తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Truckers Strike: రెండో రోజుకు చేరిన ట్రక్కర్స్ సమ్మె; పెట్రోలు బంక్ ల ముందు వాహనాల బారులు; సమ్మెకు కారణమేంటి?

Truckers strike: రెండో రోజుకు చేరిన ట్రక్కర్స్ సమ్మె; పెట్రోలు బంక్ ల ముందు వాహనాల బారులు; సమ్మెకు కారణమేంటి?

HT Telugu Desk HT Telugu

02 January 2024, 14:04 IST

    • Truckers strike: భారతీయ శిక్షా స్మృతి() ఐపీసీ స్థానంలో కొత్తగా రానున్న భారతీయ న్యాయ సంహిత లోని పలు కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త ట్రక్కర్స్ సమ్మె మంగళవారం రెండో రోజుకు చేరింది.
హరియాణాలో నిరసనకారుల ప్రదర్శన
హరియాణాలో నిరసనకారుల ప్రదర్శన

హరియాణాలో నిరసనకారుల ప్రదర్శన

Truckers strike: బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ (IPC) స్థానంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyay Sanhita BNS) అనే చట్టాన్ని తీసుకువస్తోంది. అయితే, ఈ చట్టంలో ట్రక్ డ్రైవర్లు, ట్రక్ యజమానులకు వ్యతిరేకంగా పలు నిబంధనలు ఉన్నాయని ట్రక్ డ్రైవర్లు, ట్రక్ యజమానులు వాదిస్తున్నారు. ఆ నిబంధనలను తొలగించాలని కోరుతూ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మె జరుపుతున్నారు.

కొత్త చట్టంలో ఏముంది?

కొత్తగా రానున్న భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyay Sanhita BNS) చట్టంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి పలు కఠిన నిబంధనలను పొందుపర్చారు. ముఖ్యంగా, రోడ్డు ప్రమాదం చేసి, బాధితులను అక్కడే వదిలేసి, కనీసం పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకుండా పారిపోయే (hit-and-run) వాహనాల యజమానులకు సంబంధించి కఠినమైన జరిమానాలను ప్రవేశపెట్టింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఇలాంటి ఘటనలకు పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్ష, రూ.7 లక్షల భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.

దేశవ్యాప్త నిరసన

ట్రక్కర్ల సమ్మె మంగళవారానికి రెండో రోజుకు చేరడంతో, గ్యాస్, పెట్రోలు, డీజిల్, తదితర నిత్యావసరాల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెట్రోలు బంక్ ల ముందు వాహనదారులు బారులు తీరి కనిపిస్తున్నారు. నిత్యావసరాల ధరలకు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం ఈ విధంగా ఉంది.

మహారాష్ట్ర

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ల కొరతను తగ్గించేందుకు నిరంతరాయంగా సరఫరా జరిగేలా చూడాలని మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసులను, సంబంధిత అధికారులను కోరింది. ఈ సమ్మెతో ఎల్పీజీ సిలిండర్లను రిటైల్ ఏజెన్సీల గోడౌన్ లకు పంపే ప్రక్రియకు అంతరాయం ఏర్పడిందని అధికారులు గుర్తించారు. సమ్మెలో పాల్గొంటున్న లారీ డ్రైవర్లు ప్లాంటుకు రిపోర్టు చేయకపోవడంతో పంపిణీ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతున్నట్లు సమాచారం.

గుజరాత్

గుజరాత్ లో సమ్మె ప్రభావం ఎక్కువగా ఉంది. వల్సాద్, గిర్ సోమనాథ్, భరూచ్, మెహసానా జిల్లాల గుండా వెళ్లే రహదారులను ఆందోళనకారులు వ్యూహాత్మకంగా అడ్డుకోవడంతో మెహసానాలోని మెహసానా-అంబాజీ హైవే, ఖేడాలోని అహ్మదాబాద్-ఇండోర్ హైవే మార్గాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రధాన హైవేల్లో టైర్లను కాల్చివేయడంతో కనేరా గ్రామం సమీపంలోని అహ్మదాబాద్-వడోదర హైవేపై 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. నిలిపి ఉంచిన ట్రక్కుల పొడవైన క్యూలతో సహా నిరసనలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడ్తున్నాయి.

రాజస్థాన్

ధోల్పూర్-కరౌలి మార్గం, ఉదయ్పూర్-నాథ్ద్వారా మార్గం, సవాయ్ మాధోపూర్-కోటా లాల్సోట్ మార్గం, భిల్వారా-అజ్మీర్ మార్గం, అనుప్గఢ్-గంగానగర్ సహా ప్రధాన రహదారి మార్గాల్లో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. ఆర్టీసీ బస్సులను కూడా నిరసనకారులు అడ్డుకున్నారు.

తదుపరి వ్యాసం