Tammineni Veerabadram : పుణ్యకాలం పూర్తైన తర్వాత కాంగ్రెస్ నేతలు ఫోన్లు చేస్తున్నారు- తమ్మినేని వీరభద్రం
Tammineni Veerabadram : బీజేపీని ఓడించే శక్తులకు తమ మద్దతు ఉంటుందని తమ్మినేని వీరభద్రం తెలిపారు. పుణ్యకాలం పూర్తైన తర్వాత కాంగ్రెస్ నేతలు ఫోన్లు చేస్తు్న్నారన్నారు.
Tammineni Veerabadram : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ఓడించే శక్తులకు తమ పార్టీ మద్దతిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. బీజేపీకి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకపోయినప్పటికీ కొన్ని స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచే ప్రమాదం ఉన్నందున అలాంటి మతతత్వ శక్తులను ఓడించడానికి ఆయా స్థానాల్లో సరైన ప్రజాస్వామ్య శక్తులకు తమ మద్దతు ఉంటుందని వివరించారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు కుదరని పక్షంలోనే తాము తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపామన్నారు. అయితే కాంగ్రెస్ కు విధించిన గడువు ముగిసిన తర్వాతే మీడియా ఎదుట ఇచ్చిన వాగ్దానం మేరకు తాము అభ్యర్థులను ప్రకటించామని తెలిపారు. అయితే పుణ్యకాలం పూర్తయిన తర్వాత కాంగ్రెస్ నేతలు తిరిగి ఫోన్లు చేసి అభ్యర్థుల ప్రకటన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారని తెలిపారు. ఇప్పుడు పునరాలోచన సరైన విధానం కాదని తాము వారికి తెలియజెప్పినట్లు పేర్కొన్నారు.
సీపీఐతో మిత్ర ధర్మం కొనసాగిస్తాం
సీపీఐతో తాము గతంలో అనుకున్న విధంగా మిత్ర ధర్మాన్ని పాటిస్తామని తమ్మినేని స్వష్టం చేశారు. కలిసి పోటీ చేయాలని తొలుత నిర్ణయించుకున్నప్పటికీ పోటీ చేసే స్థానాల సర్దుబాటు విషయంలో వైరుధ్యం రావడంతో కలిసి పోటీ చేసే అంశం తెరవెనక్కి వెళ్లిందని చెప్పారు. అయితే సీపీఐ పోటీ చేసే స్థానంలో తాము మిత్ర ధర్మాన్ని పాటిస్తామని స్పష్టం చేశారు. ఆ పార్టీ పోటీలో నిలిచే కొత్తగూడెంలో తాము సీపీఐకి మద్దతుగా నిలుస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై మాట్లాడే నాయకులు అసెంబ్లీలో ఉండడం అనివార్యమని, అందుకే కమ్యూనిస్టుల గెలుపు కోసం తాను ప్రజలకు అభ్యర్థిస్తున్నానని తెలిపారు. సీపీఐతో మిత్ర ధర్మాన్ని పాటించడంతో పాటు మిగిలిన స్థానాల్లో ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే సామాజిక శక్తులకు తమ మద్దతు ఉంటుందని తమ్మినేని ప్రకటించారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం