తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Adhir Ranjan Chowdhury: అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలపై దుమారం.. ఉభయ సభలు వాయిదా

Adhir Ranjan Chowdhury: అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలపై దుమారం.. ఉభయ సభలు వాయిదా

HT Telugu Desk HT Telugu

28 July 2022, 12:00 IST

    • న్యూఢిల్లీ, జూలై 28: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని దురుద్దేశపూర్వకంగా టార్గెట్ చేసినందుకు క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గురువారం కాంగ్రెస్‌ను దూషిస్తూ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీ ఆదివాసి, దళిత, స్త్రీ వ్యతిరేక పార్టీ అని దేశానికి తెలుసని అన్నారు.
కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ
కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ (PTI)

కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ

కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును "రాష్ట్రపత్ని" అని పేర్కొనడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. పార్లమెంటులో, బయట కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని స్మృతి ఇరానీ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరు సంబోధిస్తున్నప్పుడు పొరపాటున ‘రాష్ట్రపత్ని’ అనే పదాన్ని ఉపయోగించానని, అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా గోరంతను కొండంతులుగా చేసేందుకు ప్రయత్నిస్తోందని అధిర్ రంజన్ చౌదరి అన్నారు.

అధిర్ రంజన్ చౌదరి ఇప్పటికే క్షమాపణలు చెప్పారని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏఎన్ఐతో అన్నారు.

సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు.

లోక్‌సభలో స్మృతి ఇరానీ అధీర్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ అధీర్ రంజన్, సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని కోరారు. బీజేపీ సభ్యులు ఆమెకు మద్దతుగా నిలబడ్డారు.

‘భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ప్రకటించినప్పటి నుండి ఆమెను కాంగ్రెస్ పార్టీ దురుద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంది. కాంగ్రెస్‌వారు ఆమెను కీలుబొమ్మ అభ్యర్థిగా అభివర్ణించారు. కాంగ్రెస్‌ వారు ఆమెను చెడుకు చిహ్నంగా పేర్కొన్నారు. వారి దాడులు దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్నికైన తర్వాత కూడా ద్రౌపది ముర్ముకు వ్యతిరేకంగా ఆగేలా కనిపించడం లేదు’ అని స్మృతి ఇరానీ ఈరోజు పార్లమెంట్ ప్రారంభానికి ముందు విలేకరులతో అన్నారు.

మహిళా నాయకురాలు సోనియాగాంధీ నాయకత్వం వహిస్తున్నప్పటికీ కాంగ్రెస్‌ వాదులు రాజ్యాంగ పదవుల్లో మహిళలను కించపరుస్తూనే ఉన్నారని ప్రతిపక్ష పార్టీపై కేంద్రమంత్రి మండిపడ్డారు.

‘ఈ విధంగా భారత రాష్ట్రపతిని ఉద్దేశించి ప్రసంగించడం రాజ్యాంగ పదవిని మాత్రమే కాకుండా, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న గొప్ప గిరిజన వారసత్వాన్ని కూడా కించపరచడమేనని కాంగ్రెస్‌కు తెలుసు’ అని స్మృతి ఇరానీ అన్నారు.

దేశ అధ్యక్షుడిని కించపరచడం అంటే దేశంలోని మహిళల సామర్థ్యాన్ని కించపరచడమేనని అధిర్ చౌదరికి తెలుసునని కేంద్ర మంత్రి ఆరోపించారు.

దేశంలోనే చరిత్ర సృష్టించిన నిరుపేద కుటుంబానికి చెందిన గిరిజన మహిళను కాంగ్రెస్ పార్టీ నిరంతరం అవమానపరుస్తోందని ఆమె అన్నారు.

గురువారం పార్లమెంట్‌ ఆవరణలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు మహిళా ఎంపీలు నిరసనకు దిగారు.

కాగా అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలపై దుమారం రేగడంతో పార్లమెంటు ఉభయ సభలు వాయిదాపడ్డాయి. ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదాపడ్డాయి. రాష్ట్రపతిని అగౌరవ పరచడం పట్ల ఉభయసభల్లో బిజెపి మహిళా ఎంపీల ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ ప్రజలకు, ఆదివాసీలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

తదుపరి వ్యాసం