AP TS Rains : తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు- పలు జిల్లాల్లో పిడుగుపాటు హెచ్చరికలు-ap ts rains weather report next three days moderate to heavy rains thunderstorms ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ts Rains : తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు- పలు జిల్లాల్లో పిడుగుపాటు హెచ్చరికలు

AP TS Rains : తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు- పలు జిల్లాల్లో పిడుగుపాటు హెచ్చరికలు

Bandaru Satyaprasad HT Telugu
Nov 08, 2023 02:47 PM IST

AP TS Rains : ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటిచింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

AP TS Rains : తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. ఏపీ, తెలంగాణలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్, మహబూబ్ నగర్, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, నారాయణ పేట, రంగారెడ్డి జిల్లాలతో పాటు మేడ్చల్, మల్కాజ్ గిరి, వరంగల్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, కర్నాటక, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

ఏపీలో వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. గత నాలుగేళ్లగా ఏపీలో వర్షపాతం తక్కువగా నమోదైంది. అల్పపీడనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కురుస్తు్న్న వర్షాలతో ఈ లోటు తగ్గుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. ఉరుములు, పిడుగులతో వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పిడుగులు పడే అవకాశం

ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, రాయచోటి, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరికొన్ని రోజులు ఈ పరిస్థితి కొనసాగుతుందని, విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారుల వెల్లడించారు.

IPL_Entry_Point