women's reservation bill: ‘‘మీ దృష్టిలో మా విలువ ఆవుల కన్నా తక్కువా?’’ - కేంద్రంపై నిప్పులు చెరిగిన టీఎంసీ ఎంపీ మహువా-are we women less than cows that mahua moitra says quota not even in 2029 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Women's Reservation Bill: ‘‘మీ దృష్టిలో మా విలువ ఆవుల కన్నా తక్కువా?’’ - కేంద్రంపై నిప్పులు చెరిగిన టీఎంసీ ఎంపీ మహువా

women's reservation bill: ‘‘మీ దృష్టిలో మా విలువ ఆవుల కన్నా తక్కువా?’’ - కేంద్రంపై నిప్పులు చెరిగిన టీఎంసీ ఎంపీ మహువా

HT Telugu Desk HT Telugu

women's reservation bill: మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చలో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మోదీ ప్రభుత్వ ద్వంద్వ నీతిపై మండిపడ్డారు. మహిళలకు రిజర్వేషన్లను మరికొన్ని ఏళ్లు వాయిదా వేయడమే ఈ బిల్లు ఎజెండా అని నిప్పులు చెరిగారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో మాట్లాడుతున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా

women's reservation bill: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు జుమ్లా తప్ప మరొకటి కాదని తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రా (Mahua Moitra) అన్నారు. 2029 నాటికి కూడా ఇది అమల్లోకి రాదని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ అనే అంశం ఇప్పుడు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన అనే రెండు అనిశ్చిత అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. కేంద్రం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు బూటకమని, దీన్ని చారిత్రాత్మక బిల్లు అనకూడదని మహువా మొయిత్రా అన్నారు.

సంతోషం.. బాధ .. రెండూ..

''భారత పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై మాట్లాడటం తనకు ఒకవైపు గర్వంగానూ, మరొకవైపు అవమానంగానూ ఉందని మహువా మెయిత్రా వ్యాఖ్యానించారు. తమ ఎంపీలలో 37% మంది మహిళలు ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీని కావడం తనకు గర్వంగా ఉందని.. అదే సమయంలో.. కేవలం 15% మహిళలు ఉన్న లోక్ సభలో సభ్యురాలిగా ఉన్నందుకు బాధగానూ తనకు ఉందని ఆమె వ్యాఖ్యానించారు. లోక్ సభలో మహిళల ప్రాతినిధ్యం ప్రపంచ సగటు అయిన 26.5% కంటే చాలా తక్కువ అని, అలాగే, ఆసియా ప్రాంతీయ సగటు 21% కంటే కూడా తక్కువని ఆమె వివరించారు.

ఇంకా ఆలస్యం కావడానికే..

ఈ బిల్లు ప్రభుత్వం చెప్పుకుంటున్నట్లుగా చారిత్రాత్మక బిల్లు కాదని, ఈ బిల్లు అసలు ఎజెండా మహిళలకు రిజర్వేషన్లను మరింత ఆలస్యం చేయడమేనని మహువా మొయిత్రా విమర్శించారు. ‘‘మహిళల రిజర్వేషన్లు అమల్లోకి రావడానికి ముందుగా దేశవ్యాప్తంగా జనగణన జరగాలి. ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఇవన్నీ జరిగిన తరువాతనే మహిళలకు రిజర్వేషన్లు సాధ్యం అంటున్నారు. కానీ ఇవ్వన్నీ ఎప్పుడు జరుగుతాయి? 2029 నాటికి కూడా ఈ పనులన్నీ సాధ్యం కాదు. అంటే మహిళలకు రిజర్వేషన్లు 2029 నాటికి కూడా అసాధ్యమే’’ అని మహువా మొయిత్రా వివరించారు. అందువల్ల మహిళా రిజర్వేషన్ అనేది జుమ్లా అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది’ అన్నారు.

షరతులు పెట్టవద్దని..

ఈ బిల్లును బేషరతుగా, ఏకగ్రీవంగా ఆమోదించాలని బీజేపీ నేతలు తమకు ఫోన్ చేసి కోరుతున్నారని మహువా మొయిత్రా వెల్లడించారు. అయితే, మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని బీజేపీ గుర్తించాలన్నారు. నిజానికి మహిళా రిజర్వేషన్లను ఎలాంటి చట్టాలు లేకుండానే తమ నాయకురాలు, దేశంలో ఏకైక మహిళా సీఎంగా ఉన్న మమత బెనర్జీ అమలు చేశారని మహువా గుర్తు చేశారు. పార్లమెంటుకు 37% మహిళా ఎంపీలను బేషరతుగా పంపిన ఘనత ఆమెదేనన్నారు. ‘‘ఈ రోజు మీరు తీసుకొచ్చిన బిల్లు పేరు మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు, అది మహిళా రిజర్వేషన్ రీషెడ్యూలింగ్ బిల్లు. మహిళా రిజర్వేషన్లను ఆలస్యం చేయడమే దాని ఎజెండా” అని మోయిత్రా వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

ఆవుల కన్నా తక్కువా?

దేశంలో ఆవుల కంటే మహిళల విలువ తక్కువనా? అని మహువా మొయిత్రా ప్రశ్నించారు. ‘‘గోరక్షణ కోసం మీరు కార్యక్రమం చేపట్టినప్పుడు.. మొదట గోవులను లెక్కించి, ఆ లెక్కల ఆధారంగా ఆ తరువాత గో శాలలను నిర్మించలేదు. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అనుకున్నప్పుడు మాత్రం అన్ని లెక్కలు పూర్తయ్యేంత వరకు మేం ఎదురు చూడాలా?’’ అని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.