August 29 Telugu News Updates : సెప్టెంబర్ 3వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం
- వినాయక చవితి పందిళ్ల ఏర్పాటు వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ రగడకు కారణమవుతోంది. చవితి పందిళ్లను ఏర్పాటు చేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ సోమవారం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది. మరోవైపు రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజును అరెస్ట్ చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేయడంతో బీజేపీ ఘాటుగా స్పందించింది. చవితి పందిళ్ల ఏర్పాటుకు భారీగా రుసుములు వసూలు చేస్తున్నారని బీజేపీ మండిపడుతోంది.
Mon, 29 Aug 202205:09 PM IST
బీజేపీపై రేవంత్ రెడ్డి విమర్శలు
బీజేపీపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సీబీఐ, ఈడీలను ఉపయోగించుకుని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చే ప్రక్రియలను బీజేపీ చేపట్టిందని విమర్శించారు. సెప్టెంబర్ 4న దిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాహుల్‌గాంధీ చేపట్టే భారత్ జోడో యాత్రపై మాట్లాడారు. ప్రజలను అనేక విషయాల్లో బీజేపీ విభజిస్తోందని విమర్శించారు.
Mon, 29 Aug 202205:07 PM IST
బాలిక హత్య కేసులో జీవిత ఖైదు
బాలికను ప్రేమ పేరుతో వేధించి.. హత్య చేసిన ఓ యువకుడికి భువనగిరి కోర్టు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 2017 మైనర్ బాలికను హత్య చేశాడు నిందితుడు. న్యాయస్థానం అతడికి జీవిత ఖైదు విధించింది. దోషి రూ.10వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
Mon, 29 Aug 202204:23 PM IST
సెప్టెంబర్ 3వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం
సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు, నిర్వహణ, తదితర అంశాలపై క్యాబినెట్ చర్చించనుంది.
Mon, 29 Aug 202204:14 PM IST
సీఎం వైఎస్ జగన్ తో ఒబెరాయ్ గ్రూప్ ప్రెసిడెంట్ భేటీ
సీఎం వైఎస్ జగన్ తో ఒబెరాయ్ గ్రూప్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి రాజారామన్ శంకర్ సమావేశమయ్యారు. ఏపీలో ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ ప్రణాళికలు గురించి జగన్ కు వివరించారు. ఒబెరాయ్ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులన్నీ సింగిల్ విండో విధానంలో ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏపీలో సుమారు రూ. 1,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒబెరాయ్ గ్రూప్ వచ్చింది. అన్ని హోటల్స్ కూడా 7 స్టార్ సౌకర్యాలతో విల్లాల మోడల్‌లో రూపకల్పన జరగనుంది.
Mon, 29 Aug 202203:15 PM IST
31వ తేదీన బిహార్‌కు కేసీఆర్
ఈనెల 31న బిహార్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. గాల్వాన్ లోయల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు, సికింద్రాబాద్ టింబర్ డిపోలో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తారు. కేసీఆర్ ఆ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి పాట్నా బయలుదేరి వెళ్తారు. గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన బిహార్‌కు చెందిన ఐదుగురు సైనికుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేస్తారు. సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో మృతిచెందిన 12 మంది బిహార్ వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తారు. కేసీఆర్ కార్యక్రమంలో బిహార్ సీఎం నీతీశ్ కుమార్ కూడా పాల్గొంటారు.
Mon, 29 Aug 202202:11 PM IST
కానిస్టేబుల్ పరీక్షపై ఆ ఫేక్ వార్తలు నమ్మెుద్దు
తెలంగాణలో నిర్వహించిన కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లాయనే వార్తలపై పోలీసు బోర్డు స్పందించింది. అవన్నీ ఫేక్ వార్తలని చెప్పింది. ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది. అభ్యర్థులు వదంతులను నమ్మొద్దని పేర్కొంది. ప్రాథమిక పరీక్ష ‘కీ’ని తర్వలో విడుదల చేస్తామని నియామక బోర్డు తెలిపింది. త్వరలోనే www.tslprb.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది.
