తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Inspiring Story: రిప్పన్ కపూర్.. ఒక స్ఫూర్తిదాయకమైన కథ.. మీరు తప్పక చదవాల్సిందే

Inspiring Story: రిప్పన్ కపూర్.. ఒక స్ఫూర్తిదాయకమైన కథ.. మీరు తప్పక చదవాల్సిందే

HT Telugu Desk HT Telugu

Published Apr 10, 2024 04:03 PM IST

google News
    • రిప్పన్ కపూర్ కథ మనందరికీ స్ఫూర్తిదాయకం. రూ. 50 లతో ఆయన ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. ఆ కథ మీరూ చదవండి.
సంస్థ బ్యానర్‌తో చిన్నారుల నడక

సంస్థ బ్యానర్‌తో చిన్నారుల నడక

అతడొక సామాన్యుడు. కానీ అతడి సానుభూతి అసామాన్యం. అతడు విమానాల్లో నింగిలో విహరించేవాడు. కానీ నేల మీద చిన్నారుల దుస్థితి చూసి చలించిపోయేవాడు. ఆ పరిస్థితులను మార్చటానికి తన వంతు కృషి చేయాలని నడుంకట్టాడు. కేవలం 50 రూపాయలు పోగుచేసి ఒక ఉద్యమానికి ఊపిరిపోశాడు. అతడి జీవితం నాలుగు పదులు నిండకుండానే ముగిసిపోయింది. కానీ అతడి నిస్వార్థ కృషి, అతడి మరణానంతరం మూడు దశాబ్దాల తరువాత కూడా కొనసాగుతోంది. భారతదేశం అంతటా ఎంతో మంది చిన్నారుల జీవితాలను మెరుగుపరుస్తూ విస్తరిస్తూనే ఉంది. CRY - Child Rights and You వ్యవస్థాపకుడు రిప్పన్ కపూర్ కథ ఇది.

రిప్పన్ కపూర్ మూలాలు

1947లో బ్రిటిష్ ఇండియా విభజన నేపథ్యంలో రిప్పన్ కపూర్ తల్లిదండ్రులు లాహోర్ (ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉంది) నుండి కొత్త దిల్లీకి వలస వచ్చారు. రిప్పన్, అతడి కవల సోదరుడు విప్పన్‌తో కలిసి 1954లో దిల్లీలో జన్మించాడు. కొన్నేళ్లకు వారి కుటుంబం వృత్తి రీత్యా బొంబాయికి (ఇప్పుడు ముంబై) వెళ్లి అక్కడ స్థిరపడింది. రిప్పన్ అక్కడే చదువుకున్నాడు. ఆ తర్వాత ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో పర్సర్‌గా ఉద్యోగంలో చేరాడు.

ముంబైలోని వర్లిలో పెరిగిన రిప్పన్.. ఒకవైపు విలాసం, మరోవైపు నైరాశ్యం, ఒకవైపు సంపద, మరోవైపు దారిద్య్రం.. ఈ అసమానతలను చాలా దగ్గరగా చూశాడు. పేదరికంలో మగ్గుతున్న చిన్నారుల పట్ల చిన్నప్పటి నుంచే అతడిలో సానుభూతి మొదలైంది.

అణగారిన చిన్నారులు ఎదుర్కొంటున్న కఠోర పరిస్థితులను నిత్యం చూస్తున్న అతడిలో.. వారి కోసం ఏమైనా చేయాలనే తపన రగిలింది. అతడి తల్లి పరోపకార గుణం, అతిడి తండ్రి వృత్తి నిబద్ధతలు రిప్పన్‌ను ప్రభావితం చేశాయి. సమాజం పట్ల తనకు ఒక బాధ్యత ఉందని అతడు భావించేవాడు.

ఇండియన్ ఎయిర్‌లైన్స్ తో ఎయిర్‌లైన్ పర్సర్ గా రిప్పన్ పనిచేస్తుండటం వల్ల భారతదేశంలోని వైవిధ్యాలు, అసమానతలను విస్పష్టంగా చూసే అవకాశం అతడికి లభించింది. అణగారిన చిన్నారుల కోసం తన వంతు కృషి చేయాలన్న అతడి సంకల్పం మరింతగా బలపడింది.

