Dhoni power hitting: ధోనీ సిక్సర్ల మోత.. చెన్నై ఫ్యాన్స్ ఖుష్.. వీడియో వైరల్
10 March 2023, 11:43 IST
- Dhoni power hitting: ధోనీ సిక్సర్ల మోత మోగించాడు. అది చూసి చెన్నై ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మిస్టర్ కూల్ ఐపీఎల్ 2023 కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్న ఎమ్మెస్ ధోనీ
Dhoni power hitting: చాలా రోజుల తర్వాత మళ్లీ ధోనీ పవర్ హిట్టింగ్ చూసే అవకాశం చెన్నై అభిమానులకు కలిగింది. ఐపీఎల్ స్వదేశానికి తిరిగొచ్చిన వేళ.. అన్ని టీమ్స్ తమ హోమ్ గ్రౌండ్స్ లో ఇప్పటికే ప్రిపరేషన్ మొదలుపెట్టాయి. అందులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కూడా తమ హోమ్ గ్రౌండ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో సాధన చేస్తోంది.
చెన్నై కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ప్రతి రోజూ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. తాజాగా గురువారం (మార్చి 9) కూడా అతడు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను చెన్నై ఫ్రాంఛైజీ తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. తలా అప్‌డేట్ అనే క్యాప్షన్ తో చెన్నై టీమ్ ఈ వీడియోను షేర్ చేసింది. ఇందులో ధోనీ సిక్సర్ల మోత మోగించడం చూడొచ్చు. పేస్, స్పిన్ అనే తేడా లేకుండా అందరు బౌలర్లను ధోనీ ఉతికారేశాడు.
లాంగాన్, డీప్ మిడ్ వికెట్, నేరుగా బౌలర్ తలపై నుంచి ధోనీ సిక్స్ లు బాదాడు. రెండేళ్ల కిందటే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోనీ.. ప్రస్తుతం కేవలం ఐపీఎల్లోనే ఆడుతున్న విషయం తెలిసిందే. దీంతో అతని ఆట చూసే అవకాశం ఈ మెగా లీగ్ లోనే దక్కుతుంది. పైగా ఈసారి సొంతగడ్డపై అతడు ఆడుతుండటంతో చెన్నై అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోంది.
ఈ మధ్యే సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఏర్పాటు చేసిన క్యాంప్ కోసం ధోనీ చెన్నై రాగా.. అతన్ని చూడటానికి ఎయిర్ పోర్టులో అభిమానులు పోటెత్తారు. ఈ ఏడాది సొంత ప్రేక్షకుల ముందు ఆడి ఐపీఎల్ కు కూడా గుడ్ బై చెప్పాలని భావిస్తున్న ధోనీ.. అందుకు తగినట్లే ప్రాక్టీస్ చేస్తున్నాడు. చివరిసారి చెన్నై ప్రేక్షకులను తన బ్యాటింగ్ విన్యాసాలతో ఉర్రూతలూగించడానికి సిద్ధమవుతున్న మిస్టర్ కూల్.. తన మార్క్ సిక్స్ లను నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండటం విశేషం.
గతేడాది ఈ నాలుగుసార్లు ఛాంపియన్ టీమ్ 9వ స్థానంలో సరిపెట్టుకుంది. ఆడిన 14 మ్యాచ్ లలో కేవలం 4 మాత్రమే గెలిచింది. ఇక ఈసారి మార్చి 31న ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ తో చెన్నై తలపడనుంది. ఈసారి బెన్ స్టోక్స్ రాకతో చెన్నై మరింత బలోపేతమైంది. అతన్ని రూ.16.25 కోట్లు పెట్టి వేలంలో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.