ని కోల్పోయిన రైతులకు అండగా ఉండాల్సిన ఇన్స్యూరెన్స్ కంపెనీ, ప్రకృతి వైపరీత్యాలకు పరిహారం చెల్లించకుండా మూడేళ్లుగా వేధిస్తోందని ఆరోపిస్తున్నారు.

Whats_app_banner