తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rise And Fall: బోరిస్ జాన్సన్.. శిఖరం నుంచి పతనం

Rise and fall: బోరిస్ జాన్సన్.. శిఖరం నుంచి పతనం

07 July 2022, 16:05 IST

    • బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ (Boris Johnson) ప్రజల మన్ననలు అందుకున్న కొద్దికాలానికే మూకుమ్మడి విమర్శలు ఎదుర్కొని పతనం అంచులకు చేరుకున్నారు.
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ (AFP)

బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్

బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధాన మంత్రిగా మూడేళ్లు కొనసాగారు. కుంభకోణాల నేపథ్యంలో పలుచనయ్యారు. రాజీనామా చేసేందుకు కొద్ది నెలలుగా తిరస్కరించినా.. తన సహచరుల ఒత్తిడి మేరకు వైదొలిగేందుకు గురువారం సిద్ధమయ్యారు.

July 2019: బోరిస్ జాన్సన్ విక్టరీ

థెరిసా మే రాజీనామా అనంతరం 2019 జూలైలో విదేశాంగ మంత్రి జెరెమీ హంట్‌పై భారీ విజయం నమోదు చేస్తూ కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా ఎన్నికయ్యారు.

యురోపియన్ యూనియన్ నుంచి వేగవంతంగా నిష్క్రమిస్తామన్న హామీ ఇస్తూ క్వీన్ ఎలిజబెత్ 2 ద్వారా బోరిస్ జాన్సన్ ప్రధాన మంత్రిగా నియమితులయ్యారు.

January 2020: బ్రెగ్జిట్ హీరో

జాన్సన్ డిసెంబరు 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 80 సీట్ల మెజారిటీతో గెలుపొందారు. తద్వారా ఆయన పార్లమెంటులో బ్రెగ్జిట్ ఒప్పందాన్ని త్వరగా ఆమోదింపజేసుకోగలిగారు.

రెఫరెండమ్ జరిగిన మూడున్నరేళ్లకు జనవరి 31, 2020న యూకే అధికారికంగా యురోపియన్ యూనియన్ నుంచి విడిపోయింది.

March 2020: కోవిడ్ మహమ్మారి భయాలు..

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి వ్యాపిస్తుండడంతో బోరిస్ జాన్సన్ యూకే వ్యాప్తంగా మార్చి 23న లాక్ డౌన్ ప్రకటించారు.

నాలుగు రోజుల తరువాత ఆయన తనకు కూడా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని, స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయని ప్రకటించారు.

ఏప్రిల్ 5న ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. తదుపరి రోజు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్పించారు.

April 2021: వాల్‌పేపర్ గేట్ (Wallpapergate)

కోవిడ్ మహమ్మారి‌పై ప్రభుత్వం స్పందించిన తీరుపట్ల బోరిస్ జాన్సన్ ప్రభుత్వం తరచుగా విమర్శలపాలైంది. నెమ్మదిగా స్పందించిందని, తీవ్రతను తగ్గించి వేర్వేరుదశల్లో పార్లమెంటులో అబద్దాలు వల్లించారని విమర్శలు వచ్చాయి.

చీఫ్ అడ్వైజర్ డామినిక్ కమ్మింగ్స్‌ను తొలగించిన సందర్భంలోనే జాన్సన్ అధికారిక ఫ్లాట్‌కు మరమ్మతులకు అయాచితంగా లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలు ఎదురయ్యాయి.

May 2021: ఎన్నికల్లో విజయాలు

బోరిస్ జాన్సన్ ప్రాతినిథ్యం వహిస్తున్న కన్జర్వేటివ్స్ పార్టీ ఉప ఎన్నికల్లో లేబర్ పార్టీపై విజయాలు నమోదు చేసింది. లేబర్ పార్టీ కంచుకోటగా ఉన్న ఈశాన్య ఇంగ్లాండ్ ప్రాంతంలోని హార్టిల్‌పూల్‌లో కూడా విజయం నమోదు చేసింది.

December 2021: పార్టీగేట్

డిసెంబరు ఆరంభంలో డౌనింగ్ స్ట్రీట్‌లోని ప్రధాని నివాసంలో కోవిడ్ లాక్‌డౌన్ల నేపథ్యంలో పలుమార్లు ఇల్లీగల్‌గా పార్టీలు సాగాయని వెల్లడైంది.

