BJP Protests : ఏపీ సర్కారుపై బీజేపీ ఫైర్…. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
వినాయక చవితి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపిస్తూ ఏపీ బీజేపీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది.
విఘ్నాధిపతి వేడుకులకు విఘ్నాలు కల్పిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది. నిబంధనల పేరుతో వినాయక చవితి వేడుకులకు పరోక్ష ఆటంకాలకు కల్పిస్తోందని అనుమానాలు బలపడుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళనలు, నిరసనలు నిర్వహించాలని సోమువీర్రాజు బిజెపి శ్రేణులకు పిలుపునిచ్చారు.
బిజెపి పదాధికారులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీల ఇన్చార్జిల సమావేశంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి పండగలకు సంబంధించి పందిళ్ళ అనుమతిపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లోని తాసిల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించాలని, నిరసన కార్యక్రమాలు జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాలు ఆందోళన తర్వాత తాసిల్దారులకు వినతుల్ని సమర్పించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు సోము వీర్రాజు సూచించారు.
వినాయక చవితి ఉత్సవాలకు మంటపాలు పందిళ్లు ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బిజెపి పిలుపునిచ్చినట్లు ప్రకటించారు. హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకునే వినాయక చవితి పండుగను నిబంధనలు పేరుతో పల్లెల్లో పట్టణాల్లో నగరాల్లో వీధుల్లో వాడల్లో జరుపుకోవడానికి అనుమతులు తప్పనిసరి చేయడం ద్వారా వైసిపి ప్రభుత్వం పండగ వాతావరణాన్ని కలుషితం చేస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు. ఆంక్షలు పెట్టడం ద్వారా వినాయక చవితి ఉత్సవాలను నిర్వాహకులను నిరుత్సాహపరచి, మంటపాల సంఖ్యను రాష్ట్ర వ్యాప్తంగా తగ్గించాలనే కుట్ర జరుపుతోందని అనుమానం వ్యక్తం చేశారు.
ఎన్నడూ లేని విధంగా వివిధ రకాల అనుమతులు పొందాలని కుట్రపూరితంగా రాష్ట్ర డిజిపి ద్వారా ఆదేశాలు జారీ చేయించి క్షేత్రస్థాయిలో మండపాల నిర్వాహకులను ఉత్సవ సమితి సభ్యులను వివిధ రకాలుగా వేధిస్తున్నారని, వారి మనసులను బాధిస్తూ ఈ ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి మేల్కొని వెంటనే తగు ఆదేశాలు జారీ చేయాలని, వినాయక చవితి పందిళ్లకు పోలీసు శాఖ నుండి మైక్ అనుమతి మినహా మరి ఏ ఇతర అనుమతులను తీసుకోవాలనే నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేశారు.వినాయక చవితి ఉత్సవాలను దరఖాస్తు చేసిన వెంటనే సింగల్ విండో సిస్టంలో అనుమతులు మంజూరు చేయాలని, లేకుంటే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్రస్థాయిలో ఉద్యమం చేస్తుందని సోము వీర్రాజు హెచ్చరించారు.
టాపిక్