October 15 Telugu News Updates : విశాఖ చేరుకున్న జనసేనాని పవన్
- Today Telugu News Updates: అక్టోబర్ 15 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. లైవ్ అప్ డేట్స్ కోసం ఎప్పటికప్పుడూ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి
Sat, 15 Oct 202204:20 PM IST
నలుగురు అరెస్ట్…!
ఉప్పల్ తండ్రీకొడుకుల దారుణ హత్య కేసును చేధించే పనిలో పడ్డారు పోలీసులు. విచారణలో ఒక్కో విషయం వెలుగులోకి వస్తున్నాయి. శంషాబాద్ లోని 8 ఎకరాల భూమి విషయమే వీరి హత్యకు కారణం కావొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతన్నాయి. ఈ కేసు దర్యాప్తు కోసం 15 బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటివరకు 30 మందిని విచారించిన పోలీసులు.... నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
Sat, 15 Oct 202202:10 PM IST
భారీ పెట్టుబడి…
తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మలబార్ గ్రూప్ ముందుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మలబార్ గ్రూప్ ఏర్పాటు చేయనున్న బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ యూనిట్‌కు మంత్రి కేటీఆర్ శనివారం శంకుస్థాపన చేశారు.
Sat, 15 Oct 202201:36 PM IST
విడ్డూరంగా ఉంది - జనసేన
విశాఖ విమానాశ్రయంలో మంత్రులు మీద జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేశారని రాష్ట్ర మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. 'అసలు మంత్రుల కార్ల మీద దాడి జరిగినట్లుగానీ, అది జనసేన వాళ్ళు చేసినట్లుగానీ పోలీస్ శాఖ నిర్ధారించలేదు. కేవలం వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు మాత్రమే ఇది. దాడి సంస్కృతి మా పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదు. ఆ విద్యలో వైసీపీ వాళ్ళు ఆరితేరిపోయారు. విశాఖ విమానాశ్రయంలోనే ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు కోడి కత్తి హడావిడి చేశారు. ఆ కేసు ఏమైందో ఇప్పటికీ ఎవరూ తేల్చలేదు. అదే పంథాలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ఒక పవిత్ర పదవిలో ఉన్న పెద్దాయన మీద దాడి జరిగినట్లు ప్రచారం చేస్తున్నారు. మంత్రుల మీదే దాడి జరిగితే వాళ్ళకు రక్షణగా ఉన్న పోలీసులు ఏం చేస్తున్నట్లు? అలా జరిగితే అది కచ్చితంగా పోలీసు శాఖ వైఫల్యంగానే భావించాల్సి ఉంటుంది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటనకు భారీ జన సందోహం వచ్చింది... రేపటి జనవాణి కార్యక్రమం నుంచి ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మళ్లించేందుకే వైసీపీ కొత్త నాటకానికి తెర తీసింది. విశాఖవాసులకు, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు ఏమిటో తెలుసు? మంత్రుల కాకమ్మ కథలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు" అని అన్నారు.
Sat, 15 Oct 202212:19 PM IST
విశాఖకు పవన్…..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖకు చేరుకున్నాయి. ఆయనకు ఎయిర్ పోర్టులో కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు.
Sat, 15 Oct 202211:37 AM IST
వైసీపీ నేతలపై దాడి….!
విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురు వైసీపీ నేతలపై జనసేన నేతలు దాడి చేసినట్లు తెెలుస్తోంది. ఇందులో వైవీ సుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి ఉన్నట్లు సమాచారం. కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Sat, 15 Oct 202211:20 AM IST
బాధతో రాజీనామా
ఎంతో బాధతో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని... ఏ రోజు కూడా పదవి అడగలేదన్నారు బూర నర్సయ్య గౌడ్ . ప్రజల సమస్యలను ఎత్తడంలో ఎప్పుడు కూడా వెనక్కి పోలేదని చెప్పారు. ఇవాళ సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి తిరిగి రానున్నారు.
Sat, 15 Oct 202208:29 AM IST
వరద….
కృష్ణా వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ప్రస్తుత ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 4.07 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ముంపునకు గురికాబోయే ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
Sat, 15 Oct 202208:24 AM IST
ఫలితాలు విడుదల…
ఏపీ పీజీసెట్-2022 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ర్యాంకుల ఆధారంగా పలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి పలు పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు కడప యోగి వేమన వర్శిటీ... ఏపీ పీజీ సెట్-2022 పరీక్ష నిర్వహించింది. ఏపీ పీజీ సెట్-2022 పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఇలా చెక్ చేసుకోవచ్చు...
అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
ap pgcet result 2022 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Sat, 15 Oct 202208:16 AM IST
పవన్ కళ్యాణ్‌పై రోజా విమర్శలు
కలెక్షన్లు, షూటింగ్ కోసం పవన్‍కు విశాఖ కావాలి, పోటీ చేయడానికి విశాఖ కావాలి..కానీ విశాఖలో రాజధాని వద్దా అని మంత్రి రోజా పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. - పెయిడ్ ఆర్టిస్ట్ లకు సపోర్ట్ చేస్తున్న పవన్ ను తరిమికొట్టాలని విశాఖ గర్జనలో పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే ఎలా ఉంటుందో పవన్‍కు చూపించాలన్నారు.
Sat, 15 Oct 202208:05 AM IST
వికేంద్రీకరణే లక్ష్యంగా విశాఖ గర్జన
వికేంద్రీకరణే లక్ష్యంగా విశాఖ గర్జన నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ పరిపాలన రాజధాని కోరుతూ భారీ ర్యాలీకి భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్, కో కన్వీనర్ దేవుడు, మంత్రులు బొత్స, అమర్నాథ్, ముత్యాలనాయుడు, బుగ్గన, జోగి రమేష్, విడుదల రజని, ఆర్కే రోజా, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, కృష్ణదాస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ప్రజా సంఘాలు పాల్గొన్నారు.
Sat, 15 Oct 202208:04 AM IST
బావ, అల్లుడిని కాపాడుకునేందుకే బాలకృష్ణ టాక్‍షో
బావ, అల్లుడిని కాపాడుకునేందుకే బాలకృష్ణ టాక్‍షో చేశారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‍కు వెన్నుపోటు ఎపిసోడ్‍లో రియల్ విలన్ చంద్రబాబేనని వెన్నుపోటు అనే రక్తపు మరకను తుడిచే ప్రయత్నం చేశారున్నారు. లక్ష్మీపార్వతి, నాదెండ్లను టాక్‍షోకు పిలిచి ఉంటే ఇంకా బాగుండేదన్నారు. బాలకృష్ణ సమర్థుడైతే చంద్రబాబు ఈ స్థాయిలో ఉండేవాడు కాదని, పతనమైపోతున్న టీడీపీ, చంద్రబాబు, లోకేశ్‍ను ఇలాంటి షోలు కాపాడలేవన్నారు. చంద్రబాబు, లోకేశ్, టీడీపీ, 175 పతనం అన్‍స్టాపబుల్ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
Sat, 15 Oct 202208:03 AM IST
ఒక్క సీటు గెలవలేని స్థితిలో సిపిఐ
దేశంలో ఒక్కసీటు కూడా గెలవలేని స్థితికి సీపీఐ వచ్చిందని, సీపీఐ జాతీయ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించుకోవాలని, సీపీఐ పార్టీ మనుగడ కోసమే విజయవాడ జాతీయ సభలు నిర్వహిస్తోందని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. బీసీలకు సీపీఐ ఎందుకు పార్టీ పగ్గాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీ విధానాల వల్లే ఏపీలో ఈ పరిస్థితి తలెత్తిందని, రెండు పార్టీలు ఉత్తరాంధ్రకు ఏం చేశాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు.
Sat, 15 Oct 202205:02 AM IST
శ్రీశైలం నుంచి నీటి విడుదల
శ్రీశైలం జలాశయం పది గేట్లు 15 అడుగులు ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు. స్పిల్‍వే ద్వారా 3.77 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల, హంద్రీ నుంచి శ్రీశైలానికి 3.85 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.60 అడుగులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటినిల్వ 215.80 టీఎంసీలు అయితే ప్రస్తుత నీటినిల్వ 213.40 టీఎంసీలు ఉన్నాయి. - కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. - విద్యుదుత్పత్తి చేసి 65,643 క్యూసెక్కులు సాగర్‍కు విడుదల చేస్తున్నారు.
