Vizag Drugs Case: బ్రెజిల్ డ్రగ్స్ కంటైనర్ కేసు ఏమైంది? సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్ వ్యవహారంపై విచారణకు బొత్స డిమాండ్
Vizag Drugs Case: విశాఖపోర్టుకు బ్రెజిల్ నుంచి అక్రమంగా వచ్చిన డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని, సంధ్యా ఆక్వా ఎక్ట్స్‌పోర్ట్ లిమిటెడ్ సంస్ధ రూ.25 వేల కోట్ల డ్రగ్స్‌ను దిగుమతి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
Vizag Drugs Case: విశాఖపట్నంలో ఎన్నికలకు ముందు కలకలం సృష్టించిన బ్రెజిల్ డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంపై విచారణ జరపించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట కంపెనీ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి బంధువులు, టీడీపీ నేతల సన్నిహితులదేననే ఆరోపణలు కూడా వచ్చాయని, ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టడంతో పాటు ఉత్తరాంధ్రాకు చెందిన ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించాలని మాజీ మంత్రి బొత్స డిమాండ్ చేశారు.
విచారణలో ఆరోపణలు వాస్తవం కాకపోతే విశాఖపట్నం క్లీన్ ఇమేజ్ నిలబడుతుందన్నారు. ఎన్నికల సమయంలో విశాఖపోర్టుకు అక్రమంగా బ్రెజిల్ నుంచి వచ్చిన మాదకద్రవ్యాలతో కూడిన కంటెయినర్ కేసు ఏమైందో ప్రభుత్వం విచారణ చేపట్టాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సుమారు 25 కిలోల చొప్పున వేయి బ్యాగులను కంటెయినర్లో మాదకద్రవ్యాలతో కూడి సరుకు విశాఖ పోర్టుకు రాగా... కేంద్ర దర్యాప్తుసంస్ధ సీబీఐతో పాటు ఇంటర్‌పోల్ పట్టుకున్న విషయాన్ని బొత్స గుర్తుచేశారు.
ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వమే చేసిందని.... ఆరోపణలు కూడా చేశారని... అధికార పక్షంతో పాటు విపక్షంలో ఉన్నవారు కూడా వీటిపై పరస్పర ఆరోపణలు చేసుకున్నారన్నారు. ఈ వ్యవహరంలో భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి బంధువులకు చెందిన సంధ్యా ఆక్వా ఎక్ట్స్‌పోర్ట్ లిమిటెడ్ సంస్ధ దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చిన విషయాన్ని బొత్స గుర్తుచేశారు.
ఈ మొత్తం వ్యవహారంపై ఒకవైపు అధికారులు విచారణ చేపట్టడంతో పాటు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో ఉత్తరాంధ్రాకు చెందిన ఎంపీలు దీనిపై పార్లమెంట్‌లో ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేసారు. రూ.25వేల కోట్లకు సంబంధించిన వ్యవహారంపై వాస్తవాలు ఏమిటి? ఇందులో ఎవరిపాత్ర ఉంది? నిందితులను ఎందుకు ఉపేక్షిస్తున్నారో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ విచారణలో ఆ ఆరోపణలు వాస్తవం కాకపోతే విశాఖపట్నం క్లీన్ ఇమేజ్ నిలబడుతుందన్నారు.
దేశంలో ఎక్కువగా డ్రగ్స్ దిగుమతి అయిన చరిత్ర గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఉన్న పోర్టులకు ఉంద తప్ప.. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎప్పుడూ ఇలాంచి ఘటనలు జరగలేదన్నారు. విశాఖలో తొలిసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు... అధికార పార్టీకి చిత్తశుద్ధి ఉంటే స్ధానికనాయకత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని, పార్లమంటు సభ్యులైతే పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తి విచారణకు డిమాండ్ చేయాలని సూచించారు.
ఈ విషయంలో ఏ పార్టీ మీద బురదజల్లడం లేదని... విశాఖపట్నంతో పాటు రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా మాదకద్రవ్యాల దిగుమతిపై సమగ్రమైన విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
మరోవైపు ఎన్నికలు అయిన దగ్గర నుంచి భూఆక్రమణలు జరిగాయని కొందరు, మరికొందరైతే దసపల్లా భూముల గురించి దోపిడీకి గురయ్యాయంటూ వార్తలు వచ్చిన విషయాన్ని బొత్స ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నంలో గతంలో హుద్‌హుద్ తుఫాను తర్వాత వచ్చిన భూకుంభకోణాన్ని ప్రస్తావించారు.
హుథ్‌హుథ్ తుఫాను వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్న అధికార తెలుగుదేశం పార్టీలో ఉన్నవారే భూ కుంభకోణంపై పరస్పర ఆరోపణలు చేసుకోగా.. అప్పటి టీడీపీ ప్రభుత్వం దానిపై సిట్ ఏర్పాటు చేసి ఏడాది పాటు దర్యాప్తు చేశారన్నారు. ఆ తర్వాత అనేకరకాల పరిణామాలు చోటుచేసుకుని.. దర్యాప్తునకు సంబంధించిన టెర్మ్స్ ఆఫ్ కండిషన్స్ మార్పు చేసి 2004 నుంచి కూడా విశాఖపట్నం ప్రాంతంలో జరిగిన భూ ఆక్రమణలు గురించి కూడా దర్యాప్తు చేయాలని నిర్ణయించారని తెలిపారు. అంటే 2004 నుంచి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రులగా మేం ఉన్న నేపధ్యంలో ఆ అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారన్నారు.
ఇప్పుడు విశాఖలో భూఆక్రమణలు అంశం మరలా తెరపైకివచ్చిన నేపధ్యంలో.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో నియమించిన సిట్ దర్యాప్తును మరలా కొనసాగించాలన్నారు. అలా చేస్తే ఎవరు తప్పు చేశారో తేలిపోతుందని.. అప్పుడే ఉత్తరాంధ్రా ప్రజలకు దొర ఎవరో, దొంగెవరో తెలుస్తుందని బొత్స స్పష్టం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం దేనిమీదైనా విచారణ చేసుకోవచ్చన్నారు. అప్పుడు ఈ సందిగ్దతకు తావులేకుండా తప్పుచేసినవాళ్లెవరో తేలిపోతుందన్నారు. ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కాబట్టి... విచారణకు ఆదేశించుకోవచ్చన్నారు. తప్పుచేసినవారు దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తారని.. లేని పక్షంలో ఒకవేళ తప్పుడు అభియోగాలైతే కోర్టుల్లో తేల్చుకుంటారన్నారు.