CBN Fight: ఓటరు లిస్టులో అక్రమాలపై పోరాటం ఉధృతం చేయాలన్న చంద్రబాబు-chandrababu wants to intensify the fight against irregularities in the voter list ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn Fight: ఓటరు లిస్టులో అక్రమాలపై పోరాటం ఉధృతం చేయాలన్న చంద్రబాబు

CBN Fight: ఓటరు లిస్టులో అక్రమాలపై పోరాటం ఉధృతం చేయాలన్న చంద్రబాబు

HT Telugu Desk HT Telugu
Jun 30, 2023 08:13 AM IST

CBN Fight: రాష్ట్రంలో ఓటమి భయంతోనే అధికార పార్టీ ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. ఓటరు జాబితాల అక్రమాలపై నిరంతరం పోరాటాన్ని కొనసాగించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

చంద్రబాబు
చంద్రబాబు (twitter)

CBN Fight: ఓటర్ల జాబితాలో అక్రమాలపై నిరంతర పోరాడాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వైసీపీకి ఓటమి భయంతోనే అక్రమంగా ఓట్లను తొలగిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. పార్టీ ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంపై నేతలతో చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.

ఓటర్ల జాబితాలో అక్రమాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండి పోరాటం చేయాలని పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, టీడీపీ అనుకూల ఓట్ల తొలగింపు అంశాలను సీరియస్ గా తీసుకోవాలని చంద్రబాబు నాయుడు నేతలకు సూచించారు.

ఓటమి భయంతో వైసీపీ ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడుతుందని...దాని కోసం ఇప్పటి నుంచే కుట్రలు మొదలు పెట్టిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటర్ వెరిఫికేషన్ పై రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎలక్షన్ కమిటీ సభ్యులతో చంద్రబాబు నాయుడు చర్చించారు.

ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 20 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని పార్టీ నేతలు వివరించారు. వీటిపై చర్యలు కోరుతూ అక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా వివరాలను ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని చంద్రబాబు కు నేతలు వివరించారు.

చనిపోయిన వారి ఓట్లు తొలగించకపోవడం, దొంగ ఓట్లు నమోదు చేయడం, టీడీపీకి అనుకూలం అని భావించే వారి ఓట్లను తొలగించడం, ఒక బూత్ లో ఓట్లను మరో బూత్ కు బదలాయించడం వంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

నియోజకవర్గాల వారీగా ఓటర్ జాబితాలో ఉన్న అనర్హుల ఓట్ల లిస్ట్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఇచ్చామని నేతలు పార్టీ అధినేతకు వివరించారు. వైసీపీ దొంగ ఓట్ల అక్రమాలకు పాల్పడుతోందని, అక్రమాలకు పాల్పడుతూ ఆ బురదను తిరిగి టీడీపీకి అంటించే ప్రయత్నాలను గట్టిగా ఎండగట్టాలని చంద్రబాబు సూచించారు.

పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో ఓటర్ల వెరిఫికేషన్ కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని... ప్రజలను కూడా ఇందులో భాగస్వాములు చేయడం ద్వారా వైసీపీ అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అనర్హులకు ఓట్ల విషయంలో ఉద్దేశ్య పూర్వకంగా తప్పులు చేసే ఏ అధికారినీ వదిలేది లేదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అక్రమాలకు సహకరించే అధికారులను గుర్తించాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.

Whats_app_banner