తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Aadhaar-voter Id: ఆధార్ కార్డు ఓటర్ కార్డు లింక్‌పై సుప్రీం కోర్ట్ ఏమన్నదంటే..

Aadhaar-Voter ID: ఆధార్ కార్డు ఓటర్ కార్డు లింక్‌పై సుప్రీం కోర్ట్ ఏమన్నదంటే..

25 July 2022, 13:34 IST

    • ఆధార్ కార్డు ఓటర్ కార్డు లింక్‌పై సుప్రీం కోర్ట్ పిటిషనర్‌ను ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. పిటిషన్ పూర్తి వివరాలు, సుప్రీం కోర్టు ఆదేశాలు ఇక్కడ చదవండి.
ఆధార్-ఓటర్ ఐడీ కార్డుపై సుప్రీం కోర్టు ఉత్తర్వులు
ఆధార్-ఓటర్ ఐడీ కార్డుపై సుప్రీం కోర్టు ఉత్తర్వులు (Shrikant Singh)

ఆధార్-ఓటర్ ఐడీ కార్డుపై సుప్రీం కోర్టు ఉత్తర్వులు

న్యూఢిల్లీ, జూలై 25: ఎలక్టోరల్ రోల్ డేటాను ఆధార్ ఎకో సిస్టమ్‌తో అనుసంధానం చేసే ఎన్నికల చట్ట సవరణను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలాను ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.

న్యాయమూర్తులు జస్టిస్ డి.వై.చంద్రచూడ్, ఎ.ఎస్.బోపన్నలతో కూడిన ధర్మాసనం హైకోర్టుకు వెళ్లేందుకు సుర్జేవాలాకు స్వేచ్ఛను ఇచ్చింది.

‘పీఐఎల్ ఎన్నికల చట్ట సవరణ చట్టంలోని సెక్షన్ 4, 5 చెల్లుబాటును సవాలు చేస్తున్నందున, సమర్థవంతమైన ప్రత్యామ్నాయ పరిష్కారం హైకోర్టు ముందు ఉంది. ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకు వెళ్లడానికి స్వేచ్ఛను ఇస్తున్నాం..’ అని బెంచ్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డుల అనుసంధానం పౌరుల గోప్యత ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని సుర్జేవాలా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఆధార్, ఓటర్ ఐడీని అనుసంధానం చేయడం పూర్తిగా "అహేతుకమైనది" అని కాంగ్రెస్ నాయకుడు తన అభ్యర్థనలో పేర్కొన్నారు. ఆకస్మిక సవరణ రెండు పూర్తిగా భిన్నమైన పత్రాలను లింక్ చేయడానికి ఉద్దేశించిందని, ఆధార్ కార్డ్ నివాస రుజువు, ఓటర్ ఐడీ రుజువు పౌరసత్వానికి సంబంధించినదని పేర్కొన్నారు.

‘ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ డేటాతో ఆధార్ డేటాను లింక్ చేయడం వల్ల ఓటర్ల వ్యక్తిగత, ప్రైవేట్ డేటా చట్టబద్ధమైన అథారిటీకి అందుబాటులో ఉంటుంది, ఓటర్లపై పరిమితి విధించేందుకు వీలవుతుంది..’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు తన తీర్పులో గోప్యత హక్కు, అంటే ప్రైవేట్ డేటాను గోప్యంగా ఉంచే హక్కు ప్రభుత్వానికి లేదా ఏదైనా చట్టబద్ధమైన సంస్థకు అందుబాటులో ఉండదని పేర్కొందని పిటిషనర్ పేర్కొన్నారు. కొన్ని పరిస్థితులలో తప్ప ప్రతి పౌరుడికి హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుగా గుర్తు చేశారు.

కార్డులను లింక్ చేయడం వల్ల ఓటరుపై నిఘా అవకాశాలు పెరుగుతాయని, ఓటర్ల ప్రైవేట్, సున్నితమైన డేటాను వాణిజ్యపరమైన దోపిడీకి గురిచేయవచ్చని సూర్జేవాలా తన విజ్ఞప్తిలో పేర్కొన్నారు.

‘ప్రస్తుతం పౌరుల డేటాను రక్షించడానికి ఎటువంటి చట్టాలు లేనందున పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుంది’ అని పేర్కొన్నారు.

ఓటరు ఐడీలతో ఆధార్‌ను లింక్ చేయడానికి అధికారం ఇచ్చే ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లును డిసెంబర్ 2021లో మూజువాణి ఓటు ద్వారా లోక్‌సభ ఆమోదించింది.

తదుపరి వ్యాసం