తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tammineni Veerabhadram : రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాల మధ్య బీజేపీ తగవులు పెడుతుంది- తమ్మినేని వీరభద్రం

Tammineni Veerabhadram : రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాల మధ్య బీజేపీ తగవులు పెడుతుంది- తమ్మినేని వీరభద్రం

HT Telugu Desk HT Telugu

07 February 2024, 19:19 IST

    • Tammineni Veerabhadram : ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాల సమస్య ద్వారా కేంద్రం లబ్ది పొందాలని చూస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు.
తమ్మినేని వీరభద్రం
తమ్మినేని వీరభద్రం

తమ్మినేని వీరభద్రం

Tammineni Veerabhadram : నదీ జలాల సమస్యపై శాస్త్రీయ పరిష్కారం అవసరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆంధ్ర, తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాల సమస్య ద్వారా కేంద్రం లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. కృష్ణా రిజర్వాయర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి కృష్ణా నదిపై ప్రాజెక్టులను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సరికాదని పేర్కొన్నారు. ఆర్నెళ్లలో ప్రభుత్వం కూలుతుందని బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలను తమ్మినేని ఖండించారు. అస్వస్థత నుంచి కోలుకున్న తర్వాత తొలిసారిగా ఖమ్మం వచ్చిన వీరభద్రానికి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య భవనం వద్ద ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ప్రజలు విడిపోకూడదని సీపీఐ(ఎం) సిద్ధాంతం అన్నారు. కేంద్రం లిటికేషన్స్ సృష్టించి లబ్ది పొందాలని చూస్తుందన్నారు. ఉమ్మడి ఏపీ విడిపోయినప్పుడు కేంద్రం అనేక హామీలు ఇచ్చిందన్నారు. కానీ ఆ హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకపోగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని తరలించే ప్రయత్నం చేస్తోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల మధ్య తగవులు పెడుతోందని ఆరోపించారు. దేశం మొత్తానికి ఒకే ఎన్నిక ఉండాలని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్రం కమిటీ ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో భాగమే తప్ప మరొకటి కాదన్నారు.

ట్రెండింగ్ వార్తలు

CM Revanth Reddy : తెలంగాణలో భూముల మార్కెట్ విలువ సవరణ…! కీలక ఆదేశాలు జారీ

TS LAWCET 2024 Updates : టీఎస్ లాసెట్ కు భారీగా దరఖాస్తులు - ఈ సారి 3 సెష‌న్ల‌లో ఎగ్జామ్, ఫైన్ తో అప్లికేషన్లకు ఛాన్స్

TSRTC Jeevan Reddy Mall : అద్దె ఒప్పందం రద్దు , జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం - టీఎస్ఆర్టీసీ ప్రకటన

Telangana Rains : కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం - పిడుగుపాటుతో ఇద్దరు మృతి

ప్రతిపక్షాలను అణచివేసే ధోరణి

కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను అణచి వేసే ధోరణి అవలంబిస్తోందని తమ్మినేని వీరభద్రం అన్నారు. కేరళలో కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా గురువారం జరిగే ఆందోళనకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ మద్దతు ఇచ్చిందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక మతతత్వ, అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ ఈనెల 16న నిర్వహించే గ్రామీణ బంద్ ను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. పెరుగుతున్న ధరలు, కార్మికవర్గం అసంతృప్తి, మైనార్టీలను లేకుండా చేసే ధోరణిపై బీజేపీ దృష్టి సారించిందన్నారు. రామాలయం నిర్మాణంతో లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. ఇప్పటికీ 9 సార్లు కూటమిలు మార్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వైఖరిని దేశ ప్రజలు అసహించుకుంటున్నారని తెలిపారు. జాతీయంగా ఇండియా కూటమి మధ్య వైరుధ్యాలు తగ్గించి రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని తిప్పికొడతామని ధీమా వ్యక్తం చేశారు.

అహంకార ధోరణితోనే బీఆర్ఎస్ ఓటమి

బీఆర్ఎస్ అప్రజాస్వామిక, అహంకార ధోరణిని సీపీఐ (ఎం) నిరసించిందన్నారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తమ పార్టీ స్వాగతించిందన్నారు. అప్రజాస్వామిక విధానాలకు ప్రజలు ఎలా గుణపాఠం చెబుతారో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. కేసీఆర్ ఓటమి తప్ప కాంగ్రెస్ విజయం కాదన్నారు. ఆరు నెలల్లో ప్రభుత్వం కూలుతుందనే బీఆర్ఎస్ శాపనార్థాలు సరికాదని తమ్మినేని అన్నారు. ధరణి భూ సమస్యలు, రైతులు, వ్యవసాయ కూలీలు, అసంఘటిత రంగాల కార్మికుల సమస్యలు, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు తదితర సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తమ్మినేని కోరారు.

పాలేరు పాతకాలువకు నీరివ్వాల్సిందే...

పాలేరు పాతకాలువ ఆయకట్టు పరిధిలో 14,500 ఎకరాలుండగా దానిలో 7వేల ఎకరాల్లో యాసంగి వరి, చెరకు తదితర పంటలు సాగయ్యాయని వీటికి నీరు ఇచ్చేలా ముగ్గురు మంత్రులు బాధ్యత తీసుకోవాలని తమ్మినేని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సాగు, తాగునీటి ఎద్దడి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తాను ఆరోగ్యం ఎంత సీరియస్ కండీషన్ కు వెళ్లిందో అంత త్వరగా కోలుకున్నానని, ప్రస్తుతం తన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. అంతకు ముందు తమ్మినేనికి సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.

రిపోర్టింగ్ : కాపర్తి నరేంద్ర, ఖమ్మం

తదుపరి వ్యాసం