తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే ఎందుకు అమలు చేయలేం?.. కారణం ఇదేనంటున్న ప్రభుత్వం..

Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే ఎందుకు అమలు చేయలేం?.. కారణం ఇదేనంటున్న ప్రభుత్వం..

HT Telugu Desk HT Telugu

21 September 2023, 18:01 IST

  • Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. దాదాపు అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు పలికాయి. కానీ, ఆలస్యం చేయకుండా, వెంటనే, 2024 ఎన్నికల నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశాయి.

ప్రధాని మోదీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోనియా గాంధీ, ఆధిర్ రంజన్ చౌధరి, మల్లిఖార్జున్ ఖర్గే తదితరులు..
ప్రధాని మోదీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోనియా గాంధీ, ఆధిర్ రంజన్ చౌధరి, మల్లిఖార్జున్ ఖర్గే తదితరులు..

ప్రధాని మోదీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోనియా గాంధీ, ఆధిర్ రంజన్ చౌధరి, మల్లిఖార్జున్ ఖర్గే తదితరులు..

Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. బిల్లు బుధవారం లోక్ సభ ఆమోదం పొందింది. 454 మంది సభ్యులు బిల్లుకు మద్దతు పలకగా, కేవలం ఇద్దరు ఎంపీలు వ్యతిరేకించారు.

33% రిజర్వేషన్లు..

లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, ఢిల్లీ అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్లను కల్పించడానికి ఉద్దేశించిన బిల్లు అది. ఆ బిల్లు అమల్లోకి వస్తే, ఇప్పుడు కేవలం 10% లోపు ఉన్న లోక్ సభ మహిళా సభ్యుల సంఖ్య 33 శాతానికి పెరుగుతుంది. అంటే, దాదాపు 181 మంది మహిళా సభ్యులు లోక్ సభ లో ఉంటారు. రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ మహిళా సభ్యుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ రిజర్వేషన్లు రాజ్య సభ, రాష్ట్రాల శాసన మండలిల్లో వర్తించవు. ప్రత్యక్ష ఎన్నికలు జరిగే చట్ట సభలకే ఇవి వర్తిస్తాయి.

వెంటనే అమలు చేయాలి..

బిల్లుకు మద్దతిచ్చిన పార్టీలు కూడా కొన్ని కీలక అంశాలను లేవనెత్తాయి. ఆలస్యం చేయకుండా వెంటనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలన్నది అందులో ముఖ్యమైనది. ఇదే విషయాన్ని తమ ప్రసంగాల్లో కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా స్పష్టంగా డిమాండ్ చేశారు. అయితే, వెంటనే మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఒకవేళ అమలు చేయాలని చూస్తే, అది చట్ట ప్రకారం చెల్లదని వివరిస్తోంది. చట్ట పరంగా, న్యాయపరంగా చిక్కులు వస్తాయని స్పష్టం చేస్తోంది. ఒక సీటును ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేకుండా మహిళలకు కేటాయించడం సముచితం కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా లోక్ సభలో ప్రసంగిస్తూ వివరించారు. అలా చేయడం అనవసర న్యాయపరమైన వివాదాలను తలకెత్తుకోవడమేనని వివరించారు.

జనగణన, నియోజకవర్గాల పునర్విభజన

‘‘మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలంటే ముందుగా జన గణన చేపట్టాలి. 2011 జనాభా లెక్కల అనంతరం మళ్లీ జనగణన చేపట్టలేదు. 2021 జన గణన కోవిడ్ కారణంగా సాధ్యం కాలేదు. కాబట్టి, ముందుగా జనగణన చేపట్టి, ఆ గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. ఆ తరువాతనే మహిళలకు ఏయే స్థానాలను రిజర్వ్ చేయాలన్నది శాస్త్రీయంగా తేలుతుంది’’ అని ప్రభుత్వం వాదిస్తోంది. దీన్ని కాంగ్రెస్, టీఎంసీ వంటి ప్రతిపక్షాలు తోసిపుచ్చుతున్నాయి. రిజర్వేషన్లు కల్పించడాన్ని ఆలస్యం చేయడానికే ప్రభుత్వం ఈ కారణాలు చెబుతోందని విమర్శిస్తున్నాయి.

ఓబీసీలకు..

మహిళలకు కేటాయించిన 33% సీట్లలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా ఉండాలని కాంగ్రెస్, ఇతర విపక్షాలు కోరుతున్నాయి. సోనియా గాంధీ తన ప్రసంగంలో కూడా ఈ డిమాండ్ చేశారు. అయితే, ఇది కూడా సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం ఇది ఏడో సారి.

తదుపరి వ్యాసం