ఆరంభం

రిప్పన్ కపూర్ కేవలం 25 సంవత్సరాల వయస్సులో 1979 లో ఆరుగురు స్నేహితుల నుంచి 7 రూపాయలు చొప్పున విరాళంగా సేకరించాడు. తను 8 రూపాయలు జతచేశాడు. మొత్తం 50 రూపాయలతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. అదే చైల్డ్ రిలీఫ్ అండ్ యు - CRY.

CRY జననం అకస్మాత్తుగా సంభవించింది కాదు. దానికి ముందు చాలా సంవత్సరాలుగా సాగిన ఆలోచనలు, అంతర్మథనాలు చివరికి CRY రూపం తీసుకున్నాయి. భారతదేశపు చిన్నారుల దుస్థితిని మార్చాలంటే సమష్టి కృషి అవసరమని రిప్పన్ అర్థం చేసుకున్నాడు.

చిన్నారులతో రిప్పన్ కపూర్

ఇందులో సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించే పనిని ప్రారంభించాడు. CRY విషయంలో రిప్పన్ ఆకాంక్ష చాలా సాధారణమైనదే కానీ చాలా లోతైనది: ప్రతి చిన్నారి హక్కులను, గౌరవాన్ని కాపాడటానికి వనరులను, సానుభూతిని సమీకరించటం.

బొంబాయి (ముంబై) లోని తన కుటుంబ నివాసంలో డైనింగ్ టేబుల్‌ను CRY మొదటి కార్యాలయంగా ఉపయోగిస్తూ రిప్పన్ తన పని మొదలుపెట్టాడు. స్నేహితుల సమావేశాలు, చిన్నారుల విషయంలో వారి ఆకాంక్షలకు వేదికగా మారిన ఆ డైనింగ్ టేబుల్ మీదనే CRY పురుడు పోసుకుంది. ఒక సాధారణమైన ఆలోచనకు నిబద్ధత, కృషి తోడైతే అది ఒక దేశవ్యాప్త శక్తిగా ఎదగగలదు అనటానికి ఇదే నిదర్శనం.

సంఘర్షణ

CRY ఆరంభంలో అంత సులభంగా సాఫీగా సాగలేదు. విరాళాలు సేకరించడం అంటే ముఖాముఖి కలవాలి. ఒప్పించాలి. మరోవైపు ప్రముఖ కళాకారులు, ఫోటోగ్రాఫర్లను రప్పించి వారు రూపొందించిన గ్రీటింగ్ కార్డులు, డైరీలు, క్యాలెండర్‌లను విక్రయిస్తూ నిధులు జమచేసేవారు. అకుంఠిత అంకితభావంతో, క్షేత్ర స్థాయిలో అవిరళ కృషి చేస్తూ, రిప్పన్ బృందం గణనీయంగానే నిధులు సమీకరించగలిగింది. ఒకప్పుడు నిరాశ తాండవించిన చోట ఆశను రేకెత్తించింది.

రిప్పన్ ఆకాంక్షించింది కేవలం దానం మాత్రమే కాదు. అంతకు మించింది. భారతదేశంలోని ప్రతి చిన్నారికీ న్యాయం దక్కాలన్నది అతడి ఆకాంక్ష. ఆ కాలంలో బాల కార్మికులు ఉండటం మామూలు విషయమే అని భావించే వారు. కుటుంబాలు బతకాలంటే పిల్లలూ పని చేయాల్సిందేనని సరిపెట్టుకునేవారు.

ఆ సమయంలో ప్రతి చిన్నారీ చదువుకుంటూ, ప్రేమ పొందుతూ అభివృద్ధి చెందే అవకాశం ఉండాలనే తన నమ్మకం మీద అతడు స్థిరంగా నిలబడ్డాడు. సామాజిక నియమాలను సవాల్ చేస్తూ, భారతదేశ చిన్నారుల భవిష్యత్ రూపకల్పనలో ప్రతి పౌరుడినీ భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ఈ సంస్థను నిర్మించాడు.

