తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  దేశంలో భారీగా తగ్గిన రోజూవారీ కొవిడ్ కేసులు, మళ్లీ 2 లక్షల దిగువలో నమోదు

దేశంలో భారీగా తగ్గిన రోజూవారీ కొవిడ్ కేసులు, మళ్లీ 2 లక్షల దిగువలో నమోదు

HT Telugu Desk HT Telugu

01 February 2022, 10:04 IST

    • దేశంలో రోజూవారీ కొవిడ్ కేసులు 2 లక్షలకు దిగువన నమోదయ్యాయి. డైలీ పాజిటివిటీ రేటు కూడా చాలా తగ్గింది. సోమవారం నాడు 15.77 శాతంగా ఉన్న రోజూవారీ పాజిటివిటీ రేటు మంగళవారం ఉదయం నాటికి 11.69 శాతానికి పడిపోయింది. అయితే కరోనా మరణాలు మాత్రం రోజురోజుకి పెరుగుతున్నాయి.
COVID19 in India
COVID19 in India (HT_PRINT)

COVID19 in India

New Delhi, February 1| దేశంలో రోజూవారీ కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పాజిటివ్ కేసులు 2 లక్షలకు దిగువన నమోదయ్యాయి. డైలీ పాజిటివిటీ రేటు కూడా చాలా తగ్గింది.  సోమవారం నాడు 15.77 శాతంగా ఉన్న రోజూవారీ పాజిటివిటీ రేటు మంగళవారం ఉదయం నాటికి 11.69 శాతానికి పడిపోయింది. అయితే కరోనా మరణాల సంఖ్యలో మాత్రం ఎలాంటి మార్పు ఉండటం లేదు, కరోనా మరణాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. 

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,67,059 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనాతో పోరాడి దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 1192 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ సంఖ్య ఇలా ఉంటే గడిచిన ఒక్కరోజులో కొవిడ్ నుంచి మరో 2,54,076 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తంగా 3.92 కోట్లకు పైగా ప్రజలు ఈ వ్యాధి నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 94.60 శాతంగా ఉంది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసుల రేటు 4.20 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 17,43,059 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన నివేదికలో తెలిపింది.

వ్యాక్సినేషన్ వివరాలు

టెస్టులు, వ్యాక్సినేషన్ గణాంకాలను పరిశీలిస్తే.. గడిచిన ఒక్క రోజులో 14,28,672 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు దేశంలో 166 కోట్ల (1,66,68,48,204) డోసుల వ్యాక్సిన్ వినియోగం జరగగా, నిన్న ఒక్కరోజే సుమారు 61 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. ఇందులో బూస్టర్ డోస్ పొందిన వారు 6.28 లక్షల మంది ఉండగా, 15-18 ఏళ్ల వయస్సు వారు 3.59 లక్షల మంది రెండో డోస్ పూర్తి చేసుకున్నారు. ఇక మిగతా వారు సాధారణ డోస్ పొందిన వారున్నారు.

తదుపరి వ్యాసం