గనులశాఖలో ప్రభుత్వం ఎస్మా అస్త్రం.. ఉద్యోగుల మండిపాటు!
గనులశాఖలో ఎస్మా ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. సమ్మెకు వెళితే ఎస్మా ప్రయోగిస్తామని అధికారులు తేల్చిచెబుతున్నారు. ఓవైపు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతూనే.. ప్రభుత్వం ఇలాంటి ఉత్తర్వులు జారీచేయడం ఏంటని ఉద్యోగులు మండిపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ గనులశాఖలో ఎస్మా ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. ఉద్యోగులు సమ్మెకు వెళితే.. ఎస్మా చట్టం ప్రయోగిస్తామని ఆ శాఖ డైరెక్టర్ వెంకట్రెడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపుతున్న సమయంలోనే.. ఇలాంటి ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.
అసలు గనులశాఖలో అత్యవసర సేవలు ఏముంటాయి? అని ఉద్యోగులు మండిపడుతున్నారు. చర్చల వేళ ఇలాంటి ఉత్తర్వులు చేయడం.. ద్వంద్వ వైఖరికి దారితీస్తుందని అంటున్నారు.
ఎస్మా ఉల్లంఘిస్తే..
ఎస్మా అంటే.. ఎసెన్షియల్ సర్వీసెస్ మెయిన్టేనెన్స్ యాక్ట్. భారీ సమ్మె పిలుపులు వినపడిన దాదాపు ప్రతిసారి ఈ ఎస్మా వార్తల్లో నిలుస్తుంది. సమ్మె, ఆందోళనల వేళ జనజీవనం ఇబ్బంది ఎదుర్కోకుండా.. కొన్ని అత్యవసర సేవలను నిర్వహించాల్సిందేనని ఎస్మా చెబుతోంది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే.. పోలీసు అధికారులు వారెంట్ లేకుండానే అరెస్టులు చేయవచ్చు. ఎస్మాకు విరుద్ధంగా సమ్మెకు వెళ్లే ఉద్యోగులును తక్షణమే విధుల నుంచి తొలగించవచ్చు. వారికి మద్దతిచ్చే వారికి సైతం జైలు శిక్ష లేదా జరిమానాలు తప్పవు.
సంబంధిత కథనం