తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Himachal Pradesh Results: హిమాచల్‍లో బీజేపీ ఓటమికి 7 కారణాలు! కమలానికి ‘యాపిల్’ దెబ్బ కూడా..

Himachal Pradesh Results: హిమాచల్‍లో బీజేపీ ఓటమికి 7 కారణాలు! కమలానికి ‘యాపిల్’ దెబ్బ కూడా..

08 December 2022, 15:32 IST

    • Himachal Pradesh Assembly Election Results: హిమాచల్ ప్రదేశ్‍లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానానికి పడిపోయింది. అధికారం చేపట్టేందుకు కావాల్సిన మెజార్టీ మార్కును కాంగ్రెస్ సులువుగా సాధించింది. 
Himachal Pradesh Results: హిమాచల్‍లో బీజేపీ వైఫల్యానికి 7 కారణాలు!
Himachal Pradesh Results: హిమాచల్‍లో బీజేపీ వైఫల్యానికి 7 కారణాలు! (HT_Print)

Himachal Pradesh Results: హిమాచల్‍లో బీజేపీ వైఫల్యానికి 7 కారణాలు!

Himachal Pradesh Assembly Election Results: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. 68 నియోజకవర్గాలు ఉన్న హిమాచల్ ప్రదేశ్‍లో కాంగ్రెస్ 40 స్థానాల్లో గెలిచింది. హోరాహోరీ తప్పదని అంచనాలు వచ్చినా.. మెజార్టీ మార్కును కాంగ్రెస్ సులువుగానే సాధించింది. భారతీయ జనతా పార్టీ (BJP).. 25 నియోజకవర్గాల్లో గెలిచి.. రెండో స్థానానికి పరిమితమైంది. అధికారాన్ని కోల్పోయింది. ప్రధాని నరేంద్ర మోదీ హవాలోనూ హిమాచల్‍లో కమలం పార్టీకి ఎదురుదెబ్బ తగిలేందుకు కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతో పాటు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇలా హిమాచల్‍లో బీజేపీకి ప్రతికూలంగా మారిన 7 ప్రధానమైన అంశాలు ఏవంటే..

యాపిల్ రైతుల్లో వ్యతిరేకత

Himachal Pradesh Polls Results: యాపిల్ బాక్సులు, పురుగు మందులపై జీఎస్‍టీని 18 శాతానికి పెంచటంతో బీజేపీపై వ్యతిరేకత వ్యక్తమైంది. హిమాచల్ ప్రదేశ్‍లోని ఎక్కువ మంది యాపిల్ పెంపకందారులు ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాపిల్‍కు కనీస మద్దతు ధర కల్పించటంలోనూ కమలం పార్టీ ప్రభుత్వం విఫలమైందని కొందరు రైతులు భావించారని తెలుస్తోంది. మొత్తంగా 18 స్థానాల్లో యాపిల్ పెంపకందారుల ప్రభావం ఉందని విశ్లేషణలు ఉన్నాయి.

సంప్రదాయం

Himachal Pradesh Polls Results 2022: సాధారణంగా హిమాచల్ ప్రదేశ్‍లో ప్రతీ ఐదేళ్లకు అధికారం పార్టీల మధ్య చేతులు మారుతుంటుంది. 1985 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఏ పార్టీ కూడా వరుసగా రెండు సార్లు గెలువలేదు. ఈసారి బీజేపీ ఓటమికి ఈ సెంటిమెంట్ కూడా ఓ కారణంగా ఉంది. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను ఉపయోగించుకున్న కాంగ్రెస్ మళ్లీ విజయం సాధించింది.

పెన్షన్ స్కీమ్

తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని (Old Pension Scheme - OPS) మళ్లీ అమలులోకి తెస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడం కూడా బీజేపీ అవకాశాలను దెబ్బ తీసింది. హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 55 లక్షల ఓటర్లు ఉండగా.. అందులో సుమారు 5శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు. పాత పెన్షన్ విధానం కోసం ఉద్యోగులు అక్కడ ఉద్యమించారు. నూతన విధానాన్ని వ్యతిరేకించారు. దీంతో ఇది గమనించిన కాంగ్రెస్ పాత పెన్షన్ విధానాన్ని మళ్లీ అమలు చేస్తామని వారిని ఆకట్టుకుంది.

నిరుద్యోగం

హిమాచల్ ప్రదేశ్‍లో నిరుద్యోగ రేటు సుమారు 9.2 శాతంగా ఉంది. జాతీయ సగటు కంటే ఇది అత్యధికం. ఈ విషయం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారింది.

రెబల్స్ దెబ్బ

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి బీజేపీకి తిరుగుబాటు అభ్యర్థులు తలనొప్పులు తెచ్చిపెట్టారు. ఈ ఎన్నికల్లో 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీజేపీ సీటు నిరాకరించింది. కొందరు ఆశావాహులను కూడా చివరి నిమిషంలో తప్పించింది. దీంతో, ఇందులో కొందరు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేశారు. మొత్తంగా ఐదు నుంచి ఆరు స్థానాల వరకు రెబల్స్ దెబ్బ బీజేపీకి పడిందని తెలుస్తోంది.

అగ్నిపథ్

హిమాచల్ ప్రదేశ్ నుంచి యువత ఎక్కువ సంఖ్యలో ఆర్మీలో చేరుతుంటారు. అయితే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై హిమాచల్ రాష్ట్రంలో నిరసనలు అధికంగా జరిగాయి. యువత చాలా మంది ఈ అంశంలో కమలం పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ధరల పెరుగుదల, పాలనలో అనిశ్చితి

ఐదు సంవత్సరాల్లో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగటం వల్ల కూడా బీజేపీపై హిమాచల్ ప్రదేశ్‍లో వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా వంట గ్యాస్ ధరలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపాయని చెప్పవచ్చు.

మరోవైపు, సీఎం జైరామ్ ఠాకూర్ తరచూ చీఫ్ సెక్రటరీలను మార్చారు. ఐదేళ్లలో ఏడు మంది అధికారులను మార్చారు. ఇది కూడా ప్రతికూల పవనాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. పోలీస్ రిక్రూట్‍మెంట్ స్కామ్ కూడా కలకలం రేపింది.

తదుపరి వ్యాసం