Mon, 29 Aug 202201:54 PM IST
సీఎం కేసీఆర్ సభలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సాగింది. అభివృద్ధి కార్యక్రమాల అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే సభలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు స్పందించి అడ్డుకున్నారు. బాధితుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Mon, 29 Aug 202201:17 PM IST
కేఏ పాల్ ప్రపంచ శాంతి సభలు
ప్రపంచ దేశాలతో పాటు రాష్ట్రంలో శాంతి నెలకొనాలనే ఉద్దేశంతో ఆక్టోబర్ 2న జింఖానా మైదానంలో ప్రపంచ శాంతి సభలను నిర్వహించనున్నట్టుగా కేఏ పాల్ వెల్లడించారు. ఈ సభలకు ప్రపంచ దేశాల్లోని ప్రధానులు, మంత్రులు హాజరవుతారని తెలిపారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు.
Mon, 29 Aug 202212:49 PM IST
షుగర్ కంపెనీలో ప్రమాదం.. ఇద్దరు మృతి
కాకినాడ వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీలో పేలుడు సంభవించింది. కార్మికులు పనులు చేస్తుండగా వాక్యామ్ గడ్డర్ పడి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మృతులను సుబ్రహ్మణ్యం, రాం ప్రసాద్‌గా గుర్తించారు. వారి మృతితో పరిశ్రమ వద్ద కార్మికులు ఆందోళన చేశారు. కంపెనీలో 10 రోజుల వ్యవధిలోనే రెండోసారి ప్రమాదం జరిగింది.
Mon, 29 Aug 202212:38 PM IST
దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంపై జగన్ సమీక్ష
సెప్టెంబరు 3న తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం జగన్ అధికారులకు చెప్పారు. అక్కడ చర్చించాల్సిన.. అంశాలపై సమీక్షించారు. ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలో రాష్ట్రం నుంచి ప్రతినిధి బృందం హాజరవుతుందని సీఎం జగన్ తెలిపారు.
Mon, 29 Aug 202212:02 PM IST
శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటి విడుదల
శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 3.19 లక్షల క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల అవుతుంది. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 2.92 లక్షల క్యూసెక్కులు వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి నీటినిల్వ 215.80 టీఎంసీలు. ప్రస్తుత నీటినిల్వ 215.32 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. 62,529 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల అవుతున్నాయి.
Mon, 29 Aug 202211:45 AM IST
జగన్ రెడ్డి ప్రభుత్వానికి రైతుబిడ్డల ఆత్మఘోష తప్పదు
జగన్ పాలనతో ఏపీ అభివృద్ధిలో పోటీ పడకపోయినా రైతు ఆత్మహత్యల్లో జాతీయ స్థాయిలో మూడో స్థానంలో ఉందని.. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి రైతుబిడ్డల ఆత్మఘోష తప్పదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రోజుకు అన్నదాతల ఆత్మహత్యలతో రైతు కుటుంబాలు దిక్కులేనివైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూడేళ్ల మూడు నెలల పాలనలో వ్యవసాయానికి కేటాయించిన నిధులు, ఖర్చుపెట్టిన మొత్తంపై అంశాల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
Mon, 29 Aug 202211:21 AM IST
పెద్దపల్లి కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన కేసీఆర్
సీఎం కేసీఆర్ పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. రూ.48 కోట్లతో నిర్మించిన సమీకృత కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు. పెద్దపల్లి శివారులోని పెద్దబొంకూరు వద్ద 21 ఎకరాల సువిశాల విస్తీర్ణ స్థలంలో నిర్మించిన కార్యాలయాల సముదాయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంథని రోడ్డులో నిర్మించనున్న టీఆర్ఎశ్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతారు.
