AP DSC Notification: ఏపీ డిఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి బొత్స.. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
AP DSC Notification: ఏపీలో 6100 పోస్టులతో డిఎస్సీ 2024 నోటిఫికేషన్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభయ్యేలోగా నియామకాలను ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి బొత్స ప్రకటించారు.
AP DSC Notification: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డిఎస్సీ నోటిఫికేషన్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సచివాలయంలో విడుదల చేశారు.
మొత్తం 6100 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వం భర్తీ చేయనున్న పోస్టుల్లో 2280 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు, స్కూలు అసిస్టెంట్స్ పోస్టులు 2299 , 1264- టిజిటిలు, 215 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రిన్సిపల్స్ 42 పోస్టులు కలిపి మొత్తం 6100 పోస్టులకి డిఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు.
ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 21 వరకూ ఫీజు చెల్లించడానికి పేమెంట్ గేట్‌వేలు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 22 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారని మంత్రి బొత్స వివరించారు.
మార్చి 5వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. మార్చి 15 నుంచి 30 వరకూ ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తారు.
ఉదయం 9.30 గంటల నుంచి 12 వరకు ఒక సెషన్‌లో ...మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్‌లో పరీక్షలు జరుగుతాయి.
మార్చి 31వ తేదీన ప్రాధమిక కీ విడుదల చేస్తారు. ఏప్రిల్ 1న ప్రాధమిక కీ పై అభ్యంతరాల స్వీకరిచడానికి గడువుగా నిర్ణయించారు. ఏప్రిల్ రెండున ఫైనల్ కీ విడుదల చేస్తారు.
ఏప్రిల్ 7న డిఎస్సీ ఫలితాలు వెలువరిస్తారు. 2018 సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్ళుగా నిర్ణయించారు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో ఐదేళ్లు పరిమితి ఉంటుందని చెప్పారు. నోటిఫికేషన్, జిల్లాల వారీగా ఖాళీలు, పరీక్షా కేంద్రాలు తదితర వివరాలు https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని వివరించారు.