Jagananna Arogya Suraksha : ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు - ‘ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం జగన్‌-cm jagan launches jagananna arogya suraksha ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jagananna Arogya Suraksha : ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు - ‘ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం జగన్‌

Jagananna Arogya Suraksha : ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు - ‘ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం జగన్‌

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 29, 2023 04:57 PM IST

Jagananna Arogya Suraksha :జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా… రాష్ట్రవ్యాప్తంగా 45 రోజులపాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు.

జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభం
జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభం

Jagananna Arogya Suraksha in AP : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభమైంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... దేవుడి దయతో మరో మంచి కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కలెక్టరేట్లు, డివిజన్‌ కార్యాలయాల్లో, సచివాలయాల్లో ఇప్పటికే ఓరియంటేషన్‌ ఇచ్చారని... గ్రామ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్‌ స్థాయివరకూ కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం లేదని... గొప్పగా చేయగలుగుతామనే విశ్వాసంతో దీన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.

yearly horoscope entry point

“ప్రివెంటివ్‌ కేర్‌లో ఇదొక నూతన అధ్యాయం. దేశంలో కూడా ఎవ్వరూ ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. ధైర్యంగా, సాహసోపేతంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి కారణంగా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రభుత్వానికున్న సిబ్బందే. గ్రామస్థాయిలో విలేజ్‌ క్లినిక్స్‌ను తీసుకురాగలిగాం. 542 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. ఉండాల్సిన సిబ్బందిని అక్కడ ఉంచేలా రిక్రూట్‌ చేశాం. ప్రివెంటివ్‌ కేర్‌లో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెస్ట్‌ను తీసుకురాగలిగాం.ప్రతి మండలంలో 2 పీహెచ్‌సీలు ఉంచాం. ప్రతి పీహెచ్‌లోసీ 104 వాహనం, ఇద్దరు డాక్టర్లు కూడా ఉండేలా చూశాం. మొత్తంగా మండలంలో 4 డాక్టర్లు కూడా మండలంలో గ్రామాలను సమానంగా పంచాం. ఆ డాక్టర్లు నిర్దేశిత నాలుగైదు గ్రామాల్లో సేవలు అందిస్తారు. ఒక పీహెచ్‌సీలో ఒక డాక్టరు ఉంటే, రెండో డాక్టరు ఫ్యామిలీ డాక్టర్‌ నిర్వహిస్తారు. గ్రామంలో నెలకు కనీసం రెండు సర్లు వెళ్లేలా ప్రణాళిక అమలు చేస్తున్నాం. ఒకే డాక్టర్‌, ఒకే గ్రామానికి నెలకు రెండు సార్లు వెళ్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరి ఆరోగ్యంమీద ఒక అవగాహన డాక్టరుకు ఉంటుంది. కావాల్సిన మందులు తీసుకెళ్లి… వారికి అండగా నిలిచే అవకాశం కలుగుతుంది. వీటన్నింటితో పాటు ఆరోగ్య శ్రీని కూడా ప్రతి పేదవాడూ వినియోగించుకునేలా తీర్చిదిద్దాం” అని ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు.

అవగాహన కల్పించాలి…

వైద్యం కోసం పేదవాళ్లు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని, ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని చెప్పారు సీఎం జగన్. 1050 నుంచి 3256 చికిత్సలను ఆరోగ్య శ్రీ సేవలను అందిస్తున్నామని… నెట్‌వర్క్‌ ఆస్పత్రులను విస్తరించామని గుర్తు చేశారు. “ జగనన్న సురక్ష ద్వారా గ్రామాన్ని పూర్తిగా మ్యాప్‌ చేయబోతున్నాం. ప్రతి ఇంటినీ, ప్రతి గ్రామానీ జల్లెడ పడుతున్నాం. ఇంట్లో ఎలాంటి ఆనారోగ్య సమస్యలు ఉన్నా.. వారిని గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తున్నాం. ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి, స్పెషలిస్టు డాక్టర్ల చేతవారికి చికిత్స అందిస్తున్నాం. తర్వాత వారికి తుపరి పరీక్షలు కూడా చేయించి, వారికి అవసరమైన చికిత్సలు అందిస్తున్నాం.నయం అయ్యే దాకా ఆ పేషెంట్‌ను చేయిపట్టి నడిపిస్తాం. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆరోగ్య శ్రీ గురించి, వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా గురించి కూడా పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. ఆరోగ్య శ్రీ సేవలు ఏరకంగా పొందుతారనే విషయాన్ని ఈకార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తాం.ఎవ్వరికీ సందేహాలు లేకుండా ప్రతి కుటుంబానికీ అవగాహన కల్పిస్తాం. ఆరోగ్య శ్రీ సేవలు పొందిన తర్వాత సంబంధిత పేషెంటుకు అవసరమైన మందులు అందేలా, ఆమేరకు పర్యవేక్షణ ఉండేలా తగిన రీతిలో ఆరోగ్య సురక్ష ద్వారా మ్యాపింగ్‌ చేస్తాం.వీరికి ఎలాంటి సమస్యలేకుండా చూస్తాం.సమయానికి మందులు అందేలా, మళ్లీ అవసరమైన చెకప్‌లు చేయించేలా, అవసరమైన చికిత్స లేదా మందులు అందేలా చూస్తాం” అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