Mon, 29 Aug 202211:21 AM IST
తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర
సెప్టెంబర్ 7 2022 నుండి రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రపై చర్చ జరిగింది. సోమవారం దిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్ సింగ్ సమక్షంలో యాత్ర జరిగే 12 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. తెలంగాణలో సైతం సుమారు 15 రోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, యాత్ర కో ఆర్డినేటర్ మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ హాజరయ్యారు. రాష్ట్రంలో యాత్ర మార్గం, ప్రణాళిక, ఇతర ఏర్పాట్ల పై కమిటీ సభ్యులకు వివరించారు.
Mon, 29 Aug 202210:40 AM IST
వేములవాడలో ఉద్రిక్తత
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నంది కమాన్ వద్ద మధ్య మానేరు నిర్వాసితులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని అడిగారు. వివిధ గ్రామాల నుంచి ముంపు బాధితులు వేములవాడకు వెళ్లేందుకు ప్రయత్నించారు. నంది కమాన్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Mon, 29 Aug 202209:10 AM IST
బాలికపై వార్డు మెంబర్ అత్యాచారం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో దారుణం జరిగింది. ఓ గ్రామానికి చెందిన వార్డు మెంబర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ నెల 28న జరిగిన కానిస్టేబుల్ రాత పరీక్ష రాసేందుకు బాధితురాలి తల్లి వెళ్లింది. బాలికతో సన్నిహితంగా ఉండే.. వార్డు మెంబర్ పట్టణంలోని ఓ అద్దె నివాసానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రి సిబ్బందికి తల్లి ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
Mon, 29 Aug 202208:42 AM IST
పెద్దపల్లికి బయలుదేరిన సీఎం కేసీఆర్
పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభానికి సీఎం కేసీఆర్ భయలుదేరారు. పెద్దపల్లిలో సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. పెద్దపల్లిలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.
Mon, 29 Aug 202207:48 AM IST
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ
శ్మశాన వాటికల్లో జగనన్న ఇళ్లు కేటాయించడంపై హైకోర్టు స్టే విధించింది. దళిత శ్మశాన వాటికల్లో ఇళ్లు కేటాయించిన ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. బోర్డు స్టాండింగ్స్ కు వ్యతిరేకంగా శ్మశాన వాటికల్లో ఇళ్లు కేటాయించడం దారుణమని పిటిషనర్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. శ్రావణ్ కుమార్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, జగనన్న ఇళ్లు సహా ఎలాంటి నిర్మాణాలు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది.
Mon, 29 Aug 202207:46 AM IST
నెల్లూరు హత్యలపై చంద్రబాబు అనుమానం
నెల్లూరులో దంపతుల హత్య వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. సునీత తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త అయినందున అధికారులు అన్ని కోణాల్లో హత్య కేసును విచారించాలని డిమాండ్ చేశారు. దంపతులు కృష్ణారావు, సునీత హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.
Mon, 29 Aug 202207:42 AM IST
శాంతిభద్రతలపై డీజీపీతో సీఎం జగన్ సమీ
శాంతిభద్రతలపై డీజీపీతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఉద్యోగసంఘాల చలో విజయవాడపై చర్చించారు. సెప్టంబర్ 1న చలో విజయవాడకు పిలుపు ఇవ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నిరసనలను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీకి సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు గణేశ్ మండపాలకు అనుమతులు, భద్రతపై చర్చించారు.
Mon, 29 Aug 202207:21 AM IST
వైసీపీలోకి గంజి చిరంజీవి
మంగళగిరి టీడీపీ నాయకుడు గంజి చిరంజీవి టీడీపీని వైసీపీ తీర్థం పుచ్చుకన్నారు. పార్టీలో ఇమడలేక వైసీపీలో చేరుతున్నట్లు గంజి ప్రకటించారు.
Mon, 29 Aug 202206:54 AM IST
ఏపీలో ఉద్యోగులపై ఆంక్షలు
సెప్టెంబర్ 1న ప్రభుత్వ ఉద్యోగులు ఛలో సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమం తలపెట్టిన నేపద్యంలో ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద ప్రత్యేక చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ఆత్కూరు పోలీసులు ముమ్మర తనీఖీలు నిర్వహిస్తున్నారు. ఏలూరు వైపు నుంచి విజయవాడ వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణంగా తనీఖీలు చేస్తున్నారు.
