Ramayapatnam Port : ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు పోర్టుల నిర్మాణం…
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోడానికి ప్రతి యాభై కిలోమీటర్ల దూరంలో పోర్టు లేకుంటే ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్, 2019లో ఎన్నికల్లో లబ్ది పొందడానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారని ఆరోపించారు.
డిపిఆర్ లేకుండా, భూసేకరణ చేయకుండా 2019లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేసి ప్రజలని మోసం చేశారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. డిపిఆర్, భూసేకరణ లేకుండా పోర్టు నిర్మాణం పేరుతో లబ్ది పొందే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తాము పోర్టు కోసం 850 కోట్లు భూమిని సేకరించి పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రూ.3736కోట్లతో నాలుగు బెర్తులు నిర్మించి 25మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్ధ్యం రామాయపట్నం పోర్టుకు వస్తుందన్నారు. మరో ఆరు బెర్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అవసరాన్ని బట్టి రూ.200కోట్ల వ్యయంతో ఒక్కో బెర్తు విస్తరించుకునేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.
రామాయపట్నం పోర్టు నిర్మానానికి భూములు ఇచ్చిన మొండివారి పాలెం, కర్లపాలెం, ఆవుల పాలెం, రావూరు, చేవూరు, సాలిపాలెం గ్రామాల ప్రజలకు సీఎం కృతజ్ఞతలు చెప్పారు. ఈ ప్రాంత రూపు రేఖలు మారిపోయేందుకు సహకరించిన వారిని ముఖ్యమంత్రి అభినందించారు. పోర్టుకు అనుబంధంగా పారిశ్రామిక కారిడార్ రావాలని స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి చేయడంతో అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. కావలి బైపాస్ రోడ్డుకు భూసేకరణ నిధుల విడుదలతో పాటు, కందుకూరు మునిసిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తామని ప్రకటించారు.
రామాయపట్నం పోర్టుతో ఉద్యోగవకాశాలు పెరిగి, ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందని సీఎం జగన్ చెప్పారు. జలరవాణాతో ఖర్చు గణనీయంగా తగ్గుతుందన్నారు. రామాయపట్నం పోర్టుతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయన్నారు. రాష్ట్రంలో ఏ పరిశ్రమ వచ్చినా 75శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయని, పోర్టు నిర్మాణం ద్వారా పోర్టుతో పాటు పోర్టుకు అనుబంధంగా వచ్చే పరిశ్రమల్లో కూడా 75శాతం ఉద్యోగాలు స్థానికులకు వస్తాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు పోర్టులు ఉన్నాయని, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నంలలో ఆరు పోర్టులు ఉన్నాయని , వాటిలో ఐదు పోర్టులకు కలిపి 158మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉందని విశాఖలో 70 మిలియన్ టన్నుల సరకు రవాణా సామర్ధ్యం ఉందన్నారు.
ఐదేళ్లలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ గేట్‌వే పోర్టుల నిర్మాణం ద్వారా 100మిలియన్ టన్నుల సామర్ధ్యంతో పోర్టుల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. వీటితో పాటు రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణం వేగంగా చేస్తున్నట్లు చెప్పారు.మిగిలిన పోర్టులకు కూడా త్వరలో భూమి పూజ చేస్తామని ప్రకటించారు. ప్రతి 50కిలోమీటర్లకు ఓ ఫిషింగ్ హార్బర్ లేదంటే పోర్టును అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం చెప్పారు. 9ఫిషింగ్ హార్బర్‌లు రాష్ట్రంలో అందుబాటులోకి వస్తే ప్రజలు ఎక్కడికి వలస వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు.
అంతకు ముందు రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించిన సీఎం సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు. సముద్రంలో డ్రెడ్జింగ్ పనుల్ని లాంఛనంగా ప్రారంభించారు. రామాయ పట్నం పోర్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. 36నెలల్లో పోర్టు తొలిదశ పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
టాపిక్