తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay Nethanna Deeksha : 10న సిరిసిల్లలో బండి సంజయ్ 'నేతన్న దీక్ష'

Bandi Sanjay Nethanna deeksha : 10న సిరిసిల్లలో బండి సంజయ్ 'నేతన్న దీక్ష'

HT Telugu Desk HT Telugu

07 April 2024, 8:31 IST

    • Bandi Sanjay Nethanna deeksha: ఈనెల 10వ తేదీన సిరిసిల్లలో బండి సంజయ్ నేతన్న దీక్ష చేపట్టనున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు ఈ  ‘దీక్ష’ చేయాలని నిర్ణయించినట్లు సంజయ్ తెలిపారు.
బండి సంజయ్ నేతన్న దీక్ష
బండి సంజయ్ నేతన్న దీక్ష

బండి సంజయ్ నేతన్న దీక్ష

Bandi Sanjay Nethanna Deeksha:సిరిసిల్లలో ‘‘వస్త్ర పరిశ్రమలు మూతబడి నెలలు గడుస్తున్నా పట్టించుకోరా? తినడానికి తిండిలేక నేతన్నలు చస్తున్నా చలించరా? ఆదుకోవాల్సిన పాలకులు రాజకీయాలకే పరిమితమవుతారా?’’అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) మండిపడ్డారు. సిరిసిల్లలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుడు లక్ష్మీనారాయణ భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్దిక ఇబ్బందులతోనే లక్ష్మినారాయణ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకుని వెంటనే ఆయన కుటుంబానికి రూ.లక్ష ఆర్దిక సాయాన్ని అందించారు. ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న లక్ష్మీనారాయణ కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ సర్కార్ నేతన్నల ఉసురు తీస్తుంది…

మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేత కార్మికులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు బిజెపి ఎంపీ బండి సంజయ్. బతుకమ్మ చీరల బకాయిలు రూ.270 కోట్లు చెల్లించకపోవడంతోపాటు కొత్త ఆర్డర్లు ఇవ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో వస్త్రపరిశ్రమలు మూతపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు భిక్షాటన కూడా చేసినా స్పందించడం లేదని..ఇది మంచి పద్దతి కాదన్నారు . తక్షణమే చనిపోయిన లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఆదుకోవాలని నష్టపరిహారం అందించి నేతన్నల్లో భరోసా నింపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే రూ.270 కోట్ల బకాయిలను చెల్లించి కొత్త ఆర్డర్లు ఇచ్చి వస్త్ర పరిశ్రమ యధావిధిగా కొనసాగేలా చూడాలన్నారు. 50 శాతం విద్యుత్ సబ్సిడీని పునరుద్దరించి, యార్న్ సబ్సిడీని కొనసాగించాలని డిమాండ్ చేశారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలని, అంతిమంగా నేతన్నలకు భరోసా ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. దీనిపై గతంలో సీఎంకు లేఖ రాశానని అయినా స్పందన లేకపోవడంతో నేతన్నలకు అండగా, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు ఈనెల 10న ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సిరిసిల్లలో ‘దీక్ష’ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దీక్షకు సంఘీభావం తెలిపి విజయవంతం చేయాలని కోరారు.

రిపోర్టింగ్ - HT Telugu Correspondent K.V. REDDY, Karimnagar.

తదుపరి వ్యాసం