AP Govt Employees Association : ప్రభుత్వ బెదిరింపులకు తలొగ్గమంటున్న ఉద్యోగులు
AP Govt Employees Association ఏపీ ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. సస్పెన్షన్లు, వేధింపులతో ఉద్యోగుల ఉద్యమాలను అడ్డుకోలేరని తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వంపై పోరాటం విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. ఉద్యోగుల ఉద్యమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వ ఉద్యోగల సంఘం ప్రకటించింది.
AP Govt Employees Association ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తమ డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. రాబోయే రోజుల్లో తాడోపేడో తేల్చుకుంటామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్స్ సర్వీసెస్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కలిసి నడుస్తామని ప్రకటించారు
ఉద్యోగులను బెదిరించడానికి ఎన్ని నోటీసులిచ్చినా, కాగితాలిచ్చినా తీసుకుంటామని, నోటీసులు కాగితాలతో ఆడుకుంటూ 33 ఏళ్లు ఉద్యోగాలు చేసినట్లు చెప్పారు. బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదని, ఉద్యోగుల్లో ఎంత మందిని సస్పెండ్ చేసినా, ఎన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా తమ వేరు చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. డిమాండ్ల విషయంలో ఉద్యోగులు సంఘటితంగానే ఉన్నామని చెప్పారు.
వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసే 1500 మందిలో 1,300 మంది తమ సంఘంలోనే ఉన్నారని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వచ్చేనెల రెండో వారం నుంచి దశలవారీ ఆందోళనలు నిర్వహించాలని సమావేశంలో తీర్మానించామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం అనంతరం సూర్యనారాయణ మాట్లాడారు.
విశాఖ, విజయవాడ-1 డివిజన్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులను క్రమశిక్షణ చర్యల పేరుతో ఇటీవల సస్పెండ్ చేశారని, అసోసియేషన్‌లో కీలకంగా పనిచేసే వారిపై ఇలాంటి చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. సస్పెన్షన్‌కు కారణమైన వ్యవహారాల్లో భాగమైన నలుగురు అధికారుల విషయంలో మాత్రం పక్షపాతంతో వ్యవహరించారని, వారిని సస్పెండ్ చేయలేదన్నారు.
అధికార వికేంద్రీకరణకు వ్యతిరేకంగా నలుగురైదుగురు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏసీబీ కేసుల్లో పట్టుబడిన వారిని విచారణాధికారిగా నియమించి, కింది స్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేయడమేంటని ప్రశ్నించారు. రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేయాలని కాంట్రాక్టు ఉద్యోగి నివేదిక ఎలా ఇస్తారని సూర్యనారాయణ ప్రశ్నించారు.
వాణిజ్య పన్నుల శాఖలోని ముగ్గురు అధికారుల కారణంగానే రాష్ట్ర ఖజానాలో రూ.వందల కోట్లు కోల్పోతోందనే ఆరోపణలున్నాయన్నారు. అక్రమాలపై లోకాయుక్త లేదా విజిలెన్స్ లేదా అవినీతి నిరోధకశాఖతో విచారణ చేయించాలని వాణిజ్య పన్నులశాఖ సర్వీసెస్ అసోసియేషన్ తీర్మానించిందని చెప్పారు. నిధుల కేటాయింపు లేకుండానే విశాఖలోని వాణిజ్య పన్నులశాఖ ప్రాంతీయ కార్యాలయ భవనాన్ని కార్పొరేట్ కార్యాలయాన్ని తలపించేలా రూపుదిద్దారని, దీనికి మంత్రి, ఉన్నతాధికారులూ హాజరవడం విస్మయకరమన్నారు.
ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు చట్టబద్ధత కల్పించాలని గవర్నర్‌కు విన్నపమిస్తే ఫిర్యాదుగా భావించి సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదంటూ ప్రభుత్వం నోటీసులిచ్చింది. ప్రభుత్వ తాబేదార్ల సంఘాలూ ఈ డిమాండ్ చేశాయని ఆరోపించారు.
ఉద్యోగులను మాఫియా, స్మగ్లర్లంటున్నారని.. అయితే వాటికి కమిషనర్లు, అధికారులు అధినేతలా ' అని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు మండిపడ్డారు. తనను గతంలో రెండుసార్లు ప్రభుత్వం సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని స్వాగతించినందుకు రెండుసార్లు సాక్షిలో ప్రచురితమైన వార్తల ఆధారంగా సస్పెండ్ చేశారన్నారు.
రెండుసార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించి జీవోలను రద్దు చేసేలా ఉత్తర్వులు తెచ్చుకున్నామని ఉద్యోగులకు ధైర్యం తెలిపారు. '103 జీవో ద్వారా గుర్తింపు పొందిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీసీపీ సర్వీసెస్ అసోసియేషన్ కూడా ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వంపై ఫిర్యాదు చేసినందుకు ఇప్పుడు ఇవి పనికిరాకుండా పోతాయా ' అని ప్రశ్నించారు.
ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తే తాము చేదు అయ్యామా? ' అని నిలదీశారు. ఉద్యోగ సంఘాలంటే ప్రభుత్వాలకు అణిమణిగి ఉండాల్సిన అవసరం లేదనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఉద్యోగులంటే లోకువగా చూడొద్దని విజయమో, వీర స్వర్గమో తప్ప ఓడిపోయే ప్రసక్తి లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.