తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr ‌In Hospital: కాలు జారి పడిన కేసీఆర్, యశోదాలో సాయంత్రం తుంటి మార్పిడి సర్జరీ

KCR ‌In Hospital: కాలు జారి పడిన కేసీఆర్, యశోదాలో సాయంత్రం తుంటి మార్పిడి సర్జరీ

Sarath chandra.B HT Telugu

08 December 2023, 8:05 IST

    • KCR ‌In Hospital: తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ ఆస్పత్రి పాలయ్యారు. గురువారం రాత్రి కాలు జారి పడటంతో  కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కేసీఆర్ కాలి తుంటి ఎముక విరిగినట్టు వైద్యులు గుర్తించారు.  నేటి సాయంత్రం శస్త్ర చికిత్స నిర్వహించనున్నారు. 
ఆస్పత్రిలో కేసీఆర్
ఆస్పత్రిలో కేసీఆర్

ఆస్పత్రిలో కేసీఆర్

KCR ‌In Hospital: బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రమాదానికి గురయ్యారు. ఇంట్లో కాలు జారి పడటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక పరీక్షల్లో కేసీఆర్‌కు తుంటి ఎముక విరిగినట్టు గుర్తించారు. కేసీఆర్‌కు శస్త్ర చికిత్స చేయాల్సి రావొచ్చని భావిస్తున్నారు. కేసీఆర్‌ ఎడమ తుంటి మార్పిడికి శస్త్ర చికిత్స నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు.

ట్రెండింగ్ వార్తలు

Kamareddy DMHO: కామారెడ్డిలో కామపిశాచి, వైద్యులపై వేధింపుల కేసుతో జిల్లా వైద్యాధికారి అరెస్ట్

BRS Protest: బోనస్ బోగసేనా?... రోడ్డెక్కిన బీఆర్ఎస్.. ప్రభుత్వ తీరుపై ధర్నాలు, రాస్తారోకోలతో BRS నిరసన

Hyderabadi In UK Polls: యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో సిద్ధిపేట ఐటీ ఇంజనీర్‌, లేబర్ పార్టీ తరపున పోటీ

Graduate Mlc Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై బీజేపీ గురి, కీలక నేతలకు ఇన్‌ఛార్జి బాధ్యతలు

ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం నుంచి కేసీఆర్‌ ఎర్రవెల్లిలోని ఫాం హౌస్‌లో ఉంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రగతి భవన్‌ విడిచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఫాం హౌస్‌లోనే ఉంటున్నారు. బిఆర్‌ఎస్‌ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఫాంహౌస్‌లోనే భేటీ అయ్యారు. గురువారం స్వగ్రామం చింతమడకకు చెందిన ప్రజలతో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు. రాత్రి పొద్దు పోయిన తర్వాత కేసీఆర్ కాలు జారి పడిపోయినట్టు తెలుస్తోంది. ఆ వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు.

కేసీఆర్ అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు, బిఆర్‌ఎస్ ముఖ్య నాయకులు హుటాహుటిన యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. కుమారుడు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర నాయకులు యశోదా ఆస్పత్రికి చేరుకున్నారు. కేసీఆర్ ఆస్పత్రిలో చేరడంతో యశోదా ఆస్పత్రి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. శుక్రవారం సాయంత్రం కేసీఆర్‌కు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించనున్నారు. కేసీఆర్‌తో పాటు కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్, పలువురు ముఖ్య నాయకులు యశోదా ఆస్పత్రిలో ఉన్నారు.

కేసీఆర్‌ ఆరోగ్యంపై రేవంత్ ఆరా..

బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ప్రమాదానికి గురి కావడంపై సిఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శాఖ కార్యదర్శిని యశోదా ఆస్పత్రికి పంపిన సిఎం రేవంత్ రెడ్డి, వారి ద్వారా వివరాలు తెలుసుకున్నారు.

కేసిఆర్‌కు అందుతున్న వైద్యం పై ఎప్పటికప్పుడు తనకు అప్డేట్స్‌ తెలియచేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి సూచించారు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు యశోద హాస్పిటల్ కు వెళ్లిన ఆరోగ్యశాఖ కార్యదర్శి, యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ సెక్రటరీకి యశోదా వైద్యులు వివరించారు. గురువారం రాత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన వెంటనే వెంటనే ప్రభుత్వం స్పందించి, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో ఆసుపత్రికి తరలించారు.

కోలుకోడానికి 6-8 వారాల సమయం

మరోవైపు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోదా ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కేసీఆర్‌ ఎడమ తుంటికి ఫ్రాక్చర్ కావడంతో శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని వెల్లడించారు. బాత్‌రూమ్‌లో జారిపడటంతో గాయపడ్డారని తెలిపారు. తుంటి మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత కేసీఆర్‌ కోలుకోడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని వివరించారు. కేసీఆర్ ను ప్రస్తుతం ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, అనస్తీషియా, పెయిన్ మెడిసిన్ పర్యవేక్షణలో ఉంచినట్టు యశోదా ఆస్పత్రి ప్రకటించింది.

ఆస్పత్రికి ఎవరు రావొద్దు…

కేసీఆర్‌కు శుక్రవారం సాయంత్రం తుంటి మార్పిడి చికిత్స జరుగుతుందని చెప్పారు. చికిత్స తర్వాత బులెటిన్ విడుదల చేస్తారన్నారు. శస్త్ర చికిత్స తర్వాత ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉన్నందున ఎవరు ఆస్పత్రికి రావొద్దని బిఆర్‌ఎస్ నేత హరీష్ రావు చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు. అభిమానులు ఆందోళన చెందొద్దని, పరామర్శకు ఆస్పత్రికి రావొద్దని విజ్ఞపి చేశారు.

ప్రధాని ట్వీట్…

కేసీఆర్ కాలికి గాయం కావడంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. కేసీఆర్ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ఎక్స్‌లో సందేశాన్ని తెలిపారు.

తదుపరి వ్యాసం