Chandrababu : అరకు కాఫీ అనే పేరు నేనే పెట్టా, గంజాయి ఘనత వైసీపీదే- చంద్రబాబు
Chandrababu : అరకు కాఫీ అనే తానే పేరు పెట్టానని చంద్రబాబు అన్నారు. టీడీపీ అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేస్తే వైసీపీ గంజాయిని పరిచయం చేసిందని విమర్శించారు.
Chandrababu : టీడీపీ అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేస్తే, వైసీపీ గంజాయిని పరిచయం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. శనివారం అల్లూరి జిల్లా అరకులో 'రా...కదలి రా' కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. ఏపీలో టీడీపీ, జనసేన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతుందని విమర్శించారు. అరకు ప్రకృతి రమణీయతకు, ప్రశాంతతకు నిలయమని, ఇక్కడ పండించే పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. అరకు కాఫీ అనే పేరు తానే పెట్టానని చంద్రబాబు అన్నారు. 80 రోజుల్లో వైసీపీ ప్రభుత్వం గద్దె దిగుతుందన్నారు. మహిళల పట్ల కనికరం లేకుండా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారన్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉందో అర్థం కావడం లేదన్నారు.
పోలవరం ప్రత్యేక జిల్లా
టీడీపీ ప్రభుత్వం రాగానే పోలవరం నిర్వాసితులకు ప్రత్యేక జిల్లాను ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పోలవరం ఏలూరు జిల్లా పరిధిలో ఉండగా, రంపచోడవరం నియోజకవర్గం అల్లూరి జిల్లాలో ఉంది. ఈ ప్రాంత గిరిజనులు జిల్లా కేంద్రానికి రావాలంటే కనీసం 200 కిలో మీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఉందని, అందుకే గిరిజనుల డిమాండ్ మేరకు జిల్లా ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ గిరిజనుల పొట్టకొడుతుందని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని గతంలో జీవో నెంబర్ 3 ఇస్తే వైసీపీ ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేసిందన్నారు. జీవో నెంబర్ 3 రద్దు చేయడం సామాజిక న్యాయమా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
16 పథకాలు రద్దు చేశారు
గిరిజనుల కోసం టీడీపీ ప్రభుత్వం 16 పథకాలు అమలు చేసిందని, వాటిని సీఎం జగన్ రద్దు చేశారని చంద్రబాబు ఆరోపించారు. గిరిజనుల పిల్లలు చదువుకోవడం వైసీపీకి ఇష్టం లేదని, అందుకే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని రద్దు చేశారని దుయ్యబట్టారు. విద్యార్థుల నైపుణ్యం కోసం శిక్షణ కేంద్రాలు పెడితే వాటిని తొలగించారన్నారు. గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చామన్నారు.
హెలికాఫ్టర్ రాంగ్ రూట్ లోకి
అంతకు ముందు విశాఖ నుంచి అరకు బహిరంగ సభకు బయలుదేరిన చంద్రబాబు హెలికాప్టర్ దారితప్పింది. దీంతో హెలికాఫ్టర్ తిరిగి విశాఖకు వెళ్లింది. అనంతరం అనుమతులు రావడంతో అరకు సభకు చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. సాధారణంగా వాయుమార్గంలో ప్రయాణించాలంటే సమీపంలోని విమానాశ్రయ ఏటీసీ అనుమతులు తప్పనిసరి. ఏటీసీ రూట్ మ్యాప్ ప్రకారం అరకు వెళ్లేందుకు బయలుదేరిన చంద్రబాబు హెలికాఫ్టర్, రూట్ మ్యాప్ విషయంలో పైలెట్ గందరగోళానికి గురికావడంతో వేరే మార్గంలోకి ప్రయాణించింది. ఈ విషయాన్ని ఏటీసీ వెంటనే గుర్తించి హెచ్చరించడంతో తిరిగి విశాఖకు చేరుకుని రూట్ క్లియరెన్స్ వచ్చాక బయలుదేరారు.
మండపేట బహిరంగ సభలో
తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ-జనసేన కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని చంద్రబాబు అన్నారు. మండపేట బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ...పార్టీలో అయారాం గయారాంలను పట్టించుకునే ప్రసక్తే లేదన్నారు. అమలాపురంలో 7 సీట్లను టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దళితులకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ మాత్రమే అన్నారు.