తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ukraine Crisis | ప్రధాన నగరాలపై దాడులతో ఉక్రెయిన్‌ను ఆక్రమించిన రష్యా దళాలు

Ukraine Crisis | ప్రధాన నగరాలపై దాడులతో ఉక్రెయిన్‌ను ఆక్రమించిన రష్యా దళాలు

HT Telugu Desk HT Telugu

24 February 2022, 13:02 IST

    • Ukraine Crisis | ప్రధాన నగరాలపై దాడులతో రష్యా దళాలు ఉక్రెయిన్‌పై దాడి చేశాయి.
కీవ్‌లోని ఒక మెట్రో స్టేషన్‌లో తలదాచుకున్న ఓ కుటుంబం
కీవ్‌లోని ఒక మెట్రో స్టేషన్‌లో తలదాచుకున్న ఓ కుటుంబం (AFP)

కీవ్‌లోని ఒక మెట్రో స్టేషన్‌లో తలదాచుకున్న ఓ కుటుంబం

రష్యా దళాలు ఉక్రెయిన్‌లోని అనేక నగరాలపై క్షిపణులను ప్రయోగించాయి . ఉక్రెయిన్‌‌లో సైనిక చర్య ప్రారంభమైందని రష్యా ప్రభుత్వ టీవీలో పుతిన్ మాట్లాడిన కొద్దిసేపటికే ఉక్రేనియన్ రాజధాని కీవ్‌లో తెల్లవారుజామున పేలుళ్లు వినిపించాయి.

రాజధాని ప్రధాన విమానాశ్రయం సమీపంలో తుపాకీ కాల్పుల మోత వినిపించినట్టు ఇంటర్‌ఫాక్స్ వార్తా సంస్థ తెలిపింది. నగరంలో సైరన్‌ల మోత వినిపించింది.

‘పుతిన్ ఇప్పుడే ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించారు. శాంతియుత ఉక్రెయిన్ నగరాలపై దాడి జరిగింది..’  అని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ట్విట్టర్‌లో తెలిపారు.

‘ఇది దురాక్రమణతో కూడిన యుద్ధం. ఉక్రెయిన్ తనను తాను రక్షించుకుంటుంది . గెలుస్తుంది కూడా. ప్రపంచం పుతిన్‌ను ఆపగలదు. ఆపాలి. చర్య తీసుకోవలసిన సమయం ఇప్పుడు వచ్చింది..’ అని కోరారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ దండయాత్రపై స్పందిస్తూ ఉక్రెయిన్ ప్రజలు అన్యాయమైన దాడికి గురవుతున్నారని, వారి క్షేమాన్ని తలుస్తున్నానని, ప్రతిస్పందనగా కఠినమైన ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు.

‘నేను జీ7 నాయకులతో సమావేశమవుతాను. మేం, మిత్రదేశాలు, భాగస్వాములు కలిసి రష్యాపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తాం..’ అని బైడెన్ ఒక ప్రకటనలో తెలిపారు.

నాటో తూర్పువైపు విస్తరణకు ముగింపు పలకాలని రష్యా డిమాండ్ చేస్తూ వస్తోంది. అమెరికా నేతృత్వంలోని అట్లాంటిక్ సైనిక కూటమిలో ఉక్రేనియన్ సభ్యత్వం ఆమోదయోగ్యం కాదని పుతిన్ తన వైఖరిని పునరావృతం చేశారు. వేరే మార్గం లేకుండా పోయిన తర్వాత తాను సైనిక చర్యకు అధికారం ఇచ్చానని ప్రకటించారు.

‘ఆధునిక ఉక్రెయిన్ భూభాగం నుండి ఎదురవుతున్న నిరంతర ముప్పుతో రష్యా సురక్షితంగా, అభివృద్ధి చెందదు. ఉనికిలో ఉండదు..’ అని పుతిన్ అన్నారు. ‘రక్తపాతానికి బాధ్యత ఉక్రెయిన్‌లోని పాలకులదే..’ అని అన్నారు.

రష్యా సైనిక చర్య పూర్తి పరిధిని స్పష్టంగా చెప్పలేదు. అయితే ‘ఉక్రేనియన్ భూభాగాలను ఆక్రమించడం లేదు..’ అని స్పష్టం చేశారు.