Mon, 29 Aug 202205:58 AM IST
శ్రీదేవితో విభేదాలు లేవు….
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో వివాదాలు లేవని ఎమ్మెల్సీ డొక్కా స్పష్టం చేశారు. తాడికొండలో అభిప్రాయ భేదాలు సర్దుకుంటాయని ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో తాను కూడా పనిచేస్తానని చెప్పారు. శ్రీదేవిని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని, శ్రీదేవికి ఎలాంటి అన్యాయం జరగదన్నారు. శ్రీదేవి రాజకీయ భవిష్యత్‍కు తాను హామీ ఇస్తున్నానని, తానే శ్రీదేవిని తీసుకుని సీఎం జగన్‍ను కలుస్తానన్నారు. తన రాజకీయ గురువు రాయపాటిని గౌరవిస్తానని, ప్రస్తుతం జగన్ తన బాస్ అని చెప్పారు.
Mon, 29 Aug 202205:46 AM IST
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు..
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది సర్కార్. జెన్ కో, ట్రాన్స్ కో తోపాటు అన్ని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కరువు భత్యాన్ని పెంచుతూ సీఎండీ ప్రభాకర్ రావు ఆదివారం రాత్రి ఉత్వర్వులు జారీ చేశారు. జూలై నెల నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఆగస్టులో అందుకునే జీతంలో కలిపి వస్తుందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 24.992శాతం డీఏను 3.646శాతానికి పెంచి 28.638శాతం చేస్తున్నట్లు ప్రభాకరరావు ప్రకటించారు. జూలై నుంచి అమల్లోకి రానున్నందున ఆ నెల జీతంతో కలిపి బకాయిలను ఆగస్టులో అందుకునే వేతనంతో చెల్లించనున్నారు.
Mon, 29 Aug 202205:25 AM IST
విద్యుత్ టారిఫ్‍లో ఎలాంటి మార్పులు లేవు
వినాయక చవితి విద్యుత్ టారిఫ్‍లో ఎలాంటి మార్పులు లేవని ఏపీ విద్యుత్ శాఖ ప్రకటించింది. ప్రజలు ఎటువంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేశార. వినాయక మండపాలకు తాత్కాలిక విద్యుత్ టారిఫ్ పెంచలేదని, 2014 నుంచి అమల్లో ఉన్న టారిఫ్ ప్రకారమే.. వినాయక మండపాలకు విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రకటించారు. నిబంధనల మేరకు పది రోజుల పాటు విద్యుత్ వినియోగించుకోవచ్చని అధికారులు ప్రకటించారు.
Mon, 29 Aug 202205:24 AM IST
కోవిడ్ కేసులు తగ్గుముఖం…
కరోనా రోజువారీ కేసులు దేశంలో క్రమంగా తగ్గుతున్నాయి. దేశంలో కొత్తగా 7,591 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి 9,206 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 84,931 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 2.11 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
Mon, 29 Aug 202204:03 AM IST
తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేట్
తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేట్ పెరిగినట్లు NCRB 2021 నివేదికలో వెల్లడైంది. మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక నేరాలు పెరిగాయి. మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాల్లో తెలంగాణకు మొదటి స్థానం లభించింది. రైతుల ఆత్మహత్యల్లో 4వ స్థానంలో తెలంగాణ ఉంది. ఆర్థిక నేరాల్లో రెండో స్థానం, వృద్ధులపై దాడుల్లో 3వ స్థానం, మహిళలపై నేరాలకు సంబంధించి కోర్టుల్లో వీగిపోతున్న కేసుల్లో తెలంగాణకు మొదటి స్థానం లభించింది. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా దళిత మహిళలకు అవమానాలు జరుగుతున్నాయి. తెలంగాణలో 200 శాతం పెరిగిన సైబర్ నేరాలు పెరిగాయి.
