Davos Invitation Issue : దావోస్ ఆహ్వాన వివాదం.. లేఖ విడుదల చేసిన ఏపీ సర్కార్ !-ap government denies allegations ap has not received an invitation to the davos summit releases official invitation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Davos Invitation Issue : దావోస్ ఆహ్వాన వివాదం.. లేఖ విడుదల చేసిన ఏపీ సర్కార్ !

Davos Invitation Issue : దావోస్ ఆహ్వాన వివాదం.. లేఖ విడుదల చేసిన ఏపీ సర్కార్ !

HT Telugu Desk HT Telugu
Jan 17, 2023 04:25 PM IST

Davos Invitation Issue : దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకి ఆహ్వానం అందలేదన్న విమర్శలను ఏపీ సర్కార్ ఖండించింది. కొంత మంది కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు దావోస్ నుంచి వచ్చిన ఇన్విటేషన్ ను ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేరిట విడుదల చేసింది.

ఏపీ ఫ్యాక్ట్ చెక్ విడుదల చేసిన దావోస్ ఇన్విటేషన్
ఏపీ ఫ్యాక్ట్ చెక్ విడుదల చేసిన దావోస్ ఇన్విటేషన్

Davos Invitation Issue : స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) సదస్సుకి ఏపీకి ఆహ్వానం అందలేదన్న ప్రచారాన్ని... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించింది. ఏపీకి ఆహ్వానం అందలేదంటూ టీడీపీ చేస్తోన్న విమర్శలను తోసిపుచ్చింది. కొంత మంది కావాలనే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని.. కొన్ని వెబ్ సైట్లు అసత్యాలను వ్యాప్తి చేస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేరిట ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక నుంచి గతేడాది నవంబర్ లోనే ఆహ్వానం అందిందని పేర్కొంది. ఆహ్వాన లేఖని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

సీఎం జగన్ నేతృత్వంలోని బృందం.. గతేడాది దావోస్ సదస్సుకు హాజరైంది. పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు జరిపింది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి... రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. ఈ క్రమంలో పలు కంపెనీలు, సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు కుదర్చుకుంది. తాజాగా గ్రీన్‌ ఎనర్జీకి సంబంధించి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులపై అదానీ, గ్రీన్‌కో, అరబిందోలతో రూ. 1.25 లక్షల కోట్ల ఒప్పందం కుదిరింది. మచిలీపట్నంలో గ్రీన్‌ ఎనర్జీ ఎస్‌ఈజెడ్, హై ఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖ, యూనికార్న్‌ స్టార్టప్స్‌కూ వేదిక తదితర అంశాలపై పలు సంస్థలతో ఎంఓయూలూ కుదుర్చుకుంది. సీఎం దావోస్ పర్యటన విజయవంతం అయిందని.. రాష్ట్రానికి భారీ మొత్తంలో పెట్టుబడులు వస్తాయని ప్రకటించింది.

కాగా... ఈ ఏడాది జనవరి 16 నుంచి 20 వరకు జరుగుతోన్న దావోస్ పర్యటనకు ఏపీ నుంచి ఎవరూ హాజరుకాకపోవటంతో... రాష్ట్రానికి ఆహ్వానం అందలేదన్న ప్రచారం మొదలైంది. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకి కూడా ఆహ్వానం అందలేదని.. పిలిచినా దండగే అనుకుని ఉంటారని.. టీడీపీ విమర్శించింది. ఈ నేపథ్యంలో... ఆహ్వాన అంశంలో జరుగుతోన్న ప్రచారాన్ని ఖండిస్తూ ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేరిట ప్రభుత్వం... దావోస్ ఇన్విటేషన్ లెటర్ ను విడుదల చేసింది. ఆహ్వానం అందలేదన్నది పూర్తిగా అవాస్తమని.. కొంత మంది కావాలనే అసత్యాలు వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది.

అయితే.. ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన ఆహ్వాన లేఖపైనా సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఇన్విటేషన్ లెటర్ లో.. వెలగపూడి పిన్ కోడ్ - 500022 గా ఉంది. అయితే... అది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సెక్రటేరియట్ పరిధిలోని పిన్ కోడ్. ఈ నేపథ్యంలో... దావోస్ సదస్సుకి ఆహ్వానం అందలేదన్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ఫేక్ ఇన్విటేషన్ సర్కులేట్ చేస్తోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

మరోవైపు… తెలంగాణ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బృందం.. దావోస్ సదస్సులో పలు సంస్థల ప్రతినిధులతో పెట్టుబడుల అంశంపై చర్చలు జరుపుతోంది. లైఫ్ సైన్సైస్, ఆరోగ్య సంరక్షణపై పరిశోధనలు చేసేందుకు హైదరాబాద్ లో సెంటర్ ఏర్పాటు చేస్తామని వరల్డ్ ఎకనామిక్ ఫోరంనకు చెందిన సెంటర్ ఫర్ ఫోర్డ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ సంస్థ తెలిపింది.

Whats_app_banner