Chandrababu : ప్రశ్నిస్తే.. దాడులు, హత్యలతో భయపెడుతున్నారు
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఏపీలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయన్నారు.
ప్రశ్నిస్తే.. వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తుందని.. చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. దాడులు, హత్యలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. వెంకాయమ్మ కుటుంబంపై మరోసారి దాడి జరగడంపై డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై వైకాపా నేతలు ఇష్టానుసారం దాడులు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కొందరు పోలీసు అధికారుల సహకారంతోనే.. ఈ తరహా ఘటనలు జరుగుతున్నట్టు ఆరోపించారు.
వెంకాయమ్మ, ఆమె కుమారుడు వంశీపై జరిగిన దాడిని లేఖలో చంద్రబాబు ఖండించారు. వెంకాయమ్మపై దాడి చేసిన వారిపై ఇంకా చర్యలు తీసుకోలేదన్నారు. ఆమె కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని డీజీపీని చంద్రబాబు కోరారు. దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లేఖతోపాటు వీడియోలు జతచేశారు.
వెంకాయమ్మపై దాడి నేపథ్యంలో ఆమెతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. దాడి గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా "చలో కంతేరు"కు చంద్రబాబు పిలుపునిచ్చారు. సోమవారం టీడీపీ దళిత నేతలు గుంటూరు జిల్లా కంతేరు గ్రామానికి వెళ్లే ఆలోచనలో ఉన్నారు.
విజయనగరంలో చంద్రబాబు పర్యటన
బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రాల్లో చంద్రబాబు రోడ్ షోలో పాల్గొంటారు. కార్యక్రమం నిర్వహణపై విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు చర్చించారు. రాష్ట్రంలో మూడేళ్లుగా రాక్షస పాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. వైసీపీ పాలనలో చిన్నా.., పెద్దా తేడా లేకుండా అందరూ ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారరు. లోకేశ్ పదో తరగతి విద్యార్థులతో జూమ్ మీటింగ్ పెడితే.. వైసీపీ నేతలు దొంగల్లా ప్రవేశించారన్నారు.