రిప్పన్‌కు ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఆస్పత్రుల్లో చేరుతూ, చికిత్సలు తీసుకుంటూ అనారోగ్యంతో పోరాడుతున్నప్పటికీ, CRY పట్ల అతడి నిబద్ధత చెక్కుచెదరలేదు. ఒకవైపు విమానయాన ఉద్యోగిగా తన విధులను నిర్వర్తిస్తూనే, మరోవైపు CRY బాధ్యతలను చూస్తూ చిన్నారుల హక్కుల కోసం పాటుపడటం కొనసాగించాడు రిప్పన్.

చిన్నారుల కోసం పని చేయటం అత్యవసరమని, అందులో ఏమాత్రం ఆలస్యం జరగరాదని రిప్పన్ తపించేవాడని ఆయన సహచరులు గుర్తుచేసుకుంటారు. పిల్లల కోసం ఎంత పని చేసినా తక్కువేననే విశ్వాసంతో ముందుకు సాగేవాడు. ఎప్పుడూ ఇంకా ఇంకా పనిచేయాలని చెప్పేవాడు.

పరిణామం

ముంబై నగరంలో ఒక డైనింగ్ టేబుల్ వేదికగా మొదలైన CRY అనతికాలంలోనే ఒక జాతీయ ఉద్యమంగా పరిణామం చెందింది. విరాళాల సేకరణలో, సమాజాన్ని భాగస్వామ్యం చేయటంలో CRY ప్రారంభించిన వినూత్న కృషి ఫలితంగా.. భారతదేశమంతటా చిన్నారులు ఎదుర్కొంటున్న వ్యవస్థీకృత సమస్యలపై సమాజాలు, ప్రభుత్వాలు దృష్టి సారించటం మొదలైంది. కార్పొరేట్ సంస్థల యజమానులు మొదలుకుని సాధారణ పౌరుల వరకూ విభిన్న వర్గాల వారిని కదిలించి, భాగస్వాములుగా మార్చటంలో రిప్పన్ స్ఫూర్తిదాయక కృషి కారణంగా.. CRY ప్రభావం, ప్రాధాన్యత కొత్త శిఖరాలకు చేరుకుంది.

అప్పటికి ఇంకా అభివృద్ధి చెందుతున్న ఈ సంస్థ.. చిన్నారుల జీవితాలను మార్చడానికి నిబద్ధతతో పనిచేస్తున్న వ్యక్తులు, సమూహాలకు నిధులు సమకూర్చింది. బాల కార్మికత నిర్మూలన కోసం పని చేస్తున్న శాంతా సిన్హా, ఆండల్ దామోదరన్, గ్లోరియా డిసౌజా, CLR కురియన్లు వంటి మార్గదర్శకులకు, విద్యారంగంలో నూతన ఆవిష్కర్తలకు CRY ఎలాంటి శషభిషలూ లేకుండా మద్దతునిస్తూ, నిధులు సమకూర్చింది.

రూపాంతరం

రిప్పన్ కపూర్ ఆరోగ్యం క్షీణించింది. కేవలం 39 సంవత్సరాల వయస్సులో 10 ఏప్రిల్ 1994 న ఆయన హఠాత్తుగా చనిపోయారు. ఆయన మరణం CRY సంస్థకి చాలా పెద్ద దెబ్బ. కానీ రిప్పన్ ఆకాంక్షలను, దూరదృష్టిని, సానుభూతిని పంచుకున్న అతడి సహచరులు రిప్పన్ కృషిని కొనసాగించారు. అన్యాయాన్ని ఎదుర్కొని, సమానత్వాన్ని సాధించే కొత్త తరం చేంజ్‌మేకర్స్‌కు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

బాలల హక్కులపై ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ మీద 1992లో భారతదేశం సంతకం చేసినప్పుడు, CRY ఈ అంశంపై పనిచేయడం ప్రారంభించింది. తొలుత పిల్లలకు సాయం అందించే సంస్థగా మొదలైన CRY క్రమక్రమంగా పిల్లల హక్కుల కోసం పనిచేసే సంస్థగా రూపాంతరం చెందింది. తనను తాను Child Rights and You గా తిరిగి ఆవిష్కరించుకుంది.

