Power Purchase Ban : తెలుగు రాష్ట్రాల విద్యుత్ కొనుగోళ్లపై కేంద్రం నిషేధం….
విద్యుత్ కొనుగోలు బకాయిలను పంపిణీ సంస్థలు సకాలంలో చెల్లించకపోవడంతో బహిరంగ మార్కెట్లో కరెంటు కొనుగోలు చేయకుండా పలు రాష్ట్రాలపై కేంద్రం నిషేధం విధించింది. గురువారం అర్థరాత్రి నుంచి నిషేధం అమల్లోకి వచ్చింది. బుక్ అడ్జస్ట్‌మెంట్‌లలో లోపాల వల్ల ఏపీపై ఆంక్షలు విధించినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే, డబ్బులు చెల్లించినా నిషేధం విధించడంపై తెలంగాణ భగ్గుమంటోంది.
బహిరంగ మార్కెట్ల నుంచి విద్యుత్ కొనుగోళ్లు చేయకుండా ఆంధ్ర, తెలంగాణ సహా 13 రాష్ట్రాలకు చెందిన 27 డిస్కమ్‌లకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్ కూడా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల నుంచి రూ.17,060 కోట్ల మేర బకాయిలు ఉండటంతో ఇండియన్ ఎలక్ట్రిసిటీ ఎక్స్ఛేంజీ ద్వారా మార్కెట్ నుంచి కరెంటు కొనుగోలు చేసేందుకు వీల్లేదని కేంద్రం ప్రకటించింది. గురువారం అర్ధరాత్రి రాత్రి నుంచి సొంతంగా ఉత్పత్తి చేసుకున్న విద్యుత్, వివిధ సంస్థలతో ఇప్పటికే కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న విద్యుత్ మినహా, రోజు వారీ డిమాండ్‌తో బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసేందుకు వీల్లేకుండా పోయింది. కేంద్రం లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రూ.412 కోట్లు, తెలంగాణ రూ.1,380కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి ఉంది.
ఏపీలో జూన్ రెండో వారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నా విద్యుత్ డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్లుగా కరెంటు ను సరఫరాచేయలేని పరిస్థితి డిస్కమ్‌లకు ఎదురవుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా గాలిలో తేమ ఎక్కువ కావడం, పారిశ్రామిక అవసరాలు పెరగడం వంటి కారణాలతో విద్యుత్ డిమాండ్ బాగా పెరిగింది. బుధవారం రాష్ట్రంలో 209.617 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే గత ఏడాది ఆగస్టు 17న 180.074 మిలియన్ యూనిట్లు నమోదైంది. గత ఏడాది కరోనా ఆంక్షల కారణంగా విద్యుత్ డిమాండ్ బాగా తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే 12.23 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఎక్కువగా ఉంది.
ఏపీలో మొత్తంగా 190.107 మిలియన్ యూనిట్లు అందుబాటులో ఉంది. డిమాండ్ 209.617 మిలియన్ యూనిట్ల కంటే 19.311 మిలియన్ యూనిట్లు తగ్గింది. పూర్తి డిమాండ్‌ను తట్టుకునేందుకు. బహిరంగ మార్కెట్లో రూ.12.9 కోట్లను చెల్లించి 19.36 మిలియన్ యూనిట్లు కొన్నారు. ఇదే డిమాండ్ మరికొన్ని రోజులు కొనసాగనుంది. డిమాండ్‌ను తట్టుకోవాలంటే బహిరంగ మార్కెట్లో కొనాలి. బహిరంగ మార్కెట్ కొనుగోళ్లకు సంబంధించి కేంద్రానికి తొలి వాయిదా చెల్లించామని తాజా లెక్కలు అప్‌డేట్ కానందునే కేంద్రం తమకు నోటీసులు జారీ చేసిందని రాష్ట్ర విద్యుత్ అధికారులు వివరణ ఇస్తున్నారు.
తెలంగాణ న్యాయపోరాటం...
మరోవైపు తెలంగాణ విద్యుత్తు సంస్థలు కరెంటు ఉత్పత్తి సంస్థలకు ఇప్పటికే రూ.1,370 కోట్లు చెల్లించిన ఎనర్జీ ఎక్చేంజీల నుంచి విద్యుత్ కొనుగోళ్లు చేయకుండా ఆంక్షలు విధించడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విద్యుత్తు కొనుగోలు, అమ్మకాలకు ఎలాంటి అంతరాయం కలిగించరాదని హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ మోదీ సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేంద్రం నిషేధం విధించిన 13 రాష్ట్రాల్లో బీజేపీయేతర రాష్ట్రాలు అధికంగా ఉన్నాయని టిఆర్ఎస్ ఆరోపిస్తోంది.
బీజేపీ అధికారంలో లేని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, బీహార్ తదితర రాష్ర్టాలనే ప్రధానంగా టార్గెట్ చేశారని విమర్శిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతినెలా 18 తేదీలోపు అంతకు ముందు నెలకు సంబంధించిన విద్యుత్తు కొనుగోళ్ల బిల్లులు చెల్లించాలి. బకాయిలు చెల్లించకపోతే 19వ తేదీ నుంచి విద్యుత్తు కొనుగోలు, అమ్మకాలకు అనర్హులుగా ప్రకటిస్తారని, తెలంగాణ విద్యుత్తు సంస్థలు గత నెల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికే రూ.1,370 కోట్లు చెల్లించినా తెలంగాణ విద్యుత్తు కొనుగోలు చేయకుండా కేంద్రం నిషేధం విధించడాన్ని తప్పు పడుతున్నారు.
విద్యుత్తు కొనుగోలు సంస్థలపై అనర్హత వేటు వేయొద్దని తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చినా, కేంద్రం నిషేధం విధించటంతో న్యాయపోరాటం చేస్తామని ట్రాన్స్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు చెప్పారు. ఇప్పటికే రూ.1,370 కోట్ల బిల్లులు చెల్లించామని కేంద్రం తీరుపై సోమవారం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు.తెలంగాణలో విద్యుత్తుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకొంటున్నామన్నారు.