AP Paddy Procurement : ఏపీలో మార్చి 15 వరకు ధాన్యం కొనుగోళ్లు…..-ap government decides to procure paddy till march 15 from farmers in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Paddy Procurement : ఏపీలో మార్చి 15 వరకు ధాన్యం కొనుగోళ్లు…..

AP Paddy Procurement : ఏపీలో మార్చి 15 వరకు ధాన్యం కొనుగోళ్లు…..

HT Telugu Desk HT Telugu
Jan 20, 2023 11:29 AM IST

AP Paddy Procurement ఆంధ్రప్రదేశ్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 21 రోజుల్లో డబ్బులు చెల్లిస్తున్నామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ధాన్యం కొనుగోళ్లు నిలిపివేశారనే వార్తల్ని ఖండించిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మార్చి 15వరకు ధాన్యం సేకరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇప్పటికే 26లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించినట్లు చెప్పారు.

పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

AP Paddy Procurement ఏపీలో ధాన్యం సేకరణ కొనసాగుతోందని, వచ్చే మార్చి 15వరకు ధాన్యం సేకరణ జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాయలసీమ జిల్లాల్లో " పైలట్ ప్రాజెక్ట్ " గా రేషన్‌ కార్డుదారులకు రాగులు, జొన్నలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఏపీలో ప్రభుత్వ నిబంధనలు పాటించని 4 రైస్ మిల్లులను సీజ్ చేశామని మంత్రి తెలిపారు.

దళారులు, మిల్లర్లతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. రైతులకు ఎలాంటి నష్టం రాకుండా నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో దళారి వ్యవస్థని పూర్తిగా నిర్మూలించామని, ధాన్యం సేకరించి డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తున్నామన్నారు.

ప్రతిపక్షాలు రైతుల్ని రెచ్చగొట్టినా రైతులు మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పలికారని చెప్పారు. ప్రభుత్వమే నేరుగా ధాన్యాన్ని సేకరించడం వల్ల ప్రతి రైతుకు ఎకారానికి 8 వేల రూపాయల అదనపు లబ్ధి చేకూరిందన్నారు. ప్రతిపక్షాలకు చెందిన రైతులు కూడా ముఖ్యమంత్రిని ప్రశంసిస్తున్నారని తెలిపారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ధాన్యం సేకరిస్తున్నామని, రైతులకు మద్దతు ధర ప్రకటించి అమలు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 90 శాతం ఇప్పటికే చెల్లింపులు చేశామని, 21 రోజులల్లోపే ధాన్యం సేకరణకు సంబంధించి సొమ్ములు చెల్లిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని ప్రకటించారు.

పాత బకాయిలన్నీ ఈ ఏడాది చెల్లిస్తాం….

మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.900 కోట్లు ఉన్నాయని.. మిల్లర్ల పాత బకాయిలన్నింటినీ ఈ ఆర్థిక సంవత్సరంలో క్లియర్ చేస్తామని మంత్రి ప్రకటించారు. ఇంటింటికీ రేషన్ ఇచ్చే ఎండీయూ వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్ మొత్తాన్ని వాహనమిత్ర పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లుస్తుందన్నారు.

ఎండీయూలు బ్యాంకులకు ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెల్లిస్తే వారందరికీ తిరిగి ఆ మొత్తాన్ని జమ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న 9,260 ఎండీయూ వాహనాలన్నీ పనిచేస్తున్నాయని, ఏ బండీ ఆగలేదని మంత్రి స్పష్టం చేశారు. రేషన్ షాపుల ద్వారా ఇచ్చే కందిపప్పు బాగోలేదని కొంతమంది ఫిర్యాదు చేశారని, వాహనం వద్దే కంది పప్పును ఉడకబెట్టి నాణ్యత పరిశీలించాలని అధికారులను ఆదేశించామని, విచారణ కొనసాగుతోందన్నారు.

కందిపప్పు విషయంలో లోపాలు ఉంటే తగు చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ కార్డు దారులకు రాగులు, జొన్నలు తీసుకునే విషయమై వాలంటీర్లతో సర్వే చేశామని, రేషన్ కార్డుదారులందరూ రాగులు, జొన్నలు కావాలని కోరారని మంత్రి వెల్లడించారు. ఫైలట్ ప్రాజెక్టుగా రాయలసీమ జిల్లాల్లో పేదలకు రాగులు, జొన్నలు పంపిణీ చేస్తామని, దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ రాగులు, జొన్నలు పంపిణీ చేస్తామని మంత్రి కారుమూరి ప్రకటించారు.

రైతుల విజ్ఞప్తి మేరకు రంగు మారిన ధాన్యాన్ని మార్చి 15 వరకూ కొనాలని నిర్ణయించామని తెలిపారు. రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేయడం వెనుక కొంతమంది దళారులు ప్రోత్సాహం ఉందన్నారు. దళారులే ఆందోళన చేయించినట్లు ఇంటలిజెన్స్ నివేదికలు వచ్చాయని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

Whats_app_banner