ప్రజలను రక్షించాల్సిందిగా రష్యా బలగాలను ఆదేశించామని చెప్పారు. ఆయుధాలను విడనాడాలని ఉక్రెయిన్ మిలిటరీకి విజ్ఞప్తి చేశారు.

ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలు, సరిహద్దు గార్డులపై రష్యా క్షిపణి దాడులు చేసిందని, అనేక నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ చెప్పారు. నాన్ స్టాప్ సైబర్ దాడులు కూడా కొనసాగుతున్నాయని ఓ అధికారి నివేదించారు. మార్షల్ లా ప్రకటించామని, తాను బైడెన్‌తో టెలిఫోన్ ద్వారా మాట్లాడానని జెలెన్స్కీ చెప్పారు. 

ఉక్రెయిన్ వైమానిక స్థావరాలలో సైనిక మౌలిక సదుపాయాలను స్వాధీనం చేసుకున్నట్టు, వైమానిక రక్షణను డీగ్రేడ్ చేసినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించిందని రష్యా మీడియా వెల్లడించింది.

కీవ్‌లోని మిలిటరీ కమాండ్ సెంటర్లు, ఈశాన్యంలోని ఖార్కివ్ నగరం క్షిపణుల దాడికి గురయ్యాయని ఉక్రెయిన్ మీడియా వెల్లడించింది. అయితే రష్యా దళాలు దక్షిణ ఓడరేవు నగరాలైన ఒడెస్సా, మార్యు‌పోల్‌లలో దిగాయి. మార్యుపోల్‌లో మూడు పెద్ద పేలుళ్లను రాయిటర్స్ ప్రతినిధి విన్నారు.

రష్యా మద్దతు గల వేర్పాటువాదులు తూర్పున ఉక్రేనియన్-నియంత్రిత పట్టణం షాష్టియాపై దాడికి పాల్పడ్డారని రష్యా ఇంటర్‌ఫాక్స్ వార్తా సంస్థ తెలిపింది. పేలుళ్లు తూర్పు ఉక్రేనియన్ నగరం డోనెట్స్‌క్‌ను కూడా కదిలించాయి.

కాగా వేర్పాటువాదులు ఉక్రేనియన్ దాడులను ఆపాలంటూ సహాయం కోసం మాస్కోకు ఒక అభ్యర్ధన పంపాయన్న వార్తలను రష్యా ప్రచారంగా అమెరికా కొట్టిపడేసింది.

నిర్ణయాత్మక మార్గంలో స్పందన ఉంటుంది..

ఉక్రెయిన్‌లో యుఎస్ దళాలను మోహరించారన్న పుతిన్ ఆరోపణలను తోసిపుచ్చిన బైడెన్.. ప్రాణనష్టం, విపత్తును కలిగించే యుద్ధాన్ని పుతిన్ ఎంచుకున్నారని అన్నారు.

‘ఈ దాడి వల్ల కలిగే విధ్వంసానికి రష్యా మాత్రమే బాధ్యత వహిస్తుంది. యునైటెడ్ స్టేట్స్, దాని మిత్రదేశాలు, భాగస్వాములు ఐక్యంగా, నిర్ణయాత్మక మార్గంలో ప్రతిస్పందిస్తాయి’ అని అన్నారు.

నాటో సెక్రటరీ-జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ రష్యా దాడిని నిర్లక్ష్యపూరితమైందని, ఈ పరిణామాలను పరిష్కరించడానికి నాటో మిత్రపక్షాలు సమావేశమవుతాయని అన్నారు.

యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ భద్రతా మండలి సమావేశం తర్వాత మాట్లాడుతూ మానవత్వంతోనైనా యుద్ధాన్ని ఆపాలని పుతిన్‌కు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా ఉక్రెయిన్ పౌర విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. తన గగనతలాన్ని మూసివేసింది. కాగా మార్చి 2 వరకు ఉక్రెయిన్‌తో సరిహద్దు సమీపంలోని విమానాశ్రయాలలో దేశీయ విమానాలను నిలిపివేసినట్లు రష్యా ఏవియేషన్ ఏజెన్సీ తెలిపింది.

పుతిన్ రెండు వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించి, శాంతి పరిరక్షక దళాలను మోహరించాలని ఆదేశించినప్పటి నుంచి ఉద్రిక్తత నెలకొంది.

టాపిక్

తదుపరి వ్యాసం