Konaseema School Boy: కోనసీమలో విషాదం.. క్లాస్‌రూమ్‌లో తేలుకుట్టి బాలుడి మృతి-a boy died after being stung by a scorpion in the classroom in kapileswarapuram of konaseema district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Konaseema School Boy: కోనసీమలో విషాదం.. క్లాస్‌రూమ్‌లో తేలుకుట్టి బాలుడి మృతి

Konaseema School Boy: కోనసీమలో విషాదం.. క్లాస్‌రూమ్‌లో తేలుకుట్టి బాలుడి మృతి

HT Telugu Desk HT Telugu
Aug 25, 2023 11:02 AM IST

Konaseema School Boy: ఉపాధి కోసం తల్లిదండ్రులు వేర్వేరు ప్రాంతాల్లో ఉండటంతో తాత దగ్గర ఉంటూ చదువుకుంటున్న బాలుడు విషాదకరమైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు. తరగతి గదిలో చిత్తు కాగితాలు ఏరుతుండగా తేలు కుట్టి మరణించాడు.

తరగతి గదిలో తేలు కుట్టి ప్రాణాలు కోల్పోయిన బాలుడు అభిలాష్
తరగతి గదిలో తేలు కుట్టి ప్రాణాలు కోల్పోయిన బాలుడు అభిలాష్

Konaseema School Boy: ఉపాధి కోసం తల్లిదండ్రులు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న తాత దగ్గర ఉంటూ బాలుడు చదువుకుంటున్నాడు. విధి వెక్కిరించడంతో విషాదకరమైన పరిస్థితుల్లో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. తరగతి గదిని శుభ్రం చేయాలని ఉపాధ్యాయులు పురమాయించడంతో వాటిని ఏరుతుండగా తేలు కాటుకు గురయ్యాడు.

చిత్తు కాగితాలు ఏరుతుండగా తరగతి గదిలో తేలు కుట్టి విద్యార్థి మృతిచెందిన ఘటన డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో గురువారం జరిగింది. కపిలేశ్వర పురం మండలం కోరుమిల్లికి చెందిన వై.ప్రసాద్‌, శ్రీదేవిల చిన్నకుమారుడైన అభిలాష్‌ వాకతిప్ప గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. స్కూల్లో పంపిణీ చేసిన చిక్కీల రేపర్లు తరగతి గదిలోనే విద్యార్దులు పడేశారు.

గురువారం తరగతి గదిలో చిక్కీల రేపర్లు ఎక్కువగా ఉండటంతో వాటిని శుభ్రం చేయాల్సిందిగా ఉపాద్యాయులు పురమాయించారు. మరో విద్యార్థితో కలిసి వాటిని ఏరుతుండగా అభిలాష్‌ ఎడమ చేతిపై తేలు కుట్టింది. బాలుడిని తేలు కుట్టడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స చేయించారు.

తేలు కాటుకు అవసరమైన విరుగుడు మందులు అందుబాటులో లేకపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికి్త్స అందించినా ఫలితం లేకపోయింది. కాకినాడ ఆస్పత్రికి తీసుకు వచ్చేసరికి ఊపిరితిత్తుల్లోకి విషం చేరడంతో, రక్తపు వాంతులు అయ్యి బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు అంగర ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి వలస కూలీగా వరంగల్‌లో పనిచేస్తున్నాడు. తల్లి ఉపాధి కోసం కువైట్‌లో ఉంటోంది. బాలుడు తాతయ్య వద్ద ఉంటూ చదువుకుంటుండగా ఇలా జరగడంతో స్థానికంగా విషాదం నెలకొంది. మరోవైపు తరగతి గది శుభ్రం చేయించేందుకు పురామయించడంపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Whats_app_banner