చిన్నారులను అణచివేస్తున్న సమస్యలను గుర్తించడానికి, వాటిని పరిష్కరించడానికి పిల్లలు, తల్లిదండ్రులు, సామాజిక సమూహాలు, స్థానిక ప్రభుత్వాలు కలిసి వచ్చినప్పుడు మాత్రమే శాశ్వత మార్పు సాధ్యమవుతుందని CRY విశ్వసించటం వల్ల ఈ రూపాంతరం అవసరమైంది.

లెగసీ

నేడు CRY, భారతదేశంలోని 19 రాష్ట్రాల్లో 102 స్థానిక ఎన్‌జీఓలతో కలిసి పనిచేస్తోంది. ఇప్పటివరకూ 30 లక్షలకు పైగా జీవితాల్లో సానుకూల మార్పు తీసుకువచ్చింది. రిప్పన్ కపూర్ ప్రభావం అతడి మరణానంతరం కూడా కొనసాగుతోంది. ఆయన 25 ఏళ్ల వయసులో 1979లో స్థాపించిన CRY సంస్థ.. ఆయన 39 సంవత్సరాల వయస్సులో 1994లో అకాల మరణం చెందిన తర్వాత కూడా అభివృద్ధి చెందుతూ, విస్తరిస్తూ ముందుకు సాగుతోంది. లక్షలాది మంది చిన్నారుల జీవితాలను ప్రభావితం చేస్తోంది.

చిన్నారుల సాధికారత కోసం, వారి హక్కుల కోసం అవిశ్రాంతంగా పనిచేయాలన్న రిప్పన్ సహానుభూతిని, ఆకాంక్షలను, దూరదృష్టిని పంచుకుంటూ అతడి కృషిని అంకితభావంతో కొనసాగిస్తున్న వ్యక్తులు, మద్దతుదారుల ద్వారా.. రిప్పన్ లెగసీ సజీవంగా ముందుకుసాగుతోంది.

చిన్నారితో రిప్పన్ కపూర్

సహానుభూతికి నిబద్ధమైన కృషి తోడైతే అది తీసుకురాగల మార్పు ఎంత శక్తిమంతంగా ఉంటుందనే దానికి రిప్పన్ జీవితం, అతడి కృషి ఒక నిదర్శనం. అతడి వారసత్వం కేవలం ఒక సంస్థ కథ మాత్రమే కాదు.. సామాజిక న్యాయం పట్ల ఒక వ్యక్తికి గల అచంచలమైన నిబద్ధత ఒక శాశ్వత ప్రభావాన్ని ఎలా నిర్మించగలదనే దానికి నిదర్శనం.

సంపద నిర్దేశించిన విధంగా, అధికారం ఆదేశించిన విధంగా నడిచే ప్రపంచంలో.. ఒక వ్యక్తి ప్రగాఢ నమ్మకం, అవిశ్రాంత కృషితో మార్పు మొదలుకాగలదని రిప్పన్ నిరూపించాడు. అతడి జీవితం మనకు ప్రేరణగా నిలుస్తుంది. మన పరిస్థితులను మించి వీక్షించడానికి, ప్రతి చిన్నారీ సాధికారంతో జీవించగలిగే ప్రపంచాన్ని స్వప్నించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. రిప్పన్ జీవితాన్ని, అతడి వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ.. అతడి సహానుభూతిని, స్ఫూర్తిదాయక కృషిని కొనసాగిద్దాం.

- వ్యాసకర్త: జాన్ రాబర్ట్స్, రీజినల్ డైరెక్టర్, సౌత్

CRY – చైల్డ్ రైట్స్ అండ్ యు

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
తదుపరి వ్యాసం