తమ ఆప్తులు చనిపోయినప్పుడు కనీసం చూడడానికి కూడా నోచుకోలేని ప్రజలు ఇలాంటి వార్తల నేపథ్యంలో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనై బోరిస్ జాన్సన్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని మండిపడ్డారు.

పార్టీల జాబితా పెరగడంతో లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ సహా పలు అధికారిక దర్యాప్తులు మొదలయ్యాయి.

చట్టాన్ని అతిక్రమించినందుకు తనకు పోలీసులు జరిమానా విధించారని ఏప్రిల్ 12న జాన్సన్ ప్రకటించారు. ఒక ప్రధాన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి జరిమానా విధించడం ఇదే తొలిసారి.

అతని వివరణలు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. తాను పార్లమెంటును తప్పుదోవ పట్టించడం లేదని ఎంపీలకు హామీ ఇచ్చారు. నిజానికిిది రాజీనామా చేయాల్సినంత పెద్ద సంఘటన.

May 2022: ఎన్నికల్లో పరాజయం

పార్టీ గేట్ కుంభకోణం బోరిస్ జాన్సన్ ప్రజాదరణ తగ్గడానికి కారణమైంది. చట్టవిరుద్ధంగా లాబీయింగ్ చేశాడన్న అభియోగాలు ఎదుర్కొన్న తన సన్నిహిత ఎంపీ ఓవెన్ పాటర్సన్‌ను కాపాడారన్న విమర్శలు కూడా ప్రజాదరణ తగ్గడానికి కారణమైంది. ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో బ్రిటన్ ప్రజల జీవన వ్యయం పెరిగిపోవడంతో బోరిస్ జాన్సన్ పార్టీ మే 5 న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాజయం పాలైంది.

June 2022: విశ్వాస పరీక్ష

జూన్ 6న సొంత పార్టీలోని ఎంపీలే బోరిస్ జాన్సన్‌పై అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. పాటర్సన్ కేసును, పార్టీగేట్‌ను ప్రస్తావించారు. అయితే అతి స్వల్ప మెజారిటీతో బోరిస్ జాన్సన్ విశ్వాస పరీక్షలో నెగ్గారు. కానీ ఆయన పార్టీలోని 40 శాతానికంటే ఎక్కువగా సభ్యులు జాన్సన్‌కు మద్దతు ఇవ్వలేమని చెప్పారు.

సెక్స్ స్కాండల్స్

ఆయన పార్టీ ఎంపీల వరుస సెక్స్ స్కాండల్స్ ఆయన తలనొప్పులను ఇంకా పెంచాయి. ఒక అత్యాచారం కేసులో ఒక ఎంపీ అరెస్టయ్యాడు. మాజీ ఎంపీ ఒకరికి మే నెలలో 18 నెలల శిక్ష కూడా పడింది. ఓ టీనేజీ బాలుడిపై లైంగిక దాడి చేశారన్న ఆరోపణలు రుజువయ్యాయి.

లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ఎంపీల స్థానాల్లో ఉప ఎన్నికలు జరగగా రెండింట్లో ప్రతిపక్ష పార్టీలు గెలిచాయి.

మొన్న ఫిబ్రవరిలో క్రిస్ పించర్‌ను తన ప్రభుత్వంలోకి తీసుకోవడంపై బోరిస్ జాన్సన్ జూలై 5న క్షమాపణలు కోరారు. పించర్‌పై ఆరోపణలు ఉన్నాయని ముందే తెలిసినా ప్రభుత్వంలో నియమించారన్న విమర్శలు వచ్చాయి.

రాజీనామాల పర్వం..

ఆర్థిక మంత్రి రిషి సునక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావీద్ జూలై 5న రాజీనామాలు చేశారు. ఇక కుంభకోణాల ప్రభుత్వాన్ని కాపాడడం తమ వల్ల కాదని చేతులెత్తేశారు.

<p>బోరిస్ జాన్సన్</p>

పదుల సంఖ్యలో జూనియర్ మంత్రులు, మినిస్టీరియల్ సహాయకులు, ఇతర కేబినెట్ మంత్రులు ఇదే బాటలో పయనించి బోరిస్ జాన్సన్‌కు ఆ పదవిలో ఉండడం తగదని స్పష్టం చేశారు.

టాపిక్

తదుపరి వ్యాసం