AP Govt : 5 లక్షలలోపు ఆదాయం ఉన్న ఆలయాలకు ఫీజు మినహాయింపు
తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదనపు భారం పడకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
ఏపీలో 5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలు, ఇతర హిందూ ధార్మికసంస్థలు చట్టబద్ధంగా దేవదాయ శాఖకు చెల్లించాల్సిన వివిధ రకాల ఫీజుల నుంచి మినహాయింపునిచ్చింది. దీనికి.. సంబంధించి దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ జిల్లాల దేవదాయ శాఖ అధికారులకు, డిప్యూటీ కమిషనర్లు, రీజనల్ జాయింట్ కమిషనర్లకు సూచనలు జారీ అయ్యాయి.
తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలపై అదనపు భారం పడకుండా చిన్న ఆలయాలను అర్చకులకు అప్పగించే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాలు, ఇతర హిందూ మత సంస్థలకు దేవాదాయ శాఖకు చట్టబద్ధంగా చెల్లించాల్సిన రుసుము నుంచి మినహాయింపు ఉంటుందని చెబుతున్నారు. అయితే దీనిపై.. అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉండగా ఆలయాల నుంచి ముందస్తుగా ఎలాంటి రుసుములు వసూలు చేయరాదని కమిషనర్ ఆదేశించారు.
ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్ యాక్ట్ ప్రకారం రాష్ట్రంలో రూ.2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలు ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రతి ఆలయం దాని నికర ఆదాయంలో తొమ్మిది శాతం కామన్ గుడ్ ఫండ్ (సిజిఎఫ్)కి మరో ఎనిమిది శాతం ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఫండ్‌కు చెల్లించాలి. మిగిలిన 1.5 శాతాన్ని ఆడిట్ ఫీజుగా చెల్లించాలి. ఈ నిబంధన ఇటీవలి వరకు అమలులో ఉంది. తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు మినహాయింపు ఇవ్వాలని హైకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు సూచనపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాలు 7వేలకు పైగా ఉన్నాయని జిల్లా అధికారులు చెబుతున్నారు. వాటిలో దాదాపు 3,000 ఆలయాలు ఇప్పటికే అర్చకులు లేదా వంశపారంపర్య ధర్మకర్తల చేతుల్లో ఉన్నాయి. దీనికి తోడు రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాలకు చట్టబద్ధంగా చెల్లించాల్సిన రుసుము నుంచి మినహాయింపు ఇస్తూ దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయంతో ఆయా ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల జీతాలకు ఆర్థికంగా ఊరట లభించనుంది.
రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో మొత్తం 24,699 గుళ్లు, ఇతర హిందూ ధార్మికసంస్థలు ఉన్నాయి. ఏటా రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలు 23,465 వరకూ ఉన్నాయి. దేవదాయ శాఖ పరిధిలోని మొత్తం గుళ్లలో ఏటా రూ.ఐదులక్షల లోపు నికర ఆదాయం ఉండే ఆలయాలే 95 శాతంగా ఉన్నట్టు లెక్క. రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉన్న వాటిలో 4,131 ఆలయాలు మాత్రమే దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారుల పర్యవేక్షణలో ఉన్నాయి. ఫీజు మినహాయింపు నిర్ణయంతో కొత్తగా 1,254 ఆలయాలకు లబ్ధి కలిగే అవకాశం ఉంది.
సంబంధిత కథనం
టాపిక్