Mon, 29 Aug 202204:01 AM IST
పోలీస్ స్టేషన్‌లో పాడుపని….
అనకాపల్లి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్‍లో ఏఎస్‍ఐ అప్పారావు రాసలీలలు స్థానికంగా కలకలం రేపాయి. ఆదివారం రాత్రి పోలీస్ స్టేషన్‍కు ఓ మహిళను ఏఎస్సై తీసుకొచ్చినట్లు గుర్తించిన స్థానికులు సీఐ, ఎస్‍ఐకి సమాచారం ఇచ్చారు. సీఐ, ఎస్‍ఐ స్టేషన్‌కు రావడంతో మహిళతో అడ్డంగా దొరికి పోయాడు. ఏఎస్‍ఐ మద్యం మత్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదే సమయంలో స్టేషన్ నుంచి మహిళ జారుకుందని ప్రచారం జరుగుతోంది.
Mon, 29 Aug 202203:32 AM IST
గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసులు
గన్నవరం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు మొదలు కానున్నాయి. అక్టోబర్ 31 నుంచి షార్జా-విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వారానికి రెండు ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమాన సర్వీసులు మొదలవుతాయి.
Mon, 29 Aug 202203:32 AM IST
అంబులెన్స్‌లో 100కేజీల గంజాయి
విశాఖ షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి వద్ద అంబులెన్స్‌లో గంజాయిని పోలీసులు గుర్తించారు. అంబులెన్స్ సర్వీసులో 100 కేజీల గంజాయి పోలీసులు పట్టుకున్నారు. ఆస్పత్రి ఎదుట పార్కు చేసిన అంబులెన్స్ లో గంజాయిని గుర్తించారు.
Mon, 29 Aug 202203:32 AM IST
అజాద్ వెళ్లిపోవడం దురదృష్టకరం
తిరుమల శ్రీవారిని కేంద్ర మాజీమంత్రి పల్లంరాజు దర్శించుకున్నారు. కాంగ్రెస్ బలోపేతానికి రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారని, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్ర చేస్తారని ప్రకటించారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల్లో ఐక్యత రాహుల్ తీసుకొస్తారన్నారు. అజాద్ వంటి నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోవడం దురదృష్టకరమని పల్లంరాజు అన్నారు.
Mon, 29 Aug 202203:32 AM IST
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.96 కోట్లుగా ఉంది. ఆదివారం శ్రీవారిని 74,297 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,317 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
Mon, 29 Aug 202203:32 AM IST
మంత్రి పెద్దిరెడ్డికి తప్పిన ప్రమాదం
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ లోని ఓ వాహనం టైరు పేలడంతో డివైడర్ ను ఢీకొని మరో రోడ్డువైపు దూసుకొచ్చింది. మంత్రి పెద్దిరెడ్డి మరో కారులో ఉండటంతో ప్రమాదం తప్పింది. చంద్రగిరి మండలం నడింపల్లి రహదారిపై ఘటన జరిగింది.
Mon, 29 Aug 202203:31 AM IST
ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ పై వేటు
సేవ్ ఏపీ పోలీస్ అంటూ అమరవీరుల స్మారక స్థూపం దగ్గర నిరసనకు దిగిన కానిస్టేబుల్ ప్రకాష్ ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ ప్రకాష్‍ను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఆదేశాలను ఎస్పీ ఫక్కీరప్ప జారీ చేశారు. జూన్ 14 న సీఎం జగన్ సత్యసాయి జిల్లా పర్యటన సందర్భంగా కానిస్టేబుల్ ప్రకాష్ నిరసన తెలిపారు. గతంలో ఓ మహిళను మోసం చేసి రూ.10 లక్షలు, 30 తులాల బంగారం తీసుకున్నట్లు గార్లదిన్నెలో పలు సెక్షన్ల కింద కేసు నమోదైన నేపథ్యంలో విచారణ అధికారి నివేదిక మేరకు చర్యలు తీసుకున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.