తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rbi Rates Hike : వడ్డీ రేట్ల పెంపు తథ్యం.. నేడు ఆర్‌బీఐ ప్రకటన

RBI rates hike : వడ్డీ రేట్ల పెంపు తథ్యం.. నేడు ఆర్‌బీఐ ప్రకటన

08 June 2022, 9:29 IST

    • ముంబై, జూన్ 8: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బుధవారం రెపో రేటును మరో 40 బేసిస్ పాయింట్లు పెంచుతూ 4.80 శాతంగా మార్చనున్నట్టు మార్కెట్ అనలస్టులు, ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఉదయం 10 గంటలకు ప్రకటన చేయనున్నారు.
ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశం అనంతరం వడ్డీ రేట్ల పెంపుపై వెలువడనున్న ప్రకటన
ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశం అనంతరం వడ్డీ రేట్ల పెంపుపై వెలువడనున్న ప్రకటన (REUTERS)

ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశం అనంతరం వడ్డీ రేట్ల పెంపుపై వెలువడనున్న ప్రకటన

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్భణం 6 శాతం కంటే అధికంగా ఉండబోతుందని, ఇది ఇంతకుముందు వేసిన అంచనా 5.6 శాతం కంటే అధికమని, ఈ నేపథ్యంలో ద్రవ్యోల్భణం అదుపులో ఉంచేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచనుందని విశ్లేషిస్తున్నారు.

గడిచిన కొద్ది నెలలుగా రిజర్వ్ బ్యాంక్ సహన పరిమితిని మించి ద్రవ్యోల్భణ అంచనాలు ఉంటుండడంతో ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వడ్డీ రేట్ల పెంపు తథ్యంగా భావిస్తున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ వద్ద పెంపు అంచనాలను ప్రస్తావించగా.. అంతగా ఆలోచించాల్సిన పని లేదన్న అర్థంలో మాట్లాడారు. అంటే పెంపు తథ్యమని సంకేతాలిచ్చారు.

వడ్డీ రేట్ల పెంపు తథ్యమని ఆర్‌బీఐ గవర్నర్ సంకేతాలు ఇచ్చినప్పటికీ ఎంత శాతం పెంచుతారన్న ప్రశ్నకు సమాధానం లేదు.

‘ఆర్‌బీఐ జూన్ పాలసీ సమావేశంలో మరో 40 బేసిస్ పాయింట్లు పెంచుతుందని అంచనా వేస్తున్నాయి. అయితే అది 35-50 మధ్య ఎక్కడైనా ఉండొచ్చు. కోవిడ్ కంటే ముందు ఉన్న రెపో రేటు 5.15 శాతం చేరడానికి మానిటరీ పాలసీ కమిటీ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. లేదా ఆగస్టు సమావేశం నాటికి 5.15 శాతానికి చేరుకోవచ్చు..’ అని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ సీనియర్ ఆర్థిక వేత్త సువోదీప్ రక్షిత్ చెప్పారు.

గడిచిన రెండేళ్లలో తొలిసారిగా మే నెలలో అకస్మాత్తుగా నిర్వహించిన పాలసీ సమావేశంలో ఆర్బీఐ 0.40 శాతం పెంచుతూ రెపో రేటును 4.4 శాతంగా మార్చింది. బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటే ఈ రెపో రేటు.

ఈ ఏడాది ఆరంభం నుంచి ఆర్‌బీఐ పరిమితి 2-6 శాతం మధ్య ఉండాల్సిన ద్రవ్యోల్భణం అంతకు మించి ఉంటోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం భారత దేశపు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్భణం ఏప్రిల్లో 7.79 శాతంగా ఉంది. జనవరి 2022 నుంచి 6 శాతం కంటే పైనే ఉంది.

ఇటీవలికాలంలో ద్రవ్యోల్భణంలో పెరుగుదల ఒత్తిళ్ల కారణంగా ఆర్‌బీఐ తన ద్రవ్యోల్భణ అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని తన అంచనాలను సవరించుకునే అవకాశం ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్భణం 4.5 శాతం ఉంటుందని ఆర్‌బీఐ తొలుత అంచనా వేసింది. తిరిగి ఏప్రిల్‌లో ఈ అంచనాలను సవరిస్తూ 5.7 శాతం ఉంటుందని ప్రకటించింది. మళ్లీ సుమారు 6.5 శాతానికి పెంచే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనావేసింది.

ఆర్‌బీఐ మేలో పెంచిన 0.40 శాతానికి అదనంగా, జూన్ సమావేశంలో, అలాగే తిరిగి ఆగస్టు రివ్యూలో కూడా వడ్డీ రేట్లను పెంచనుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ తన రీసెర్చ్ నోట్‌లో అంచనా వేసింది.

టాపిక్

తదుపరి వ్యాసం