తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ap Ts Weather Updates: మండుతున్న ఎండలు..మధ్యలో వానలు,పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

AP TS Weather Updates: మండుతున్న ఎండలు..మధ్యలో వానలు,పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

HT Telugu Desk HT Telugu

12 May 2023, 7:07 IST

    • AP TS Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రత్తలు ఠారెత్తిస్తున్నాయి. గత వారం వర్షాలతో  జనం కాస్త ఉపశమనం పొందినా క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం అల్లాడి పోతున్నారు. 
ఏపీలో మండుతున్న ఎండలు
ఏపీలో మండుతున్న ఎండలు (APSDMA)

ఏపీలో మండుతున్న ఎండలు

AP TS Weather Updates: ఉక్కపోత, ఎండ వేడితో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. గత వారం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అకాల వర్షాలతో తీవ్రంగా పంట నష్టం జరిగింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుఫాను ప్రభావం ఏపీ, తెలంగాణలపై పెద్దగా ఉండదని వాతావరణ శాఖ తేల్చేసింది. తుఫాను ప్రభావం బంగ్లాదేశం, మయన్మార్ వైపు వెళుతోందని ప్రకటించింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Dogs Killed Goats: కుక్కల దాడిలో మేకల మృతి, మేక కళేబరాలతో మునిసిపల్ కార్యాలయంలో ఆందోళన

Kamareddy DMHO: కామారెడ్డిలో కామపిశాచి, వైద్యులపై వేధింపుల కేసుతో జిల్లా వైద్యాధికారి అరెస్ట్

BRS Protest: బోనస్ బోగసేనా?... రోడ్డెక్కిన బీఆర్ఎస్.. ప్రభుత్వ తీరుపై ధర్నాలు, రాస్తారోకోలతో BRS నిరసన

Hyderabadi In UK Polls: యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో సిద్ధిపేట ఐటీ ఇంజనీర్‌, లేబర్ పార్టీ తరపున పోటీ

తెలంగాణలో ఉష్ణోగ్రతలు నాలుగైదు రోజులుగా క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసినా, చాలా చోట్ల ఎండ అదరగొట్టేసింది. మరో నాలుగు రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సగానికిపైగా జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ను జారీ చేసింది.

ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జయశంకర్​భూపాలపల్లి, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్​కర్నూల్, మహబూబ్​నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ను జారీ చేసింది. ఈ జిల్లాల్లో టెంపరేచర్లు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

గురువారం వికారాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, ములుగు, నాగర్​కర్నూల్, గద్వాల, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిశాయి. రాజేంద్రనగర్, కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో అత్యధికంగా 1.9 సెంటీ మీటర్ల వర్షం పడింది.

కరీంనగర్​ జిల్లా వీణవంక, జగిత్యాల జిల్లా జైనలో అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జయశంకర్​భూపాలపల్లి జిల్లా తాడిచర్లలో 44.1, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 43.8, ఆదిలాబాద్​ జిల్లా చాప్రాలలో 43.3, నిర్మల్​ జిల్లా బుట్టాపూర్​లో 42.8, కవ్వాల్​ టైగర్​ రిజర్వ్​లో 42.8 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి.

ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు…

రాబోయే మూడు రోజుల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరుగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం అత్యధికంగా అనంతపురం జిల్లా శెట్టూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 60 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన 'మోచా తుపాను ఆగ్నేయ బంగ్లాదేశ్‌, ఉత్తర మయన్మార్‌ మధ్యలో కాక్స్‌ బజార్‌ వద్ద మే 14న తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రసుత్తం తుపాను పోర్టుబ్లెయిర్‌కు నైరుతి దిశలో 510 కి.మీ. దూరంలో, కాక్స్‌బజార్‌ కు దక్షిణ నైరుతి దిశలో 1,190 కి.మీ. దూరంలో, మయన్మార్‌లోని సీత్త్వే కు దక్షిణ నైరుతి దిశలో 1,100 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు.

మోచా ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ గురువారం రాత్రికి తీవ్ర తుపానుగా మారుతుంది. శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో అత్యంత తీవ్ర తుపానుగా బలపడుతుందన్నారు. తీరం దాటే సమయంలో గరిష్ఠంగా 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందన్నారు.

తుఫాను ముప్పు తప్పడంతో ఏపీలో వేసవి ఉష్ణోగ్రతలు కూడా గరిష్టంగా నమోదు కానున్నాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండ, నర్సీపట్నం, నాతవరం, కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

శుక్రవారం రాష్ట్రంలో 60 మండలాల్లో వడగాల్పులు, శనివారం 32 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

శుక్రవారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల్లో అల్లూరి జిల్లా 1,అనకాపల్లి 15, గుంటూరు 8, కాకినాడ 14, కోనసీమ 3, కృష్ణా 1, ఎన్టీఆర్ 3, పల్నాడు 1, మన్యం 1, విశాఖ 3, విజయనగరం 8, వైస్సార్ జిల్లాలో 2 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం