Chandrababu | హోదాపై మీ యుద్ధం ఎక్కడ? రాజీనామాలపై నాటి సవాళ్లు ఏమయ్యాయి?
ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ ఎప్పుడు యుద్ధం మొదలు పెడతారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ప్రధానికి ఇచ్చే వినతి పత్రంలో కూడా హోదా అంశాన్ని జగన్ ఎందుకు పెట్టలేకపోయారని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిలదీశారు. తమ పోరాటం వల్లనే హోదా విషయంలో కేంద్ర కమిటీ వేశారన్న వైసీపీ నేతలు.. అజెండా ఎందుకు మారిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నాడు హోదాపై ఊరారా తిరిగి హడావుడి చేసిన జగన్...ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉండిపోయారని చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, పాఠశాలల మూసివేత, సినిమా హీరోలకు అవమానం, నరేగా పనుల్లో అవినీతి వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.
తెలుగు సినీ రంగం హీరోలను, ప్రముఖులను సీఎం జగన్ మీటింగ్ పేరుతో పిలిపించి అవమానించడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమా పరిశ్రమను జగన్ తన వైఖరితో కించపరిచారని అన్నారు. లేని సమస్యను సృష్టించి సినిమా రంగాన్ని కించపరిచేలా జగన్ వ్యవహరించారని చెప్పారు. స్వశక్తితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి వంటి వారు ముఖ్యమంత్రికి చేతులు జోడించి వేడుకోవాలా అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాస్, రాజమౌళి, మహేష్ బాబు పాల్గొన్న ఆ సమావేశంలో జగన్ వ్యవహరించిన తీరుపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయికి చేరిన తెలుగు సినిమా రంగ ప్రతిభపై కొద్దిరోజుల క్రితం ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.
సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలివే..
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఏమాత్రం తగ్గకపోయినా.. ఆర్థిక వ్యవస్థ నాశనం అవ్వడానికి జగన్ విధానాలే కారణం అని సమావేశంలో టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 112 సార్లు ఒవర్ డ్రాఫ్ట్ కు వెళ్లిందని.. 193 సార్లు వేస్ అండ్ మీన్స్ తీసుకున్నారని చెప్పారు.
పాఠశాలల విలీనం వల్ల 3, 4, 5 తరగతుల విద్యార్థులు మూడు కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తుందని సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ, బీసీ కాలనీల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలు రద్దు చేయడం, చిన్న పిల్లల్ని అవస్థల పాలు చేస్తున్న జగన్ ప్రభుత్వ విధానాల్ని సమావేశం ఖండించింది. గ్రామాల్లో ఉన్న పాఠశాలలను మూసివెయ్యడమే నాడు- నేడు పథకమా అని నేతలు ప్రశ్నించారు.
రాష్ట్రంలో అమలువుతున్న అనధికార విద్యుత్ కోతలపైనా సమావేశంలో చర్చించారు. గ్రామాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా తీసివేస్తున్నారని.. విద్యుత్ రంగంలో మళ్లీ రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లిందన్నారు. కరెంట్ సరఫరా లేకపోయినా.. కరెంట్ బిల్లులు అధికంగా వస్తున్నాయని అన్నారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు తిరస్కరించిన కేసీఆర్ లా ఏపీలో జగన్ రెడ్డి మోటార్లకు మీటర్లు బిగించవద్దని డిమాండ్ చేశారు.
ఉపాధి నిధుల్లో పేదలకు చేరాల్సిన డబ్బును అవినీతితో తినేస్తున్నారని నేతలు సమావేశంలో వివరించారు. ఉపాధి హామీ నిధులు ఏపీలో రూ.261 కోట్లు అవినీతి పాలయ్యాయని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రకటించింది. ఇది దేశంలో మొదటి స్థానంగా ఉందని.. రానున్న రోజుల్లో నిధులు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని నేతలు అన్నారు. వీటిపై తెలుగుదేశం పోరాటం కొనసాగిస్తుందని అన్నారు.
విశాఖ ఉక్కు, నెల్లూరు సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ల ప్రైవేటీకరణ నివారణకు సీఎం చొరవ ఏదని నేతలు ప్రశ్నించారు. మత్స్యకారులకు నష్టం చేసే 217 జీవోను రద్దు చేయాలి సమావేశం డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లోని ఆటోనగర్ల స్థలాలను కబ్జా చేసేందుకు జగన్ కుట్ర చేస్తున్నాడని.. పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధికి మార్గం చూపకపోగా... ప్రైవేటు ఆస్తులు లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని.. నేతలు తప్పు పట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉందని.. మందుల కొరత, ఆర్థిక సమస్యలతో అసుపత్రుల్లో వివిధ చెల్లింపులు లేవన్నారు.
సంబంధిత కథనం