Sat, 15 Oct 202205:00 AM IST
వికేంద్రీకరణే లక్ష్యంగా విశాఖ గర్జన
వికేంద్రీకరణే లక్ష్యంగా విశాఖ గర్జన జరుగుతోంది. ఉదయం తొమ్మిది గంటలకు విశాఖ గర్జన ర్యాలీ ప్రారంభమైంది. విశాఖ పరిపాలన రాజధాని కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, జేఏసీ నేతలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ప్రజా సంఘాలు పాల్గొంటున్నారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి బీచ్‍రోడ్డులో వైఎస్‍ఆర్ విగ్రహం వరకు ర్యాలీ సాగనుంది. రాజకీయాలకతీతంగా భారీ ప్రదర్శన చేపట్టారు. ఉత్తరాంధ్ర వెనుకుబాటుతనాన్ని వివరిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. "పరిపాలన రాజధానిగా విశాఖ"కు భారీగా జనం తరలి వచ్చారు.
Sat, 15 Oct 202204:59 AM IST
34వ రోజు అమరావతి రైతుల పాదయాత్ర
అమరావతి రైతుల మహాపాదయాత్ర 34వ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. కొవ్వూరు నియోజకవర్గంలో రైతుల పాదయాత్ర సాగుతోంది. చాగల్లు మండలం యస్.ముప్పవరం నుంచి కొవ్వూరు వరకు పాదయాత్ర సాగనుంది.
Sat, 15 Oct 202204:20 AM IST
మెదక్‌లో భారీగా వరద
మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు ఏడు పాయల ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. అమ్మవారి గర్భగుడిలోకి వరద నీరు ప్రవేశించింది. అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా నది ప్రవహిస్తోంది. ఆలయాన్ని మూసేసి రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి అర్చకులు పూజలు చేస్తున్నారు.
Sat, 15 Oct 202204:20 AM IST
నిరసన ఓకే, ర్యాలీ అడ్డుకోవద్దన్న డీజీపీ
కావాలంటే నిరసన చేసుకోవచ్చు కానీ అమరావతి రైతుల పాదయాత్రను మాత్రం అడ్డుకోవద్దని నిరసనకారులకు చెబుతున్నామని ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న వారిని యాత్ర సాగుతున్న జిల్లా ఎస్పీ ముందుగానే పిలిపించి ఈ విషయాన్ని చెప్పారని పోలీస్ బాస్ తెలిపారు. నిరసనలు తెలుపుతున్న వారిని ముందుగానే పిలిపించి యాత్రను అడ్డుకోవద్దని చెబుతున్నామని, కావాలంటే నిరసన తెలుపుకోవచ్చని చెప్పామని, అందుకు వారు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారని అన్నారు.
Sat, 15 Oct 202204:20 AM IST
బీజేపీలో బూర నర్సయ్య గౌడ్
టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరనున్నారు. మునుగోడు అసెంబ్లీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ నర్సయ్య బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఢిల్లీలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Sat, 15 Oct 202204:20 AM IST
రాజధాని అడ్డుకుంటే చరిత్రహీనులవుతారన్న బొత్స
విశాఖను పరిపాలన రాజధానిగా అడ్డుకుంటే టీడీపీ నేతలు చరిత్ర హీనులవుతారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖను పరిపాలన రాజధానిగా అడ్డుకునే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇంకా వెనకబాటులో ఉండేందుకు ఇష్టంగా లేరని, ఉత్తరాంధ్రులంతా విశాఖను రాజధానిగా కోరుకుంటున్నారని చెప్పారు. విశాఖ గర్జన విజయవంతమవుతుందని మంత్రి బొత్స చెప్పారు.
Sat, 15 Oct 202204:20 AM IST
బ్రిడ్జి మూసివేతపై ఆగ్రహం
ప్రభుత్వంపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్ అయ్యారు. రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకే రాజమండ్రి బ్రిడ్జి మూసేశారని ఆరోపించారు. కలెక్టర్ ఆదేశాలు కచ్చితంగా హైకోర్టు ధిక్కరణేనని ఆరోపించారు. రాజమండ్రి చుట్టుపక్కల ఎక్కడా రోడ్లకు రిపేర్లు చేయడం లేదని, రాత్రికి రాత్రే బ్రిడ్జి మరమ్మతులు ప్రారంభిస్తారా అని ప్రశ్నించారు. వారం రోజుల్లో బ్రిడ్జి రిపేర్లు పూర్తయిపోతాయా అని పవన్ యాత్రకూ ఇలానే అనుమతివ్వలేదని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.