Aadhaar Camps : గిరిజన ప్రాంతాల్లో ఆధార్ ప్రత్యేక క్యాంప్‌లు, ఈ నెలలోనే 8 రోజుల పాటు అందుబాటులో
Aadhaar Camps : రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ఆధార్ ప్రత్యేక క్యాంప్‌లను నిర్వహించనున్నారు. నవంబర్ నెలలోనే రెండు సార్లు ఎనిమిది రోజుల పాటు ఈ క్యాంప్‌లు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఆధార్ మార్పులు, చేర్పులు చేసుకోని వారు, ఈ క్యాంపుల్లో సద్వినియోగం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలు, అనాథశరణాలయాల్లో ఆధార్ ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేయనున్నారు. నవంబర్ మూడో వారంలో 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహిస్తారు. అలాగే నవంబర్ నాలుగో వారంలో 26 నుంచి 29 వరకు మరో నాలుగు రోజుల పాటు ఈ ప్రత్యేక క్యాప్‌లు నిర్వహించనున్నారు.
అన్ని ఆధార్ కిట్‌లు వర్కింగ్ కండిషన్‌లో ఉండేలా చూడాలని ఆధార్ ఆపరేటర్స్‌కు అధికారులు ఆదేశించారు. ఈ క్యాంప్‌లో ప్రజలు తమ ఆధార్ కార్డులోని తప్పొప్పులను సరి చేసుకోవచ్చు. అలాగే ఆధార్‌ను కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో ఆధార్ ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించారు. రాష్ట్రంలో గత నెల 22 నుంచి 25 వరకు ఆధార్ ప్రత్యేక క్యాంపులను నిర్వహించారు. గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ అండ్ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం (జీవీడబ్ల్యూవీ&వీఎస్‌డబ్ల్యూఎస్) డిపార్ట్‌మెంట్, ఆధార్ ఆపరేటర్స్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించారు.
జీవీడబ్ల్యూవీ&వీఎస్‌డబ్ల్యూఎస్ సచివాలయాల్లో 2,950 ఆధార్ సేవా కేంద్రాలను (ఏఎస్‌కే) ఏర్పాటు చేశారు. కొత్త ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్‌లు, డెమోగ్రాఫిక్ అప్‌డేట్, ఈ-ఆధార్ వంటి మొత్తం 56 ఆధార్ సేవలను అందించింది. యూఐడీఏఐ మార్గదర్శకాల ప్రకారం 5 సంవత్సరాల తరువాత, 15 సంవత్సరాల తరువాత వయస్సు పిల్లలకు తప్పనిసరిగా వారి బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.
యూఐడీఏఐ సూచన ప్రకారం, రాష్ట్రంలో దాదాపు 45,58,854 తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. వంద శాతం తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్‌లు, కొత్త ఎన్‌రోల్‌మెంట్ (వయస్సు 0-5)లను చేయడానికి ఆధార్ ఆపరేటర్ల ద్వారా సచివాలయాలు, పాఠశాలలు, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలలో ఆధార్ ప్రత్యేక కేంద్రాలను నిర్వహించారు.
మళ్లీ ఇప్పుడు గిరిజన ప్రాంతాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, అనాథశరణాలయాల్లో ఆధార్ ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ క్యాంపుల్లో ఆధార్‌కు సంబంధించి అన్ని రకాలు సేవలను అందించనున్నారు. ఈ క్యాంప్‌ల్లో కొత్త ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్‌లు, డెమోగ్రాఫిక్ అప్‌డేట్, ఈ-ఆధార్ వంటి సేవలను అందిస్తారు.
ఆధార్ అప్‌డేట్‌కు డిసెంబర్ 14 వరకు గడువు పొడిగింపు
ఎంతో మంది పదేళ్లు దాటినా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవడం లేదు. చిరునామా, ఫొటోలను అప్‌డేట్ చేయడం వల్ల మోసాలను నిరోధించవచ్చు. ఈ నేపథ్యంలో పదేళ్లు దాటిన ఆధార్ సమాచారాన్ని ఫ్రీగా అప్ డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 వరకు కేంద్రం గడువునిచ్చింది. ఇదే చివరి గడువు కావొచ్చని ప్రచారం జరుగుతోంది. మై ఆధార్ పోర్టల్లో లాగిన్ అయి అప్‌డేట్ చేసుకోండి. తొలిత సెప్టెంబర్ 14 వరకు గడువు ఇచ్చిన యూఐడీఏఐ, దాన్ని డిసెంబర్ 14 వరకు పొడిగించింది. ఆధార్ అప్‌డేట్ కోసం వసూలు చేసే సాధారణ ఫీజును సైతం ఈ సర్వీస్ కోసం మాఫీ చేసింది. అంటే ఆధార్ తీసుకుని పదేళ్ల పైబడిన ఆధార్ కార్డుదారులు ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ఈ సర్వీసును ఇప్పుడు ఈ ఉచిత సర్వీసునుక మరొక నెల రోజులు పెంచింది.
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం