AP Best Teachers Awards : 174 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు, విద్యాశాఖ ప్రకటన-లిస్ట్ ఇదే
AP Best Teachers Awards : ఏపీ విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రకటించింది. 174 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందించనున్నారు. ఈ నెల 11న మంగళగిరిలో జరిగి కార్యక్రమంలో ఉపాధ్యాయులకు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు.
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రకటించింది. 174 మందిని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు విద్యాశాఖ ఎంపిక చేసింది. ఈ నెల 11న జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జరిగే కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖలో 77 మంది, ఇంటర్మీడియట్ విద్యాశాఖలో 26 మంది, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్లు 16, డిగ్రీ లెక్చరర్లు 19, ఇంజినీరింగ్, ఫార్మసీ లెక్చరర్లు 4గురు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు 32 మందిని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి. అవార్డులకు ఎంపికైన వారి జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది.
ఉపాధ్యాయులకు శిక్షణ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచేందుకు టీచర్లకు ఇస్తున్న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ రెసిడెన్షియల్ శిక్షణపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు స్థానికంగా శిక్షణ ఇవ్వాలని కోరినా విద్యాశాఖ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆగిరిపల్లిలో శిక్షణ కోసం వచ్చిన ఉపాధ్యాయుడు మృతి చెందడం, చీరాలలో మరో ఉపాధ్యాయుడు అస్వస్థతకు గురికావడంతో ఈ శిక్షణను పూర్తిగా బహిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి. టీచర్లపై భారాన్ని తొలగిస్తామని, యాప్స్, శిక్షణ అంశాలను తొలగిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు చెప్పారు. ఈ హామీలను అమలు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. 50 ఏళ్లు పైబడిన వారికి శిక్షణ నుంచి మినహాయించాలని కోరుతున్నా విద్యాశాఖ పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. పాఠశాల విద్య డైరెక్టర్ కు విజ్ఞప్తి చేస్తామని, తమకు అనుకూలంగా నిర్ణయం రాకుంటే ఈ శిక్షణను బహిష్కరిస్తామని ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.
విద్యాబోధన ప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఉండాలని జాతీయ విద్యా విధానం, నిపుణ్ భారత్ ప్రోగ్రామ్ లో భాగంగా పాఠశాల విద్యాశాఖ ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణను అమలు చేస్తుంది. ఇందులో 1, 2 తరగతులపై దృష్టి సారించి, 3 నుంచి 8 సంవత్సరాల వయసు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కోర్సులు రూపొందించారు. మొత్తం 34 వేల మంది గ్రేడ్–1, 2 కేటగిరీ ఉపాధ్యాయులకు 14 విడతల్లో ఈ శిక్షణ ఇవ్వనున్నారు. గతేడాది ఈ శిక్షణను రాష్ట్ర వ్యాప్తంగా 9 కేంద్రాల్లో దాదాపు 4 వేల మందికి, ఈ ఏడాది తొలివిడత 1,700 మందికి శిక్షణ ఇస్తున్నారు.
సంబంధిత కథనం