AP Mega DSC Notification : ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మరో రెండు నెలలు ఆలస్యం, కారణమేంటంటే?
AP Mega DSC Notification : ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మరో రెండు నెలలు ఆలస్యం కానుందని సమాచారం. ఎస్సీ వర్గీకరణపై స్పష్టత వచ్చిన తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ నియమించి, రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అయితే మరో రెండు నెలలు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6న నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. ఇటీవల ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ ఇంకా పూర్తి కాకపోవడంతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. ఏపీలో ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటుచేసింది. రెండు నెలల్లో ఎస్సీ వర్గీకరణపై నివేదిక ఇవ్వాలని కమిషన్ ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నివేదిక వచ్చిన తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి డీఎస్సీ నియామకాలు పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేశ్ ఇటీవల అసెంబ్లీలో ప్రకటన చేశారు.
డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి నారా లోకేశ్ ఇటీవల ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోగా డీఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సభలో ప్రకటించారు. ఉపాధ్యాయుల సమస్యలు, నియమకాలు, టీచర్ల విధులపై సభలో పలువురు ప్రశ్నలు అడిగిన ప్రశ్నలకు లోకేశ్ సమాధానమిచ్చారు.
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ జాప్యం కావడంపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 1994 ముందు టీచర్ రిక్రూట్‌మెంట్ జిల్లాస్థాయిలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ నియామకాలు జరిగేవని, 1994 నుంచి రాష్ట్ర స్థాయిలో డీఎస్సీ జరుగుతోందన్నారు. 1994 నుంచి ఇప్పటి వరకు 15 డీఎస్సీలు టీడీపీ హయంలోనే నిర్వహించినట్టు చెప్పారు. 2019 వరకు మొత్తం 2.20లక్షల పోస్టులను భర్తీ చేస్తే వాటిలో 1.80లక్షల పోస్టుల్ని టీడీపీ ప్రభుత్వం భర్తీ చేసినట్టు లోకేశ్ చెప్పారు.
గత ప్రభుత్వంలో డీఎస్సీ 2024 నోటిఫికేషన్ 2024 ఫిబ్రవరి 12న నిరుద్యోగుల్ని మభ్య పెట్టడానికి ఎన్నికలకు ముందు 6100పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో డీఎస్సీ ద్వారా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. టీడపీ, జనసేన, బీజేపీ కలిసి గెలిచిన వెంటనే మెగా డీఎస్సీకి సంతకం చేశారని దానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో వయో పరిమితి పెంపు డిమాండ్‌ను పరిగణలోకి తీసుకున్నామని దీనిపై అన్ని శాఖల మధ్య ఫైల్ సర్క్యూలేషన్‌లో ఉందని, ఎంత వయోపరిమితి పెంచుతామనేది స్పష్టత రాగానే ప్రకటిస్తామన్నారు.
డీఎస్సీ పోస్టులు
వచ్చే నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.
- స్కూల్ అసిస్టెంట్ - 7,725
- ఎస్‌జీటీ - 6371
- టీజీటీ - 1781
- పీజీటీ - 286
- పీఈటీ - 132
- ప్రిన్సిపల్స్ - 52
సంబంధిత కథనం