ఉచితంగా సేవలు - సీఎం జగన్

“ఈ కార్యక్రమాలన్నీ ఆరోగ్య సురక్ష కింద అందిస్తాం. కేన్సర్‌ లాంటి పేషెంట్లకు ఖరీదైన మందులు కూడా ఉచితంగా ఆరోగ్య సురక్ష ద్వారా అందిస్తాం. ప్రజారోగ్య రంగంలో జగనన్న ఆరోగ్య సురక్ష కీలక పాత్ర పోషించబోతోంది. ఏ పేదవాడు వైద్యంకోసం ఇబ్బంది పడకూడదనే కార్యక్రమాన్ని ఇందులో చేపడుతున్నాం. మొత్తం ఐదు దశల్లో కార్యక్రమం జరుగుతుంది. మొదటి దశ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. సెప్టెంబర్‌ 15 నుంచి జరుగుతోంది. బీపీ , సుగర్‌, హిమోగ్లోబిన్‌ తప్పనిసరిగా పరీక్షలు చేస్తారు.అవసరాన్ని బట్టి యూరిన్‌, మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు చేస్తారు.ప్రతి ఇంటికీ వెళ్లి… ప్రతి ఒక్కరినీ టెస్టు చేస్తారు.ఆరోగ్య శ్రీ యాప్‌ ద్వారా మ్యాపింగ్ చేస్తారు. టెస్టు ఫలితాలు ఆధారంగా ఆరోగ్య శిబిరాల్లో వారికి చికిత్సలు అందిస్తారు.ఆరోగ్య శ్రీని ఎలా ఉపయోగించుకోవాలి అన్నదానిపై కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తారు.ఎక్కడ చికిత్స అందుతుంది? ఎలా వెళ్లాలి? ఏదైనా ఇబ్బంది ఉంటే.. ఎవర్ని సంప్రదించాలి? అన్న వివరాలతో కూడా బ్రోచర్‌ను అందిస్తారు. ఫోన్లలో ఆరోగ్య శ్రీ యాప్‌నుకూడా డౌన్లోడ్‌ చేయిస్తారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల రక్తహీనత పై ప్రత్యేక దృష్టిసారిస్తారు. గ్రామంలో హెల్త్‌ క్యాంపు ఎప్పుడు నిర్వహిస్తారన్నదానిపై వివరాలు అందిస్తారు.అవ్వాతాతలకు కంటి పరీక్షలు చేసి, వారికి కళ్లజోళ్ల ఇచ్చే కార్యక్రమం కూడా జగనన్న సురక్షలో ఇస్తారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స తీసుకున్నవారికి తదనంతర సేవలు సరిగ్గా అందుతున్నాయా? లేవా? ఆరోగ్య శ్రీ సేవలు అందాల్సిన వారికి ఎలా అందించాలి? ఈరెండు అంశాలపై కూడా సురక్షలో ప్రత్యేక దృష్టిలో పెడతారు” అని సీఎం జగన్ వివరించారు.

ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఈ సేవలన్నీ కూడా అందుతాయని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. సురక్ష క్యాంపుల్లో గుర్తించిన వారికి నయం అయ్యేంత వరకూ చేయూత నిస్తారని చెప్పారు. సిబ్బంది ఓనర్‌ షిప్‌ తీసుకోవాలి, బాధ్యతాయుతంగా ఉండాలని… వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లకు, సీహెచ్‌ఓలు, ఇతర సిబ్బంది ఓనర్‌షిప్‌ తీసుకోవాలని సూచించారు. చికిత్సలు వారికి అందడమే కాదు, ఆతర్వాతకూడా వారికి సేవలు అందేలా చూడాల్సిన బాధ్యత వీరందరిపైనా ఉందని గుర్తు చేశారు.

Whats_app_banner