తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఓటుకు లాటరీ టికెట్.. సర్పంచ్ ఎన్నికల కోసం ఓటర్లకు ఓ అభ్యర్థి జాక్‌పాట్ ఆఫర్లు

ఓటుకు లాటరీ టికెట్.. సర్పంచ్ ఎన్నికల కోసం ఓటర్లకు ఓ అభ్యర్థి జాక్‌పాట్ ఆఫర్లు

Manda Vikas HT Telugu

15 February 2022, 22:51 IST

    • ఎన్నికల్లో గెలిచేందుకు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నేతలు రకరకాల బహుమతులను అందివ్వడం మనకు తెలుసు. అయితే ఒకచోట మాత్రం అవీఇవీ కాకుండా ఏకంగా ఓటర్లకు లాటరీ టికెట్స్ పంచుతూ తనకే ఓటేయాలని ఓటర్లను ప్రలోభపెట్టడం ఇప్పుడు వైరల్ గా మారింది.
Lottery Ticket offer for vote in Odisha Panchayat Polls
Lottery Ticket offer for vote in Odisha Panchayat Polls (HT Photo)

Lottery Ticket offer for vote in Odisha Panchayat Polls

Odisha | ఎన్నికల్లో గెలిచేందుకు నేతలు టన్నుల కొద్దీ హామీలు ప్రకటించడం, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రకరకాల బహుమతులను అందివ్వడం మనకు తెలుసు. అయితే ఒకచోట మాత్రం అవీఇవీ కాకుండా ఏకంగా ఓటర్లకు లాటరీ టికెట్స్ పంచుతూ తనకే ఓటేయాలని ఓటర్లను ప్రలోభపెట్టడం ఇప్పుడు వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. ఒడిషా రాష్ట్రంలో, కలహండి జిల్లాలోని కుహురా గ్రామపంచాయితీకి బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానం కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సుస్మితా నాయక్ అనే మహిళా నాయకురాలు ఓటర్లకు గాలం వేసేందుకు లాటరీ టికెట్లను పంచింది. 

మొదటి బహుమతి 10 గ్రాముల బంగారం, రెండవ బహుమతి రిఫ్రిజిరేటర్, మూడో బహుమతిగా 10 గ్రాముల వెండి, నాల్గవ బహుమతిగా ఇద్దరు విజేతలకు రెండు వాషింగ్ మిషన్లు అందజేస్తానని ప్రకటించింది. 

తనను సర్పంచిగా గెలిపిస్తే, లాటరీ ద్వారా బంగారు, వెండి ఆభరణాలు, రిఫ్రిజిరేటర్, బీరువా, మిక్సర్-గ్రైండర్, చీరలు, పిల్లలకు ఆట వస్తువులు ఇలా ఒకటేమిటి గ్రామంలోని ప్రజలందరికీ సరిపోయేలా 1300కు పైగా బహుమతులు అందిస్తామని ప్రకటించింది. మార్చి 13న ఉదయం 10.30 గంటలకు కుహురా గ్రామంలో లక్కీ డ్రా ఉంటుందని, లాటరీ గెలిచిన అదృష్ట విజేతలను ప్రకటిస్తామని సుష్మిత ప్రకటించింది.

ఇంకా ఒక అడుగు ముందుకు వేసి.. "ఇది లంచం కాదు, లాటరీ ద్వారా నా సొంత డబ్బుతో ప్రజలకు నేనందించే బహుమానం. తద్వారా ఓటర్లు నా విజయోత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటారు" ఆమె చెప్పుకొచ్చింది. అయితే, మిగతా అభ్యర్థులు సుష్మిత వ్యవహారంపై గగ్గోలు పెట్టడంతో వివాదం ముదిరి ఎట్టకేలకు ఆమె వెనక్కి తగ్గింది.

తదుపరి వ్యాసం