AP TET 2022 : ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) టెట్ పరీక్షలు నేటి నుంచి జరుగనున్నాయి. ఆగస్టు 6 నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. మరో వైపు ఆన్‌లైన్ నిర్వహిస్తున్నటెట్ పరీక్షల్లో వేలాదిమందికి తెలంగాణలో పరీక్షా కేంద్రాలను కేటాయించడంతో అభ్యర్ధులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి టీచర్ ఎలిజిబిలిటీ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఆగస్టు 6 నుంచి 21 వరకు ఆన్ లైన్ విధానంలో టెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం గం.9.30ల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం గం.2.30ల నుంచి 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష జరుగుతుంది. ఇప్పటికే హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకుని, పరీక్షకు హాజరవ్వాలని అధికారులు తెలిపారు.
పరీక్షా కేంద్రాలను ఏపీతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఒడిశాలో ఏర్పాటు చేశారు. ఏపీలో సరిపడినన్ని పరీక్షా కేంద్రాలు లేకపోవడంతో అభ్యర్ధులు విధిలేక ఇతర రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాల్సి వచ్చింది. ఉత్తరాంధ్ర జిల్లాల అభ్యర్ధులు ఒడిశా పరీక్షా కేంద్రాలను ఎంచుకుంటే, రాయలసీమ జిల్లాల వారు తమిళనాడు, కర్ణాటకలలో కేంద్రాలకు హాజరు కావాల్సి ఉంది.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఓసీలకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40 శాతం మార్కులు వస్తే అర్హత మార్కులుగా నిర్థారించారు. టెట్‌లో సాధించిన మార్కులకు డీఎస్‌సీలో 20 శాతం వెయిటేజ్ ఇవ్వనున్నారు. ఈసారి టెట్ లో అర్హత సాధిస్తే అభ్యర్థులకు లైఫ్ లాంగ్ చెల్లుబాటు అయ్యేలా మార్పు చేశారు. ఆగస్టు 31వ తేదీన పరీక్ష ప్రైమరీ కీ విడుదల చేస్తారు. సెప్టెంబరు 1 నుంచి 7వ తేదీ వరకు ఆన్సర్ కీ పై అభ్యంతరాలు తెలిపే అవకాశం కల్పించారు. సెప్టెంబరు 12న ఫైనల్ కీ, సెప్టెంబర్ 14న రిజెల్ట్స్ విడుదల చేయనున్నారు.
దూర ప్రాంతంలో కేటాయించిన పరీక్షా కేంద్రాలకు వెళ్లలేక చాలామంది అభ్యర్ధులు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ పాఠశాలల్లో బోధనకు కూడా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేశారు. దీంతో దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలు లేకున్నా భారీ సంఖ్యలో అభ్యర్థులు టెట్ కోసం దరకాస్తు చేసుకోవడం కనిపించింది.
టాపిక్