Cheating : వయసు 54 … మేకప్‌తో 30ఏళ్లంటూ పెళ్లి… ఆపై వేధింపులు..-54years lady cheats grom claiming false age in chittore ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cheating : వయసు 54 … మేకప్‌తో 30ఏళ్లంటూ పెళ్లి… ఆపై వేధింపులు..

Cheating : వయసు 54 … మేకప్‌తో 30ఏళ్లంటూ పెళ్లి… ఆపై వేధింపులు..

HT Telugu Desk HT Telugu
Jul 05, 2022 11:23 AM IST

చిత్తూరు జిల్లాలో కిలాడీ లేడీ భాగోతం అందర్నీ నివ్వెరపోయేలా చేసింది. 54ఏళ్ల మహిళ తన వయసు 30ఏళ్లేనని చెప్పుకుని 35ఏళ్ల యువకుడిని పెళ్లాడింది. పెళ్లి తర్వాత అత్త, భర్తలకు చుక్కలు చూపింది. ఆస్తి కోసం వేధించడంతో బాధితులు ఆరా తీయడంతో ఆమె భాగోతం బయటపడింది.

<p>మేకప్‌తో మాయ…. యువకుడిని పెళ్లాడిని 54ఏళ్ల మహిళ</p>
మేకప్‌తో మాయ…. యువకుడిని పెళ్లాడిని 54ఏళ్ల మహిళ (HT_PRINT)

ఆమె వయసు 54ఏళ్లు…. మూడు దశాబ్దాల క్రితమే పెళ్లైంది. ఇద్దరు కూతుళ్లు … .వారికి పెళ్లిళ్లు జరిగాయి. చాలా కాలం భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న ఆమె పెళ్లి కాలేదంటూ మోసాలను ప్రారంభించింది. మేకప్‌తో మాయ చేస్తూ పెళ్లి వల వేస్తున్న కిలాడీ లేడీని పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి పంపారు.

లేటు వయసులో లేటెస్ట్ మోసాలకు పాల్పడుతున్న కిలేడీని చెన్నై అవడి పోలీసులు చిత్తూరు జిల్లాలో అరెస్ట్‌ చేశారు. పుత్తూరుకు చెందిన శరణ్య అలియాస్ సుకన్యకు 30ఏళ్ల క్రితమే పెళ్లైంది. భర్త రవితో విభేదాలు రావడంతో తల్లితో కలిసి జీవిస్తోంది. శరణ్య, రవిలకు పుట్టిన ఇద్దరు పిల్లలకు కూడా పెళ్లిళ్లైపోయాయి. ఆర్ధిక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో మేకప్‌తో మోసాలు మొదలుపెట్టింది. మ్యాట్రిమోని వెబ్‌సైట్లు, పెళ్లిళ్ల బ్రోకర్ల డబ్బున్న వారికి వలవేయడం మొదలుపెట్టింది.

మేకప్‌తో లేని అందాన్ని కొని తెచ్చుకున్న శరణ్య యువకులకు వలపన్నేది. కోవిడ్ లాక్‌డౌన్‌ సమయంలో రెండోొ భర్త సుబ్రహ్మణ్యంను వదిలేసి వచ్చిన శరణ్య పుత్తూరులో తల్లితో కలిసి ఉంటోంది. ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో మళ్లీ పెళ్లికి రెడీ అయ్యింది. ఈ క్రమంలో తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన ఇందిరా రాణి అనే మహిళ తన కుమారుడికి పెళ్లి చేయడానికి బ్రోకర్లను ఆశ్రయించింది. 35ఏళ్ల యువకుడికి గతంలో వివాహమై విడాకులు తీసుకున్నాడు. రెండో పెళ్లి ప్రయత్నాల్లో ఉండగా శరణ్య మేకప్ స్టిల్స్‌ వారికి తెగ నచ్చేశాయి. ముందు వెనుక ఆలోచించకుండా ఎదురు కట్నం ఇచ్చి మరి పెళ్లికి రెడీ అయ్యారు.

పెళ్లికి ముందు పెళ్లి చూపుల కోసం శరణ్యను చూడటానికి వచ్చిన క్రమంలో 30ఏళ్ల యువతిలా మేకప్‌ వేసుకుని వారికి దర్శనమిచ్చింది. దీంతో బుట్టలో పడిపోయిన ఇందిరా రాణి, ఆమె కుమారుడు వెంటనే పెళ్లికి రెడీ అయ్యారు. 54ఏళ్ళ వయసులో తన వయసు 30ఏళ్లని చెప్పుకుని, 35ఏళ్ల యువకుడిని పెళ్లి చేసేసుకుంది.

ఇందిరా రాణికి 2021లో పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా శరణ్య పరిచయమైంది. శరణ్య అందానికి పడిపోయిన ఆమె ఎలాంటి విచారణ లేకుండానే పెళ్లి చేసేసింది. పెళ్లైన కొద్ది రోజులకే శరణ్య అలియాస్ సుకన్య బండారం బయట పడింది. శరణ్య అలియాస్ సుకన్య భర్త, అత్తలకు చుక్కలు చూపడం మొదలు పెట్టింది.ఇంట్లో బీరువా తాళాలు ఇవ్వాలని, ఆస్తి తన పేరును రాయాలని వారిపై వేధింపులు ప్రారంభించింది. ఆమె టార్చర్‌ భరించలేక అత్త ఇంటిని నుంచి బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆస్తి ఆమె పేరున బదలాయించడానికి ఆధార్ కార్డు కావాలని భర్త కోరడంతో ఆమె బండారం బయట పడింది. ఆధార్ కార్డులో మొదటి భర్త పేరు ఉండటంతో చెన్నై అవడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

శరణ్య అలియాస్ సుకన్య నిర్వాకంపై మహిళా పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తీగ లాగితే ఆమె గుట్టు మొత్తం బయట పడింది. పుత్తూరుకు చెందిన శరణ్య ఇలా ఇప్పటికే పలువురిని మోసం చేసింది. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి సంధ్యగా పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంది. అతనితో పదేళ్లు కాపురం చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో చెప్పాపెట్టకుండా తల్లితో కలిసి మాయమైపోయింది.

ఆ తర్వాత పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా ఇంద్రాణి విషయం తెలిసి ఆమెతో సంబంధం కలుపుకుంది.మొదటి భర్త రవిపై కూడా గతంలో వేధింపులు కేసు పెట్టి దాదాపు 11లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అవడి పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి కూపీ లాగడంతో శరణ్య బంగారం బయటపడింది. కేసు దర్యాప్తులో భాగంగా చిత్తూరు జిల్లా వచ్చిన తమిళనాడు పోలీసులు, స్థానిక పోలీసుల సహకారంతో ఆమెను అదుపులోకి తీసుకుని చెన్నై తరలించారు. మేకప్‌తో ముసలితనాన్ని కప్పిపెట్టి 30ఏళ్ల యువతిగా పెళ్లి చేసుకున్న శరణ్య అలియాస్ సుకన్య అలియాస్ సంధ్య నిర్వాకం తెలిసి పోలీసులే ఖంగుతిన్నారు.

Whats_app_banner